Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ డీపీఆర్‌లో జాప్యం, ప్రభుత్వ నిర్ణయమే కారణమా?
Hyderabad Metro News | రిటైర్డ్ ఇంజినీర్లను కొనసాగించకపోవడంతో హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ డీపీఆర్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకోనుందో త్వరలో తెలుస్తుంది.

Hyderabad Metro Rail Phase 2 | హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ డీపీఆర్ కొంచెం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వాస్తవానికి మార్చి 31వ తేదీలోగా అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. కానీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (Hyderabad Metro Rail) లో పనిచేస్తున్న కీలక ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తొలగించింది. దాంతో డిపిఆర్ ప్రక్రియ పూర్తి చేయడంపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా డీపీఆర్ ను జెన్సీలు రూపొందిస్తాయి. అదే సమయంలో ప్రభుత్వ సీనియర్ ఇంజనీర్లు సైతం DPRలో కీలక పాత్ర పోషిస్తారు. రిటైర్డ్ ఇంజనీర్ అధికారుల కొనసాగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో గత కొన్ని రోజులుగా వారు విధులు నిర్వహించడం లేదు. ఈ కారణాలతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశపై, పాతబస్తీ మెట్రో భూసేకరణ ప్రక్రియపై ప్రభావం చూపుతోంది.
మెట్రో కోసం హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఏర్పాటు
2007 మే 14వ తేదీన ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైలు పేరుతో ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ మెట్రో రైలు సంస్థకు జీహెచ్ఎంసీతో పాటు రెవెన్యూ, వాటర్ బోర్డు, విద్యుత్, రైల్వే విభాగాల నుంచి డిప్యూటేషన్ పై కేటాయించారు. వీరిలో చాలామంది అధికారులు మెట్రో రైలు సంస్థలోనే పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. వీరి సేవలు సంస్థకు అవసరం కావడంతో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో విశ్రాంత ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్ వి ఎస్ రెడ్డితో పాటు 28 మంది అధికారులు ఇదే విధానంలో పనిచేస్తున్నారు.
ఏడాది మార్చి 31 తో వీరి సేవలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గత వారం నుంచి ఆ సీనియర్ ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. మెట్రో ప్రాజెక్టు విస్తరణ డీపీఆర్ పనులు ఉన్నందున రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించాలని, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖను ఎన్ వి ఎస్ రెడ్డి గత నెలలోనే కోరారు. ఇప్పటివరకు మెట్రో రైలు సంస్థలో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించడంతో పాటు, ఆ స్థానాల్లో వేరే నియామకాలు జరగకపోవడంతో మెట్రో డిపిఆర్ లో జాప్యం జరుగుతుంది. మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తో పాటు మరికొందరు కీలక ఉద్యోగులను కొనసాగించడంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది.
ఈ నెలలో పూర్తయ్యేనా..
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు, జేబీఎస్- శామీర్పేట్, జేబీఎస్- మేడ్చల్ మార్గాల్లో మెట్రో విస్తరణకు సంబంధించి డిపిఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. డిపిఆర్ కు తుది మెరుగులు దిద్ది ప్రభుత్వానికి అధికారులు సమర్పించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రాజెక్టులుగా ఈ మెట్రో పనులు చేపట్టాలని ప్రతిపాదన ఉంది. డిపిఆర్ నివేదిక ప్రభుత్వానికి వచ్చాక, పరిశీలించిన అనంతరం మార్పులు చేర్పులు చేసి డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అనంతరం కేంద్రం అనుమతి కోసం డి పి ఆర్ ను పంపనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్ రెండు భాగం మెట్రో పనుల్లో కీలక దశ పూర్తి కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

