TIMS Hospitals: హైదరాబాద్ నలువైపులా టిమ్స్ - మూడు ఆస్పత్రులకు శంకుస్థాపన చేసిన కేసీఆర్
మంగళవారం సీఎం కేసీఆర్ మూడు టిమ్స్ ఆస్పత్రులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆల్వాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.
హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో నాలుగు ఆస్పత్రులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మూడు కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌కు ఒక వైపున గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రిని ఏర్పాటు చేశామని మిగతా మూడు వైపులు ఎర్రగడ్డ, ఎల్బీ నగర్, అల్వాల్‌లో ఒక్కొక్కటి వెయ్యి పడకల చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో టిమ్స్ ఆస్పత్రులను నిర్మించతలపెట్టినట్లుగా సీఎం తెలిపారు. మంగళవారం సీఎం కేసీఆర్ మూడు టిమ్స్ ఆస్పత్రులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆల్వాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.
‘‘హెచ్ఎండీఏ పరిధిలో మన జనాభా కోటి 60 లక్షలు దాటారు. నగరంలో ప్రభుత్వ హాస్పిటళ్లపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి, హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఆస్పత్రులు కట్టించాలని నిర్ణయించారు. అందుకే టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఎయిమ్స్ తరహాలో సేవలు అందిస్తుంది. మొత్తం 16 స్పెషాలిటీ, 15 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యాలు ఇక్కడ అందుతాయి. వందకు వంద శాతం పేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం అందిస్తాం. మహిళ ప్రసూతి విభాగం కూడా 200 పడకలు ఈ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తాం.’’ అని కేసీఆర్ అన్నారు.
ఒక్కో ఆస్పత్రి స్వరూపం ఇలా..
ఒక్కో టిమ్స్‌ను వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ప్రతి ఆస్పత్రిలో 26 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ పడకలతో పాటు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులోకి ఉంటుంది. ఎర్రగడ్డలో నిర్మించే టిమ్స్ ఆస్పత్రి 17 ఎకరాల్లో జీ + 14 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఈ మల్టిసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.882 కోట్లు కేటాయించారు. కొత్తపేట టిమ్స్ ను 21.36 ఎకరాల్లో జీ + 14 అంతస్తుల్లో వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.900 కోట్లు కేటాయించారు. అల్వాల్ టిమ్స్ కూడా వెయ్యి పడకలతో నిర్మితం అవుతుంది. 28.41 ఎకరాల్లో జీ + 5 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఈ మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.897 కోట్లు కేటాయించారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ మల్లా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేశ్, సాయన్న, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు (కేకే), జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.