Hyderabad: కర్మన్‌ఘాట్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తతలు, కారు ఢీకొని కత్తులతో దాడి చేశారంటూ ఆరోపణలు
G Rakshak: సాగర్ రింగ్ రోడ్డు నుంచి గోవులను తరలిస్తున్న ముఠాను గో రక్షక సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తమపై ఆ ముఠా ఎదురుదాడి చేసిందని గో రక్షక్ సభ్యులు ఆరోపించారు.
హైదరాబాద్‌లోని కర్మాన్ ఘాట్ ప్రాంతంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాగర్ రింగ్ రోడ్డు (Sagar Ring Road) నుంచి గోవులను తరలిస్తున్న ముఠాను గో రక్షక (Go Rakshak) సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తమపై ఆ ముఠా ఎదురుదాడి చేసిందని గో రక్షక్ సభ్యులు ఆరోపించారు. దీంతో సభ్యులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.
ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు నుండి IS సదన్ (సంతోష్ నగర్ - ఒవైసీ క్రాస్ రోడ్డు) వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గోవుల వాహనాన్ని గో రక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. ఇన్నోవా వాహనంలో వెళ్తున్న గో రక్షక్ కు చెందిన, ఐదుగురు సభ్యుల కారును వెనుక నుంచి ఢీకొట్టి, గోవులను తరలిస్తున్న ముఠా కత్తులతో దాడి చేసిందని గో రక్షక్ సభ్యులు ఆరోపించారు. దాడి నుండి తప్పించుకునేందుకు తాము ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయంలోకి దూరి తలదాచుకున్నామని గో రక్షక్ సభ్యులు వాపోయారు.
తాము వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చినా.. పోలీసులు సకాలంలో స్పందించలేదని గో రక్షక్ సభ్యులు ఆరోపణలు చేశారు. తమపై దాడి చేసి గోవులతో సహా దుండగులు పరారయ్యారని అన్నారు. సమాచారం అందుకున్న హిందూ సంఘాలు, గో రక్షక్ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ మొదలైన వారు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని, ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై, సకాలంలో స్పందించని పోలీసులపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సంఘటన స్థలం నుండి తరలివెళ్లిన గోవులను తక్షణమే క్షేమంగా వెనక్కి తీసుకరావాలని డిమాండ్ చేశారు. గో రక్షక్ సభ్యులపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేసి, కఠిన శిక్షలు అమలు చేయాలని, మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎల్బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఎల్బీ నగర్ ఏసీపీ, వనస్థలిపురం ఏసీపీ, సరూర్ నగర్, మీర్ పేట, వనస్థలిపురం ఇన్స్‌పెక్టర్లు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని చక్కబెట్టేందుకు లాఠీ ఛార్జ్ చేసి, ధర్నా చేస్తున్న వివిధ హిందు సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి, డీసీఎంలలో వారిని తరలించారు. మళ్లీ అంతా పోగుపడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.