Hyderabad Rains: హైదరాబాద్‌లో భీకరగాలులు, వర్షం! వచ్చే 12 గంటలు ఇంతే - GHMC వార్నింగ్
Rains Effect: అత్యవసర సాయం కావాలనుకునే వారు వెంటనే 040-29555500 నెంబర్ కు కాల్ చేయడం ద్వారా సాయం పొందవచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో గత 5 రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలు అన్ని పనులకీ ఆటంకం కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటనలు కూడా చేస్తున్నారు. తాజాగా నేడు వచ్చే 12 గంటల పాటు హైదరాబాద్ లో బలమైన ఈదురుగాలుల సూచన ఉందని జీహెచ్ఎంసీలోని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. దీంతో మోస్తరు వర్షం కూడా పడుతుందని వెల్లడించింది. రాత్రి 10 గంటల వరకు ఈ గాలులు ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేసినట్లుగా జీహెచ్ఎంసీ తెలిపింది.
Moderate rainfall coupled with strong gusty winds may be present across the city for the next 12 hours. Treefalls may be expected. Citizens may plan their commute accordingly. DRF teams on high alert and attending to emergency calls. @KTRTRS @arvindkumar_ias @CommissionrGHMC pic.twitter.com/Fa2Me5FYBb
— Director EV&DM, GHMC (@Director_EVDM) July 12, 2022
ఎక్కువ తీవ్రతతో వీచే ఈ గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అందుకే ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. ప్రజలు ఎమర్జెన్సీ సమయాల్లో అవసరమైతేనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండిపోవాలని విజ్ఞప్తి చేసింది. గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించింది.
ఎమర్జెన్సీ సమయాల్లో ప్రతిస్పందించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొంది. ఎవరైనా అత్యవసర సాయం కావాలనుకునే వారు వెంటనే 040-29555500 నెంబర్ కు కాల్ చేయడం ద్వారా సాయం పొందవచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఎక్కడైనా తక్షణ అత్యవసర సాయం అవసరం అయితే 040 - 21111111 నెంబరుకు ఫోన్ చేయాలని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ట్వీట్ చేశారు. ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు.
అయితే, భారీ గాలుల హెచ్చరికల వేళ హెచ్‌ఎండీఏ కూడా అలర్ట్ అయింది. సంజీవయ్య పార్కులోని జాతీయ జెండాకు నష్టం వాటిల్లకుండా ముందుగానే చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్విటర్‌లో చెప్పారు. అందుకోసం జెండాను గాలులు పోయే వరకూ కిందకు దించినట్లు చెప్పారు.