Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సైబరాబాద్ ఫ్లైఓవర్ కింద వదిలి వెళ్లిన దుండగులు
Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే గుర్తు తెలియని దంపతులు ఆ బాలుడిని తీసికెళ్లినట్లు పోలీసులు సీటీ టీవీల ఆధారంగా గుర్తించారు.
Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ కు గురైన బాలుడి కేసు సుఖాంతం అయింది. బాలుడిని బయట ఉంచి బాత్రూంకు వెళ్లి వచ్చేలోపే బాలుడిని ఎవరో అపహరించారు. ఈ క్రమంలోనే బాబు తండ్రి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా.. బాబును ఎవరో గుర్తు తెలియని దంపతులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. చివరకు దుండుగులు బాలుడిని సైబరాబాద్ ఫ్లైఓవర్ కింద వదిలేసి వెళ్లారు.
అసలేం జరిగిందంటే..?
మెదక్ జిల్లా రాయలపురం గ్రామానికి చెందిన మంగళి దుర్గేష్ తన ఐదేళ్ల కుమారుడు శివ సాయి తో కలిసి తిరుపతికి వెళ్లాడు. ఈ నెల 28వ తేదీన తిరుగు ప్రయాణం అయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. అలసటగా ఉందని కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావించి రైల్వే స్టేషన్ లోనే సాయంత్రం వరకు పడుకున్నాడు. సాయంత్రం ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై కుమారుడిని ఉంచి అలాగే లగేజీ బ్యాగు దగ్గర పెట్టి బాత్రూంకు వెళ్లాడు. కొద్ది సేపటికి వచ్చి చూడగా బాలుడు కనిపించలేదు. దీంతో రైల్వే స్టేషన్ మొత్తం వెతికాడు. ఎలాంటి ఉపయోగమూ లేకపోవడంతో.. తండ్రి జీఆర్పీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. అయితే గుర్తు తెలియని దంపతులు బాలుడిని తీసుకుని వెళ్లినట్లు గుర్తించి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే బాలుడిని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు సైబర్ టవర్ ఫ్లైఓవర్ కింద పిల్లాడిని వదిలి వెళ్లిపోయారు. విషయం గుర్తించిన స్థానికులు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పజెప్పారు. బాలుడి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెంటనే సికింద్రాబాద్ రైల్వే హాస్పిటల్ కు తరలించి బాలుడికి చికిత్స అందిస్తున్నారు. అలాగే నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు.