Harish Rao: జింకను చంపితే సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెట్టారు, 3 జింకలు చంపిన రేవంత్ ను ఏం చేయాలి? హరీష్ రావు
Hyderabad News | కంచె గచ్చిబౌలి భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసం చేయగా, మూడు జింకలు చనిపోయాయని.. ఎన్నో ఉల్లంఘనలు జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

Kancha Gachibowli Land | హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలి భూముల్లో తెలంగాణ ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు ఉల్లగించిందని, సెలవు దినాలు, పండుగ రోజుల్లో సైతం పర్యావరణ విధ్వంసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అడవుల విధ్వంసం, వన్య ప్రాణుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని అన్ని వివరాలతో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటికి నివేదించాం. 11 పేజీలతో రిప్రెంజంటేషన్, దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ ఇచ్చామన్నారు. కమిటీ వేసిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి 7 చట్టాలు దుర్వినియోగం
కంచె గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని, ఉల్లంఘనలు, HCU విద్యార్థులు, పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు, లేవనెత్తుతున్న అంశాలతో కూడిన నివేదికను సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ బృందం సమర్పించింది. అనంతరం బీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూముల్లో చెరువు కూడా ఉంది. HCU భూముల్లో చెట్ల నరికివేతతో ఏకంగా 7 చట్టాలను సీఎం రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేశారు. ఆ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే చెందాలని మేం కమిటీకి విన్నవించాం.
7 ఏళ్ల జైలు శిక్ష
రాత్రింబవల్లు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను కొట్టారు. దాంతో మూడు జింకలు చనిపోయాయి. జింకను చంపితే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జైలులో పెట్టారు. 3 జింకలు చంపిన రేవంత్ రెడ్డిపై, ఈ ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకోవాలి. 7 సంవత్సరాలు శిక్ష వేయాలని చట్టం ఉంది. హైదరాబాద్‌లో 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరిగితే పీపీబీ, అటవీ, రెవెన్యూ శాఖలు నిద్రపోతున్నాయా?. అనుమతి లేకుండా చెట్లు కుడుతున్నారని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పీసీసీఎఫ్ కి ఏప్రిల్ 2న లెటర్ రాసారు. HCU విద్యార్థులు ధర్నా చేస్తే కనిపించడం లేదా. అటవీ శాఖ నిర్లక్ష్యంతో వేల చెట్లు కుప్ప కూలాయి, జింకలు మృత్యువాత పడ్డాయి.
వాల్టా చట్టం ప్రకారం, ఇల్లు కట్టుకోవాలంటే గ్రామాల్లో రూ.50, పట్టణాలో రూ.100 చలాన కట్టి దరఖాస్తు చేయాలి. కమిటీ చెప్పిన ప్రకారం రూ. 450 డిపాజిట్ చేయాలి. ఒకటి బదులు రెండు చెట్లు పెట్టాలని నిబంధన ఉంంది. అనుమతి వచ్చాక చెట్టు కొట్టాలి. కానీ కంచ గచ్చిబౌలి భూముల్లో జరిగింది. ఒక్క దరఖాస్తు కూడా పెట్టలేదు. సొంత భూమిలో చెట్టు కొట్టినా అనుమతి పొందాలి. కంచె చేను మేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజ్ చేసి వేలాది చెట్లను నరుకుతున్నది. చెట్లు కొట్టడానికి టిజిఐఐసి పోలీసు స్టేషన్లలో దరఖాస్తు చేసింది. టీజీఐఐసీ దరఖాస్తే నేరపూరితమైంది. చెట్లు నరకడానికి ఫారెస్టు అనుమతి, వాల్టా చట్టం అనుమతి ఉందా అని పోలీసులు అడిగి అనుమతి ఇవ్వాలి.
సెలవులు, పండుగ రోజుల్లోనూ బుల్డోజర్లతో విధ్వంసం
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో అనేక రకాల ఉల్లంఘనలు జరిగాయి. 2002 వాల్టా యాక్టు ప్రకారం, చెట్టు కొట్టాలంటే అనుమతి తీసుకోవాలి. 2017 జీవో నెంబర్ 23 ప్రకారం, చెట్టు కొట్లాలంటే దరఖాస్తు చేయాలి. అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ 2025 మార్చి 4 ఫారెస్టు భూమి అని రాయాల్సిన అవసరం లేదు. వీళ్లు ఆ భూములను గుర్తించి తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అశోక్ కుమార్ శర్మ ఐఎఫ్ఎస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ఉల్లంఘన జరిగింది. అటవీ భూమే కాదు, పట్టా అయినా ప10 హెక్టార్ల కంటే 0.4 డెన్సిటీ ఆఫ్ చెట్లు 1980 గోదావర్మన్ తీర్పులను ఉల్లఘించారు. 1967 రాష్ట్ర ఫారెస్ట్ యాక్ట్ ఉల్లంఘన. కంచ గచ్చిబౌలి భూముల్లో 2011లో లక్షల మొక్కలు పెట్టారు, మన్మోహన్ కూడా మొక్కలు నాటారు. హైడ్రా విషయంలో శని, ఆదివారాల్లో కూల్చొద్దని హైకోర్టు కూడా చెప్పింది. దాన్ని కూడా ఉల్లంఘించారు. ఉగాది, రంజాన్ పండుగలు, ఆదివారం సెలవులు ఉన్నా చెట్లు కొట్టి ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆధారాలతో సహా కమిటీకి వివరించాం.
తాము కొట్టిన వాటిలో కేవలం సుబాబుల్ చెట్లు మాత్రమే ఉన్నాయని అటవీ అధికారులు అంటున్నారు. కానీ సుబాబులే కాదు.. సుగంధ పరిమళాలిచ్చే సుబాబుల్ చెట్లు, అనేక ఔషధ మొక్కలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై పోస్టులు పెడితే జైల్లో పెడుతున్నారే. వేలాది చెట్లు నరికినా, జింకలను చంపినా ఆయనకు ఎందుకు కనిపించడం లేదు. జీవ విధ్వంసం మీ కళ్లకు కనిపించదా... దీనిపై ఎందుకు కేసులు పెట్టరు? నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నోళ్లు నేరస్తులే. అందరూ కలిసే నేరం చేశారు. పొలంలో ఉన్న చింత చెట్టు, యాప చెట్టు కొట్టుకుంటే పోలీసులు, ఎమ్మార్వో వెళ్లి రైతులకు లక్షల పెనాలిటి వేస్తారు. వేల చెట్లు నరుకుతుంటే ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు. రైతుకు ఒక న్యాయం, సీఎం కు ఒక న్యాయమా. ఇది చాలా అన్యాయం.
బ్రోకర్ ఫీజు 169 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం
అక్టోబర్ 10, 2024 నాడు ప్రభుత్వం ఈ భూమిని తాకట్టు పెట్టి 10 వేల కోట్లు అప్పు తీసుకుంది. అప్పు ఇప్పించిన వ్యక్తికి 169.84 కోట్ల బ్రోకర్ ఫీజు కట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా ఇది టీజీ ఐఐసీకి చెందినవే అని బోర్డులు పెట్టారు. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే. బీఆర్ఎస్ హయాంలో కొత్త సెక్రటేరియెట్ ను కట్టాలని ప్రయత్నిస్తే, 10, 20 చెట్లను నరుకుతున్నారని గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. ఇవాళ వందల ఎకరాలలో వేల చెట్లు కొడుతున్న, జంతువులను చంపుతున్న ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై, సీఎస్ పై, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.





















