(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad News: విహారయాత్రలో విషాదం- ఏపీలో కాలువలోకి దిగి, నలుగురు హైదరాబాద్ వాసులు గల్లంతు
Hyderabad Crime News: హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు విహారయాత్రకు ఏపీకి వెళ్లగా, తిరుగు ప్రయాణంలో కాలువలోకి దిగగా విషాదం చోటుచేసుకుంది.
Hyderabad Residents Drowned at canal in Bapatla | హైదరాబాద్: నగరానికి చెందిన కొందరు యువకులు ఏపీలో టూర్‌కు వెళ్లగా విషాదం చోటుచేసుకుంది. కొన్ని బీచ్‌లకు వెళ్లిన యువకులు తిరుగు ప్రయాణంలో ఓ కాలువలోకి దిగగా.. అందులో నలుగురు గల్లంతయ్యారు. మొత్తం 6 మంది కాలువలోకి దిగగా, అందులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట, ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఏపీలోని బాపట్లకు విహార యాత్రకి వెళ్లారు. ఉదయం సూర్యలంక సముద్ర తీరానికి వెళ్లి బీచ్ లో సరదాగా గడిపారు. అనంతరం తిరుగు ప్రయాణంలో బాపట్ల మండలం నాగరాజు కాలువలోకి స్నానం చేసేందుకు ఆరుగురు వ్యక్తులు దిగారు. అందులో నలుగురు యువకులు సన్నీ, సునీల్, కిరణ్, నందులు గల్లంతయ్యారు. కాలువలో ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఉద్ధృతికి ఒకరు కొట్టుకుపోయారు. అతడ్ని రక్షించే ప్రయత్నంలో మిగతా వారు ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న బాపట్ల పోలీసులు అక్కడికి చేరుకుని రెస్క్యూ టీమ్ కలిసి పడవ సహాయంతో నాగరాజు కాలువ వద్ద గాలిస్తున్నారు. అందులో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కిరణ్ కుమార్(30), నందు(35) కోసం గాలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి
ఈత సరదా ముగ్గురు బాలుర ప్రాణాలు తీసింది. ఈతకు వెళ్లిన బాలురు ప్రమాదవశాత్తు గోస్తనీ నదిలో నీటమునిగి మృతి చెందారు. విజయనగరం జిల్లాలో ఈ విషాదం జరిగింది. ఎస్.కోట రూరల్ సీఐ ఉపేంద్రరావు ఘటన వివరాలు వెల్లడించారు. జామి మండల కేంద్రం సమీపంలో జాగరం గెడ్డ గోస్తనీ నదిలో కలిసే ప్రాంతంలో అడ్డుకట్టపై నుంచి ప్రవాహం జలపాతంలా కనిపిస్తుంది. విజయనగరం కేంద్రంలోని కంటోన్మెంట్ కు చెందిన ఆరుగురు బాలురు ఈత కొట్టేందుకు మంగళవారం ఉదయం వెళ్లారు. కొంత సమయం సరదాగా ఈత కొట్టారు. తిరిగి ఒడ్డుకు వస్తున్న క్రమంలోఅనిల్ అనే 14 ఏళ్ల బాలుడు ప్రవాహంలోకి జారిపోతున్నాడు. అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన షాకిద్ ఖాన్ (17), మహమ్మద్ అస్రాఫ్ (17) సైతం ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన మిగతా స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైతం అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో నదిలో వెతికించినా ఫలితం కనిపించలేదు. దాంతో SDRF బృందాన్ని రప్పించగా, వారు గాలించి విగతజీవులుగా మారిన ముగ్గురు బాలురను వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించినట్లు తెలిపారు.