Film Nagar Murder Case: లండన్‌లో ప్రేమ, ఫిలిం నగర్‌లో హత్య, అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్!
Hyderabad Crime News: భార్య లక్ష్యం నెరవేరాలని ఓ భర్త గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. భార్యను ఉన్నత చదువుల కోసం లండన్ పంపించాడు. అక్కడ ఆమెకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పరిచయం అయ్యాడు.
NRI Syed Ghouse Uddin Murder Case: భార్య లక్ష్యం నెరవేరాలని ఓ భర్త గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. భార్యను ఉన్నత చదువుల కోసం లండన్ పంపించాడు. అక్కడ ఆమెకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రేమగా మారింది. చదువు పూర్తి చేసుకుని మహిళ ఇండియాకు వచ్చేసింది. ఆమెతో పాటు ప్రియుడు కూడా వచ్చాడు. ఇంటికి వచ్చాక ఏమనుకుందో ఏమో ఆమె ప్రియుడిని దూరం పెట్టసాగింది. దీంతో ప్రియుడికి కోపం వచ్చింది.
లండన్‌లో తాము దిగిన ఫొటోలు చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగాడు. అంతే కాకుండా ఆమెను కిడ్నాప్ చేయాలనుకున్నాడు. వివాహిత ఇంటికి వెళ్లి ఆమెను ఎత్తుకు పోవాలని ప్లాన్ చేశాడు. అడ్డుకున్న భర్తను దారుణంగా హతమార్చాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. అతడికి సహకరించిన మరో వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
అద్నాన్‌తో స్నేహం
జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ వివరాల ప్రకారం.. నగరంలోని శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన అద్నాన్ హుస్సేన్ (40) లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. షేక్‌పేటలోని జైహింద్ కాలనీకి చెందిన వివాహిత (31) 2022లో సైకాలజీలో పీజీ చేసేందుకు లండన్ వెళ్లింది. అక్కడ పేయింగ్ అకామిడేషన్ కోసం చూస్తున్న ఆమెకు నగరానికి చెందిన అద్నాన్ హుస్సేన్ పరిచయమయ్యాడు. అతడు ఉంటున్న అపార్ట్‌మెంటులోనే షేరింగ్ రూమ్ తీసుకున్న వివాహితతో అద్నాన్‌కు స్నేహం ఏర్పడింది.
ఇండియాకు వచ్చేసిన భర్త, పిల్లలు
నాలుగు నెలల తర్వాత ఆమె భర్త గౌస్ మొయినుద్దీన్, ముగ్గురు పిల్లలతో కలిసి లండన్‌కు వెళ్లారు. అక్కడి వాతావరణం పడకపోవడంతో వారు ఇండియాకు తిరిగివచ్చారు. భార్య మాత్రం చదువు కోసం అక్కడే ఉండిపోయింది. ఆ సమయంలో ఆమెకు అద్నాన్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సమయంలో వారు కొన్ని ఫొటోలు దిగారు. ఈ క్రమంలో అద్నాన్ పెళ్లి చేసుకుందామని వివాహితకు చెప్పేవాడు. ఇండియాకు వెళ్లి భర్తకు విడాకులు ఇచ్చిరావాలని కోరేవాడు. అతడితో దిగిన ఫొటోలు చూపించి వాటిని బయట పెడతానంటూ బెదిరించడం ప్రారంభించాడు.
ఫొటోలు చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్
గత ఏడాది నవంబర్‌లో వివాహిత తన చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సమస్య తీవ్రమైంది. అద్నాన్ మహిళను వేధించేవాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అయితే సదరు వివాహిత ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారే ముఖ్యమని ఆమె పలుమార్లు చెప్పి్ంది. దీంతో అతడిపై గత నవంబర్‌లో ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అద్నాన్‌పై పోలీసులు ఐపీసీ 354 (డి), 506(2)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
కిడ్నాప్‌కు ప్లాన్
అయితే మహిళను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న అద్నాన్ ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీ రాత్రి గౌస్ మొహియుద్దీన్ ఇంటికి వెళ్లాడు. అతడి కళ్లముందే భార్యను లాక్కొని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతన్ని గౌస్ మొహియుద్దీన్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన అద్నాన్ కత్తితో గౌస్ మొహియుద్దీన్‌ను పొడిచి హత్య చేశాడు. అనంతరం మేనమామ మిర్జా ఫజల్ అలీ బేగ్ (42)ను పిలిపించుకుని అతడి బైక్‌పై పారిపోయాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఫిలింనగర్ పోలీసులు నిందితుడు అద్నాన్‌ను అరెస్ట్ చేశారు. అతడు పారిపోయేందుకు సహకరించిన మేనమామ మిర్జా ఫజల్ అలీబేగ్‌ను సైతం అరెస్ట్ చేసి, బుధవారం రిమాండ్‌కు తరలించారు.