Telangana New Song: తెలంగాణ నూతన గీతానికి ప్రభుత్వం ఆమోదం - ఆ రోజే సీఎం చేతుల మీదుగా విడుదల
Telangana News: తెలంగాణ రాష్ట్ర గీతంపై సచివాలయంలో గురువారం (మే 30) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు.
Jaya Jaya He Telangana Song: ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు.
ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ఇరవై ఏండ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా అమోదించినట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చారు.
తెలంగాణ రాష్ట్ర గీతంపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జానారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
రెండు వెర్షన్ లకు రూపకల్పన
తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రెండు వర్షన్లలో తయారు చేశారు. 2.30 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన ఈ గీతం అందరినీ అలరించింది.
తెలంగాణలో కొత్త రాష్ట్రీయ గీతం, సరికొత్త లోగో రూపకల్పనపై ముమ్మర కసరత్తులు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున ఈ కొత్త గీతం, లోగో ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ఆరోజున కొత్త రాష్ట్రీయ గీతం మాత్రమే ఆవిష్కరిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర చిహ్నంలో మార్పులపై ఇంకా చాలా అభిప్రాయాలు వస్తున్నందున అందుకు ఇంకా సమయం పడుతుందని రేవంత్ భావించినట్లు తెలిసింది.
తెలంగాణ చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు లేకుండా పోరాటాలకు, ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా ఉండేలా.. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర రాజ ముద్రను తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి భావించారు. అందుకే అందుకు సమయం పడుతుందని తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర చిహ్నం రూపకర్త రుద్ర రాజేశంకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన పలు మోడళ్లను రూపొందించి సీఎం ముందుంచగా.. వాటిని మంత్రులు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో కలిసి సీఎం పరిశీలించారు.