Deeksha Diwas : దీక్షాదివాస్ వేడుకలకు అనుమతి- కానీ కండిషన్స్ అప్లై
Deeksha Diwas Celebrations: బీఆర్‌ఎస్ ఆఫీస్‌లోపల దీక్షాదివాస్ వేడుకలకు చేసుకునేందుకు పోలీసుల అనుమతి ఇచ్చారు. -కానీ కండిషన్స్ అప్లై అంటున్నారు.
తెలంగాణ కోసం దీక్ష చేపట్టిన కేసీఆర్ నవంబర్ 29న దీక్షా దివాస్‌గా బీఆర్‌ఎస్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ వేడుకలపై గందరగోళం నెలకొంది. అయితే ఈ కార్యక్రమాన్ని పార్టీ ఆఫీస్‌లో జరుపుకుంటే అభ్యంతరం లేదని పోలీసులు చెప్పపడంతో బీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేసింది.
అస్తిత్వాన్ని..అస్మితను తట్టిలేపే రోజు: కేటీఆర్
ఉదయం నుంచి దీక్షాదివాస్‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చరిత్రను మలుపుతిప్పిన దీక్ష అంటూ కామెంట్ చేశారు. తల్లి తెలంగాణ సంకెళ్లను తెంచిన సత్యాగ్రహమని అభిప్రాయపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... "స్వరాష్ట్ర సమరంలో సముజ్వల సన్నివేశం... స్వాతంత్ర్య పోరాటాన్నిమించిన సమున్నత సందర్భం... యావత్ జాతి ఏకమై ఉద్యమ కడలి ఉవ్వెత్తున ఎగసిన దృశ్యం... చావునోట్లో తలబెట్టి గెలిచిన సాహసం... ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం. ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన పోరాటఘట్టం... కేసీఆర్ సచ్చుడో .. తెలంగాణ వచ్చుడో ఆమరణ రణనినాదం!
చెక్కుచెదరని ఉక్కు సంకల్పం పట్టుసడలని దీక్షాదక్షతతో ఆత్మగౌరవ విశ్వరూపం చూపిన సకల జనం.. అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటనతో నెరవేరిన శపథం.. ఉద్యమబాట వీడితే రాళ్లతో కొట్టండి.. తెలంగాణ కోసం బొంతు పురుగునైనా ముద్దుపెట్టుకుంటం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా మళ్లా తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతా... సాహసోపేత నినాదాలతో..అసాధ్యాన్ని సుసాధ్యం చేసి స్వప్నాన్ని సత్యంగా మలచి గమ్యాన్ని ముద్దాడిన గట్టి సిపాయి కేసీఆర్. నవంబర్ 29..దీక్షా దివస్ తెలంగాణ సోయిని..అస్తిత్వాన్ని..అస్మితను తట్టిలేపే రోజు. ఆత్మగౌరవ ఆకురాయిపైన మన చైతన్యాన్ని పదును పెట్టుకునే రోజు. త్యాగాల స్ఫూర్తితో తెలంగాణకు పునరంకితం కావాల్సిన రోజు అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
అన్నం బంద్ చేసి కొట్టాడినవ్: కవిత
ఆనాడు అన్నం బంద్ చేసి కోట్లాడి తెలంగాణ తెచ్చి ఇప్పుడు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చావ్ అన్నారు ఎమ్మెల్సీ కవిత. చిమ్మ చీకట్ల తెలంగాణను వెలుగు జిలుగుల రాష్ట్రంగా మార్చావ్.. కన్నీరు కారుస్తున్న రైతన్న కోసం ఉపవాస దీక్షతో రాష్ట్రంతో పాటు గోదావరి నీళ్లు కూడా తెచ్చి వారి కాళ్లు కడిగావ్... అవ్వా తాతలకు పెద్దకొడుకుగా.... ఆడపడుచులకు అన్నగా... మేనమామగా... తాతగా... అందరికీ ఆప్తుడివయ్యావ్. ఆ దీక్ష సమయంలో కన్నీటితో కరిగిన మా గుండెలు... ఇప్పుడు ఆనందంతో ఉప్పొంగుతున్నాయ్. అని ట్వీట్ చేశారు.