Tamilisai: మహిళను అవమానించొద్దు, నిజాలన్నీ ప్రజలకు తెలియాలి - కొన్ని చెప్పుకోలేను: గవర్నర్
తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు తీసుకొని మూడేళ్లు పూర్తయి నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అసంతృప్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆఫీసును ప్రభుత్వం చులకనగా చూస్తోందని, తీవ్రమైన వివక్ష చూపిస్తోందని విమర్శించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడికి రావడం లేదని నిలదీశారు. ఒక మహిళను అవమానించిన ప్రభుత్వంగా ముద్ర పడకూడదని అన్నారు. రాష్ట్ర గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు. తాను తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు తీసుకొని మూడేళ్లు పూర్తయి నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, హోంమంత్రిత్వశాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల మద్దతు, సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. గవర్నర్ గా ఈ మూడేళ్ల కాలం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని అన్నారు.
హెలీకాప్టర్ అడిగితే కనీస స్పందన లేదు
ఈ సందర్భంగా గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక గవర్నర్ స్థానానికి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. తాను మేడారం, భద్రాచలం పర్యటనలకు వెళ్లినప్పుడు హెలీకాప్టర్ అడిగితే కనీసం ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు. చేసేది లేక తాను రోడ్డు మార్గం ద్వారా 8 గంటలు ప్రయాణించి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. పర్యటనల్లో కూడా కలెక్టర్, సీపీ లాంటి ఉన్నతాధికారులు ప్రోటోకాల్ ప్రకారం కూడా హాజరుకాకపోవడాన్ని గవర్నర్ తప్పుబట్టారు. ప్రజల్ని కలవాలంటే కూడా తనకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.
వస్తానని చెప్పి రాలేదు, కనీస సమాచారం లేదు
ఇటీవల 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తే అక్కడికి కూడా రాలేదని అన్నారు. రావట్లేదని కనీస సమాచారం కూడా అందించలేదని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు లేని కరోనా నిబంధనలు ఎట్ హోం కార్యక్రమానికి వచ్చాయా అని నిలదీశారు. ఈ వ్యవహారాలన్నీ తనకు ఇష్యూ చేయాలని లేదని, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. భద్రాచలం వరదల సమయంలో తాను ముందు వెళ్లడం వల్లే అక్కడికి కొందరు వచ్చారని అన్నారు.
‘‘గత రిపబ్లిక్ డే వేడుకలకూ ఆహ్వానించలేదు. శాసనసభలో నా ప్రసంగాన్ని పక్కన పెట్టేశారు. సమస్యలు ఏవైనా ఉంటే మాట్లాడుకోవాలి. కౌశిక్ రెడ్డి విషయంలో ఎమ్మెల్సీగా ఆయన పేరును తిరస్కరించాను. ఆయన సేవా రంగం వర్తించదు కాబట్టే రిజెక్ట్ చేశాను. రాజ్యాంగ విరుద్ధంగా నేను వ్యవహరించలేను‘‘ అని తమిళిసై అన్నారు.
ప్రజా భవన్ గా రాజ్ భవన్
‘‘మొదట రాజ్ భవన్ ను ప్రజా భవన్ గా మార్చాం. ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచాం. దీంతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది. కరోనా సమయంలో భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేశాం. గిరిజనుల వద్దకు వెళ్లి వారి కోసం పని చేయడం మొదలుపెట్టాం. నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నాం. కొంత మందికి కోడిపిల్లలను అందించి ఆర్థిక పరిపుష్ఠికి సహకరించాం. ఆదీవాసీల్లో రక్త హీనత పోగొట్టేందుకు పౌష్టికాహారం అందించాం. అంబులెన్స్ లు ఏర్పాటు చేశాం. మహిళల కోసం మహిళా దర్బార్ కూడా ఏర్పాటు చేశాం. విద్యార్థులను ఉత్సాహపర్చడానికి పోటీ పరీక్షలు నిర్వహించి, ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందించాం. ఇలా ప్రజలతో నా ప్రేమను పంచుకున్నాను.
ఎన్నో యూనివర్సిటీలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నో లేఖలు రాశాము. వరద సంభవించినప్పుడు ప్రత్యక్షంగా వెళ్లి బాధితులను పరామర్శించాను. ఇంకా మరెంతో ప్రజలకు సేవ చేయాలనుంది’’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.