హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణం: దేవరాజ్ అరెస్ట్, హైకోర్టు కీలక నిర్ణయం! మరో అవినీతి బాగోతం బట్టబయలు?
Hyderabad Cricket Association :హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంతలా అవినీతిలో క్రికెట్ ఆడుతుందో సీఐడీ తవ్వుతోంది. తాజాగా మరో కీలక అక్రమం వెలుగు చూసింది. మరోవైపు ఇంకో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు.

Hyderabad Cricket Association : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో శుక్రవారం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెచ్‌సీఏ అవినీతి కేసు విచారిస్తున్న సీఐడీ మరో వ్యక్తిని అరెస్టు చేయగా.... హెచ్‌సీఏ పర్యవేక్షణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు కేసులపై దర్యాప్తు సాగుతుండగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిందితుల మెడకు ఉచ్చి గట్టిగానే చుట్టుకున్నట్టు అర్థమవుతోంది.
అక్రమాలకు, అవినీతి అడ్డాగా మారిపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టికెట్ల కక్కుర్తి మొత్తం అవినీతి సామ్రాజ్యాన్ని పెకలించేస్తోంది. ఓవైపు సీఐడీ నిందితులను వేటాడుతుంటే మరోవైపు కోర్టులు నేరుగా పర్యవేక్షించడం అక్రమార్కులకు ఊపిరిసలపనివ్వడం లేదు.
తమిళనాడులో దొరికిన A-2
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను అడ్డాగా మార్చుకొని దోచుకున్న వారిలో మరో కీలకమైన వ్యక్తిని సీఐడీ పట్టుకుంది. హెచ్‌సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను తమిళనాడులో అరెస్టు చేసింది. ఈ కేసులో దేవరాజ్ A-2గా ఉన్నారు. కేసు నమోదై దాదాపు ఇరవైరోజులు అవుతున్న ఆయన పరారీలో ఉన్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన అరెస్టుతో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ముగ్గురుకు బెయిల్
ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి 20 శాతం టికెట్లు ఇవ్వాలని బెదిరించారన్న కేసులో అరెస్టు అయిన వారిలో ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివార్, సెక్రటరీ రాజేందర్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. A1గా ఉన్న జగన్ మోహన్ రావు కస్టడీని కోర్టు పొడిగించింది. ఆయనతోపాటు సీఈవో సునీర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై మల్కాజ్‌గిరి కోర్టు సోమవారం విచారించనుంది.
జస్టిస్ నవీన్‌రావుకు హెచ్‌సీఏ పర్యవేక్షణ బాధ్యత
హెచ్‌సీఏ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్‌రావుకు తెలంగాణహైకోర్టు అప్పగించింది. ఇకపై అసోసియేషన్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన పర్యవేక్షణలో జరగబోతున్నాయి. కీలకమైన వ్యక్తులంతా అవినీతి కూపంలో కూరుకుపోయి అరెస్టులు అవుతున్న వేళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్‌మోహన్‌రావును సీఐడీ పదిహేను రోజుల క్రితం అరెస్టు చేసింది. తాజాగా జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను కూడా అరెస్టు చేసింది. అందుకే రెగ్యులర్‌గా జరగాల్సిన కార్యకలాపాలు, దర్యాప్తు జరుగుతున్న వేల మిగతా వ్యవహారాలు జస్టిస్ నవీన్‌రావు చూసుకుంటారు.
సమ్మర్ క్యాంపుల పేరుతో దందా
ఐపీఎల్ టికెట్ల కోసం కక్కుర్తి పడి అడ్డంగా దొరికిపోయిన జగన్ బ్యాచ్ దందాలు తవ్వేకొద్ది వెలుగు చూస్తున్నాయి. క్లబ్‌లను తమ గుప్పెట్లో ఉంచుకొని ప్రతిభావంతమైన ఆటగాళ్లను తొక్కిపెట్టి డబ్బులు ఇచ్చే వాళ్లను ప్రోత్సహిస్తూ హైదరాబాద్ క్రికెట్ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చిందీ బ్యాచ్. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సమ్మర్ క్యాంపులతో కోట్లు నొక్కేశారనే కొత్త కుంభకోణం వెలుగు చూసింది.
నాలుగు కోట్లు కొట్టేసిన జగన్‌మోహన్ బ్యాచ్
ఏటా సమ్మర్‌లో క్యాంపులు పెడుతూ జగన్ బ్యాచ్ కోట్లు కొల్లగొట్టినట్టు వెల్లడైంది. గతేడాది మే 20 నుంచి పెట్టిన సమ్మర్ క్యాంపు పేరుతో నాలుగు కోట్లు కొట్టేశారని సీఐడీ గుర్తించింది. రాష్ట్రంలో 28 ప్రాంతాల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేసినట్టు కాగితాలపై సృష్టించారు. ప్రతీ క్యాంపులో వంద మంది చొప్పున మొత్తంగా 2500 మందికి శిక్షణ ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చింది.
ఇదంతా బూటకమని సీఐడీ విచారణలో స్పష్టమైంది. ఒక్కో క్యాంప్ ఏర్పాటుకు 15 లక్షలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కోట్లు స్వాహా చేసినట్టు తేలింది. క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లి ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఒక్కో క్యాంపులో లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని రూడీ అయ్యింది. ఇక్కడ క్యాంపునకు వచ్చిన క్రీడాకారులకు కిట్‌లు ఇచ్చినట్టు కూడా బిల్లులు చూపించారు. కానీ అలాంటివేమీ ఇవ్వలేదని తేలింది. దీనిపై కూడా సిఐడీ ఆధారాలు సేకరించింది.



















