Shiva Balakrishna Assets Case: వంద కోట్లు కాదు నాలుగైదు రెట్లు ఎక్కువే! తెలంగాణ వ్యాప్తంగా శివ బాలకృష్ణ అక్రమాస్తులు- అధికారులే షాక్
ACB Pulled Out Shiva Balakrishna huge illegal Assets: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రేరా డైరెక్టర్‌గా ఉంటూ అక్రమ సంపాదనతో ఎదిగిన బాలకృష్ణ ఇంట్లో భారీగా ఆస్తులు బయట పడుతున్నాయి.
Shiva Balakrishna illegal Assets: హైదరాబాద్(Hyderabad)లో అక్రమాలతో ఎదిగిన అధికారి సంపాదన వెలుగులోకి వస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు వందల కోట్లు ఆస్తులు వెనకేసుకున్నట్టు అవినీతి నిరోధక శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. 30 గంటలకు జరుపుతున్న సోదాలు, విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే సంపద వెలుగు చూస్తోంది
కొనసాగుతున్న విచారణ
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రేరా(RERA) డైరెక్టర్‌గా ఉంటూ అక్రమ సంపాదనతో ఎదిగిన శివబాలకృష్ణ(Shiva Balakrishna) ఇంట్లో భారీగా ఆస్తులు బయట పడుతున్నాయి. మార్కెట్ విలువ ప్రకారం 400 కోట్లకుపైగానే ఆయన సంపాదన ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నగలు, నగదు ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నానక్‌రామ్‌గూడలోని బాలకృష్ణ ఇంట్లో రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో విల్లాలు, ఫ్లాట్లు నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ల్యాండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అధికారులకు దొరికాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఆస్తులు
దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల భూములు ఉన్నట్టు పత్రాలు లభ్యమయ్యాయి. ఇవన్నీ కూడా బినామీల పేర్లతో ఉన్నాయి. మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు..2 కిలోలకుపైగా బంగారు ఆభరణాలు, భారీగా వెండి వెలికి తీశారు. 80కి పైగా అత్యంత ఖరీదైన వాచ్‌లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఐఫోన్ల సీజ్ చేశారు.
చేయి తడపనిదే పనికాదట
జనాలను అడ్డదిడ్డంగా తొక్కేసి వచ్చినమంతా మెక్కేసి అక్రమార్జనకు అలవాటు పడిన శివబాలకృష్ణ ఇన్నాళ్లకు చిక్కాడని ఆయన బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైసా లేనిదే ఆయన అపాయింట్‌మెంట్ కూడా దొరకదని... పని చేయాలంటే లంచం ముట్టచెప్పాల్సిందేనంటున్నారు. అలా ఆయన బాధితులు వేల సంఖ్యల్లో ఉన్నరట.
అక్రమ అనుమతులపై ఆరా
శివ బాలకృష్ణ భారీగా అక్రమ కట్టడాలకి కూడా అనుమతులు ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే అవినీతి నిరోధక శాఖాధికారులు వారిపై కూడా దృష్టి పెట్టారట. ఆయన హయాంలో అనుమతులు పొందిన కట్టడాలు సేకరిస్తున్నారు. రూల్స్ వ్యతిరేకంగా ఉంటే వాటికి ఎలా అనుమతులు వచ్చి ఉంటాయనే దిశగా కేసును విచారణ చేపట్టనున్నారు.
Also Read: 1132 మందికి పోలీస్ పతకాలు - తెలుగు రాష్ట్రాల్లో వీరికి అవార్డులు
Also Read: జాతీయ స్థాయిలో వరంగల్ విద్యార్థిని సత్తా - రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ బాలల పురస్కారం