బీజేపీ, టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఫైర్, అందర్ బాహర్ గేమ్‌లో భాగమే ప్రధాని కామెంట్స్, టీఆర్‌ఎస్ నిరసనలు అంటూ కామెంట్స్
బీజేపీ, టీఆర్‌ఎస్ రహస్య మిత్రులను మరోసారి మండిపడింది కాంగ్రెస్. ప్రజల్లో హైప్ కోసం తిట్టుకుంటున్నట్టు నటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మధుయాష్కీ.
ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి చిట్టా తమ వద్ద ఉందని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది కాంగ్రెస్. బీజేపీని తెలంగాణలో పూడ్చాల్సిందేనంటూ కామెంట్స్ చేస్తున్న టీఆర్‌ఎస్ దిల్లీలో ఎందుకు కలిసి తిరుగుతోందని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మధుయాష్కీ. ప్రజలను తప్పుదారి పట్టించడానికి బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలంటూ ఆరోపిస్తున్నారాయన.
బీజేపీ, టీఆర్‌ఎస్ ఆడుతున్న అందర్ బాహర్ గేమ్‌కు సాక్ష్యాలు అంటూ మీడియాకు ఓ లెఖ రిలీజ్ చేశారు మధుయాష్కీ. రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మోదీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడైనా గట్టిగా నిలదీశారా అని అడిగారు. చౌరస్తాలో కొట్టుకుందాం.. ఇంట్లో కల్సుందాం అనే రకంగా తెలంగాణ ప్రజలను కేసీఆర్-మోదీ అండ్ కో మోసంజేస్తున్నారని మధుయాష్కి మండిపడ్డారు.
ఐటీఆర్, ఖాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యరం ఉక్కు పరిశ్రమ గురించి కేసీఆర్ అడిగింది లేదని గుర్తు చేశారు మధుయాష్కీ. ఇప్పుడు ప్రధానిహోదాలో మాట్లాడుతున్న మోదీ.. 2014 ఎన్నికలర టైంలోచెప్పిన మాటలు.. ఇచ్చిన హామీలు ఏమైనా తెలంగాణకు చేశారని ప్రశ్నించారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అనేక ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతి చేశారిని కాంగ్రెస్ పార్టీ 2016 నుంచి ఆధారాలతో చూపిస్తోందని గుర్తు చేశారు మధుయాష్కీ. ఉన్న ఆధారాలు కేంద్రానికి ఇస్తున్నా ఎందుకు సీబీఐ విచారణ జరిపించడం లేదని నిలదీశారు. దీనిపై ఇంతవరకూ ఎక్కడా స్పందించని కాషాయ నేతలు.. ఒక్కసారిగా కేసీఆర్‌ను జైలుకు పంపుతాం అంటూ కబుర్లు చెబుతున్నారని ఆక్షేపించారు.
బీజేపీకి నిజంగా అంత సీన్ ఉంటే వెంటనే కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని మోదీ ప్రభుత్వాన్ని, బండి సంజయ్ అండ్ కోను కాంగ్రెస్ పార్టీ పక్షాన మధుయాష్కీ డిమాండ్ చేశారు. బీజేపీ-టీఆరఎస్ ఒకే రకమైన ఆలోచనతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. బయటకు మాత్రం శత్రువుల్లా కనిపిస్తూ లోలోపల కలిసి ఒకరికోసం ఒకరంటూ పని చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం కారణంగానే విభజనచట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన ఏవీ రాలేదని దుయ్యబట్టారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద విభజిత రాష్ట్రాలకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన అన్ని అంశాలను పక్కన పెట్టి డైవర్షన్ స్కీమ్ లెక్కన కొత్త వివాదాలకు తెరలేపుతన్నాయని మధు యాష్కీ మండిపడ్డారు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఏంజేశారో చెప్పుకోలేక.. చెప్పుకోవడానికి ఏమీలేక.. మీడియా హైప్ కోసం కోట్లాడుతున్నట్లు డ్రామాల్జేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తెలంగాణ మీద మోదీ కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే వెంటనే విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు మధు యాష్కీ.