Harish Rao:కాంగ్రెస్ కు లీడర్లు లేరు, బీజేపీకి క్యాడర్ లేదు - వారి బలం అదే! హరీష్ రావు సెటైర్లు
Harish Rao satires on Congress and BJP: కాంగ్రెస్, బీజేపీ నేతలది మేకపోతు గాంభీర్యం అని, వారికి ప్రజల్లో బలం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు.
Harish Rao satires on Congress and BJP:
కాంగ్రెస్, బీజేపీ నేతలది మేకపోతు గాంభీర్యం అని, వారికి ప్రజల్లో బలం లేదని.. ప్రజా మద్దతు ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేవలం సోషల్ మీడియాలో, గాంధీ భవన్ లో, వాళ్ల పార్టీ ఆఫీసులో మాత్రమే కాంగ్రెస్, బీజేపీ నేతలకు బలం ఉందని సెటైర్లు వేశారు. మంత్రి హరీష్ రావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు.. బీజేపీకి క్యాడర్ లేదు, కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదన్నారు. మూడోసారి తాము విజయం సాధిస్తామని, కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొడతారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి నిజంగా లీడర్లు లేరన్నారు. టికెట్లకు దరఖాస్తులు తీసుకుంటున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను తేల్చేందుకు అప్లికేషన్లు తీసుకుంటారని గుర్తుచేశారు. అభ్యర్థుల కోసం అప్లికేషన్లు అమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లు ప్రజలకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. దాదాపు 35, 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరన్నారు. అందుకే అభ్యర్థుల వేట కోసం డబ్బు తీసుకుని దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, అధికారంలోకి చేసింది ఏంటని రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. కరెంట్ పరిస్థితి ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది కర్ణాటకలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసున్నారు. ఓడ దాటే వరకు ఓడ మల్లప్ప, దాటాక బోడ మల్లప్ప అనేలా కాంగ్రెస్ తీరు ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పై సంపూర్ణ విశ్వాసం ఉందని, వరుసగా మూడోసారి గెలిపిస్తారని దీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోసారి సీఎం పీఠంపై కూర్చుంటారని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని, సినిమా చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలని బీజేపీ నేత ఈటల రాజేందర్ మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందు ఉందని స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈటల ఈ విధంగా సమాధానం ఇచ్చారు. సినిమా అయినా, ట్రయల్ అయినా అది ప్రజలే చూపిస్తారని, నాయకులు కాదని అన్నారు. సినిమా చూపించేది ప్రజలైతే, చూడాల్సింది బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు సినిమా చూపించబోతున్నారన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు.
గిరిజన, దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయింది... అన్నిరంగాల్లో తెలంగాణ నంబర్ వన్ అని బుకాయుస్తున్నారు ఈటల విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లు భయపెట్టిస్తున్నాయని.. గిరిజన మహిళపై జరిగిన దాడి చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మహిళ మీద జరిగిన దౌర్జన్యం మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.