Ration Card Application : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ప్రభుత్వ నిర్ణయానికి ఈసీ బ్రేక్ వేయలేదు
Ration Card Application :తెలంగాణలో రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్ పడిందన్న వార్తలను ఈసీ ఖండించింది. అలాంటిదేమీ లేదని పేర్కొంది. ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది.

Rration Card Online Apply Telangana: తెలంగాణలో ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అందుకని రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల ప్రక్రియకు ఎన్నికల సంగం బ్రేక్ వేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎన్నికల సంగం ఖండించింది. అలాంటిదేమీ లేదని ప్రభుత్వానికి అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొంది.
తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. వారం రోజుల క్రితమే నోటిఫికేషన్ వచ్చింది. సోమవారంతో నామినేషన్‌ల గడువు ముగియనుంది. ఈ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అందుకే ఎన్నికల సంఘం రేషన్ కార్డుల అప్‌డేషన్‌పై ఆంక్షలు విధించిందని ప్రచారం జరిగింది.
పదేళ్లుగా ఇవ్వకుండా ఉన్న రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఈ మధ్యే నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తోంది. ఇంకా దరఖాస్తు చేసుకోని వాళ్లు ఎవరైనా ఉంటే మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే కార్డులు ఉన్న వారు కూడా మార్పులు చేర్పులు ఉంటే అప్లై చేయాలని సూచించింది.
Also Read: కాంగ్రెస్‌కు గుండు సున్న- కేసీఆర్‌ను కలిసిన వారంతా పోయారు - సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
ఇలా ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం ప్రలోభం కిందకు వస్తుందని కోడ్ వయలేషన్ అవుతుందని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ ఈసీ ఆ ప్రచారాన్ని కొట్టిపారేసింది. కొత్త రేషన్ కార్డులపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనిపేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం వారం క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కాగా... ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఆరోజు ఎన్నికలు జరిగే జిల్లాల్లోని స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా - గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుపుతున్నారు.
షెడ్యూల్ పూర్తి వివరాలివే..
నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - ఫిబ్రవరి 10
నామినేషన్ల పరిశీలన - ఫిబ్రవరి 11
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - ఫిబ్రవరి 13
పోలింగ్ ప్రక్రియ - ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ - మార్చి 3
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

