Siddipet News: యూరియా ఇవ్వలేదని రైతులు కన్నెర్ర.. ఇద్దరు అధికారులను ఆఫీసులో బంధించి తాళం
Urea Issue in siddipet | యూరియా ఇవ్వలేదని సిద్దిపేట జిల్లాలో రైతులు కన్నెర్ర చేశారు. ఇద్దరు వ్యవసాయశాఖ అధికారులను ఆఫీసులో పెట్టి తాళం వేశారు.

Farmers fires on agriculture officials | సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు ప్రస్తుతం యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే తెల్లవారుజాము నుంచే రైతులు సహకార సంఘాల వద్దకు చేరుకుని యూరియా కోసం క్యూలలో నిల్చుంటున్నారు. కొన్నిచోట్ల వానలో తడుస్తున్నారు. కొన్ని సరఫరా కేంద్రాల ముందు తమ కార్డులు, చెప్పులతో పొడవైన క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో కొందరు రైతులు రోడ్లపైకి వచ్చి యూరియా కావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. యూరియా ఇవ్వకపోవడంతో సిద్దిపేట జిల్లాలో రైతులు తిరగబడి వ్యవసాయశాఖ అధికారులను బంధించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కొరత అధికంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
యూరియా లభ్యత లేకపోవడంతో సిద్ధిపేట జిల్లా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో పరిస్థితి విషమించింది. తమకు ఎరువులు ఇవ్వడం లేదని ఆగ్రహానికి గురైన రైతులు శనివారం రోజు ఇద్దరు వ్యవసాయ అధికారులను రైతు వేదిక ఆఫీసులో బంధించి తాళం వేశారు. మద్యం ఏరులై పారుతుంది, కానీ రైతులకు యూరియా మాత్రం అందుబాటులో ఉండదా అని రైతులు కన్నెర్రజేశారు.
సిద్దిపేట జిల్లా, రాయపోల్ మండలంలో యూరియా కోసం చెప్పుల క్యూలైన్
— Harish Rao Thanneeru (@BRSHarish) August 23, 2025
తులం బంగారం దేవుడెరుగు
కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారంగా మారింది.
పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన. @TelanganaCMO @revanth_anumula #CongressFailedTelangana pic.twitter.com/iNvnaXUyuB
అల్వాల్ గ్రామానికి అధికారులు రెండు లారీలు యూరియాను పంపిణీ చేసినా, తమకు ఎరువులు అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా మొదట అన్నదాతలు వినిపించుకోలేదు. యూరియాను అదనంగా తెప్పించి ఇస్తామని హామీ ఇవ్వడంతోనే ఆఫీసు తాళం తీసి రైతులు అధికారులను బయటకు రానివ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.






















