Abdullapurmet Murder: కిరాతక హత్య నాకొడుకు ఒక్కడివల్ల కాదు, వెనుక ఎవరో ఉన్నారు - నిందితుడి తండ్రి
ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని హరిహర కృష్ణ తండ్రి డిమాండ్ చేశారు. హత్య కేసు విషయంలో పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ యువకుడి హత్య కేసులో నిందితుడైన హరిహర కృష్ణ తండ్రి ఈ ఘటనపై స్పందించారు. హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. తన కొడుకు కృష్ణ ఒక్కడే ఇంతటి కిరాతకానికి పాల్పడి ఉండడని అన్నారు. దీనివెనక ఇంకొంత మంది ప్రోద్బలం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య కేసు విషయంలో పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన పట్ల చనిపోయిన నవీన్ తల్లిదండ్రులకు హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
నిందితుడు హరిహరకృష్ణ రెగ్యులర్ గా సీఐడీ క్రైమ్ స్టోరీస్ చూసేవాడని తండ్రి ప్రభాకర్ వెల్లడించారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత ఈ నెల 23న హరిహరకృష్ణ తన దగ్గర నేరం ఒప్పుకున్నాడని చెప్పారు. హత్య విషయం తెలిశాక పోలీసులకు లొంగిపోవాలని తానే హరిహరకృష్ణకు చెప్పినట్లు వివరించారు. ఈ కేసులో తన కొడుకుకి చట్టరీత్యా ఏ శిక్ష వేసినా తమకు అంగీకరమేనని అన్నారు. నవీన్ తల్లిదండ్రుల బాధ తాను అర్థం చేసుకోగలనని హరిహరకృష్ణ తండ్రి చెప్పారు.