Eatala Rajender: ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్, మరో ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా.. పోలీసుల తీరుపై ఆగ్రహం
బీజేపీ పిలుపునిచ్చిన మౌన దీక్షకు అనుమతిలేదని పోలీసులు ఈటల రాజేందర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా జనగామలో గురువారం బీజేపీ మౌన దీక్షకు పిలుపునిచ్చింది. అయితే, బీజేపీ పిలుపునిచ్చిన మౌన దీక్షకు అనుమతిలేదని పోలీసులు ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులుంటాయని అన్నారు. నిరసనలు, బంద్‌లకు టీఆర్ఎస్ పార్టీకీ మాత్రమే అనుమతిస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్‌కు వంతపాడుతున్నారని విమర్శించారు.
‘‘టీఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పైగా దెబ్బలు తిన్నవారిమీదనే పోలీసులు కేసులు పెడుతున్నారు. కనీసం గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా? టీచర్లు ధర్నా చేస్తే వాళ్ళని గొడ్డును బాదినట్టు బాదారు.. టీఆర్ఎస్ వాళ్లకేమో పోలీసులు బందోబస్తు ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ప్రజాసంఘాలు, ఇతర పార్టీలకు మాట్లాడే అధికారం, నిరసన తెలిపే అధికారం లేదా? తెలంగాణలో పౌర స్వేచ్ఛ లేదు. ఇచ్చిన తెలంగాణ గురించి మోదీ మాట్లాడారు.’’
‘‘బీజేపీ మద్దతుతోనే తెలంగాణ వచ్చింది. మరి వచ్చిన తెలంగాణ లో ఏం జరుగుతుంది. కుటుంబ పాలన, వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద వేదింపులు, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగం, ధరణి పేరిట లక్షల ఎకరాలు మాయం చేయడం, ప్రజలకిచ్చిన వాగ్దానాలు మర్చిపోవడం, ఉద్యోగులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, పెన్షన్ లు అందరికీ ఇవ్వకపోవడం, మధ్యాహ్న భోజనం వండే వారికి జీతాలు ఇవ్వకపోవడం, నాలుగేళ్లుగా చిన్న చిన్న బిల్లులు లేవు, డైట్ ఛార్జ్ ఇవ్వరు. ఇవన్నీ చేయాల్సిన మంత్రులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. స్వయంగా రాష్ట్ర హోం మంత్రి, ప్రధాని దిష్టి బొమ్మ తగలపెట్టడం తెలంగాణ దుస్థితికి నిదర్శనం.’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
మరోవైపు, గోశామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు జనగామ వెళ్లాలనుకున్నానని.. పోలీసులు తీరు అస్సలు సరిగా లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభలో ఏపీ విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసనల్లో పాల్గొన్నారు. అయితే, జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 9 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత మురళీధర్ రావు పరామర్శించారు.