(Source: ECI/ABP News/ABP Majha)
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే
నవంబరు 17న ఈడీ అధికారులు లైగర్ దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతల్లో ఒకరైన ఛార్మిని విచారణ చేశారు. దాదాపు 10 గంటల పాటు వీరి విచారణ సాగింది.
లైగర్ సినిమా వ్యవహారంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హీరో విజయ్ దేవరకొండను ప్రశ్నించడం ముగిసింది. దాదాపు తొమ్మిది గంటల పాటూ విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారణ చేశారు. లైగర్ సినిమాకు పెట్టుబడులపై ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మిలను ఈడీ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈడీ విచారణ బుధవారం (నవంబరు 30) రాత్రి 8 గంటల సమయంలో ముగిసింది. ఈ సందర్భంగా బయట ఉన్న మీడియా ప్రతినిధులు విజయ్ దేవరకొండను స్పందించాలని కోరగా ఆయన మాట్లాడారు.
తనకు పాపులారిటీ వస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు సహజం అని అన్నారు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని, అందులో ఇది ఒకటని అన్నారు. ఈడీ అధికారులు పిలిచారని, వారి డ్యూటీ వారు చేశారని అన్నారు. వారి వద్దకు వెళ్లి వివరణ ఇచ్చానని అన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు.
‘‘ఈడీ అధికారులు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. ఆ పాపులారిటీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో ఇదీ ఒకటి. నన్ను ఈడీ వాళ్లు పిలిస్తే ఇక్కడికి వచ్చి నా డ్యూటీ నేను చేశా. రేపు (గురువారం) మళ్లీ రావాలని ఏమీ అనలేదు’’ అని విజయ్ అన్నారు. ఏ కేసు గురించి మిమ్మల్ని విచారణ చేశారు అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా గుడ్‌నైట్ చెప్పి వెళ్లిపోయారు.
లైగర్ చిత్ర పెట్టుబడులు విషయంలోనే!
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన లైగర్ చిత్రానికి వచ్చిన పెట్టుబడుల అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది. కొందరు రాజకీయ నేతలు మనీలాండరింగ్ ద్వారా లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టారని అధికారులు అనుమానిస్తున్నారు.
నవంబరు 17న ఈడీ అధికారులు లైగర్ దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతల్లో ఒకరైన ఛార్మిని విచారణ చేశారు. దాదాపు 10 గంటల పాటు వీరి విచారణ సాగింది. ఆ వచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునేందుకు ఇప్పుడు విజయ్ దేవరకొండను విచారణ చేశారు.
ఉదయం 10.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ మధ్యలో విరామాలు ఇస్తూ విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేశారు. లైగర్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే అంశాలను అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఆ డబ్బులను చెక్కు రూపంలో తీసుకున్నారా లేదా నగదు రూపంలో పొందారా అనే కోణంలో అడిగారు. నిర్మాతలకు వచ్చిన పెట్టుబడుల అంశాన్ని కూడా అడగ్గా, ఆ విషయాలు తనకు తెలియవని, కేవలం నటించడం మాత్రమే తన బాధ్యత అని విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన దగ్గర్నుంచి సినిమా అగ్రిమెంటు స్కాన్ కాపీలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
మిగతా నిర్మాతలనూ విచారణ చేసే అవకాశం!
లైగర్ నిర్మాతల్లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌తోపాటు బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, అపూర్వ మెహతా కూడా ఉన్నారు. వీరికీ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించిన మైక్ టైసన్ రెమ్యునరేషన్ అంశాన్ని కూడా ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం.