Hyderabad News: బీజేపీ అభ్యర్థి చెంప చెళ్లు: ఏసీపీపై హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు - చర్యలకు డిమాండ్
Telangana News: ఏసీపీపై కమిషనర్ కు అమర్ సింగ్ ఫిర్యాదు చేశారు. తన చెంపపై కొట్టడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ నేత పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.
Hyderabad Latest News: ఆసిఫ్ నగర్ ఏసీపీపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కి కార్వాన్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఆసిఫ్ నగర్ డివిజన్ ఏసీపీ బి.కిషన్ కుమార్ అసభ్య పదజాలంతో తనను దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ హోటల్ మూసేస్తున్న సమయంలో మంగళవారం బీజేపీ నేత అమర్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై తాను కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేస్తానని అమర్ సింగ్ హెచ్చరించారు. దీంతో వెంటనే అమర్ సింగ్‌పై ఏసీపీ కిషన్ చెయ్యి చేసుకున్నారు. దీంతో అమర్ సింగ్ అనుచరులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.
దీనిపైనే ఏసీపీపై కమిషనర్ కు అమర్ సింగ్ ఫిర్యాదు చేశారు. అయితే, అనేక మద్యం దుకాణాలు, ఇతర పెద్ద వాణిజ్య దుకాణాలు నడుస్తున్నాయని.. ఏసీపీ మాత్రం షాపు మూసే విషయంలో తనను మాత్రమే బలవంతం చేసి, కొట్టారని అమర్ సింగ్ అన్నారు. ఇంకా తెరిచి ఉన్న ఇతర దుకాణాలను మూయించాలని తాను కోరినా ఆయన వినలేదని అన్నారు.
తాను గత 35 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నానని.. ప్రజా సేవలో ఉన్నత ప్రమాణాలను కొనసాగిస్తున్నానని అన్నారు. తన ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నానని అన్నారు. గత రెండు సార్లు తెలంగాణలోని కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు.
అకస్మాత్తుగా వచ్చి, తనను రెచ్చగొట్టి అత్యుత్సాహంతో ఏసీపీ వ్యవహరించారని అన్నారు. ఇది అసమంజసమైనదని.. తెలంగాణ పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి ఇది విరుద్ధం అని అమర్ సింగ్ అన్నారు.