Podu Lands In Telangana: పోడు భూముల పంపిణీకి డేట్ ఫిక్స్ చేసిన కేసీఆర్, రివ్యూలో సీఎం కీలక నిర్ణయాలు
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు, కార్యాచరణపై ఈ నెల 25న అన్ని జిల్లాల కలెక్టర్లతో కేసీఆర్ సదస్సు నిర్వహించనున్నారు.
తెలంగాణలో జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ పోడు భూముల పట్టాల పంపిణీలో తానే స్వయంగా పాల్గొంటానని సీఎం చెప్పారు. అలా పోడు పట్టాలు పొందిన వారికి సాధారణ రైతుల మాదిరిగానే రైతు బంధు పథకం కింద ఆర్థిక సాయం అందించాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్‌ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతు బంధును జమ చేస్తుందని సీఎం తెలిపారు. పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు అకౌంట్ల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని, దానిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను, ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4లక్షల ఎకరాలకుపైగా 1.55 లక్షల మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పరిశీలన జరిగింది. ఇందుకు సంబంధించి పట్టాలను కూడా అధికారులు సిద్ధం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా కొన్ని పథకాలు, కార్యక్రమాల రూపకల్పనకు సంబంధించి ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు, కార్యాచరణపై ఈ నెల 25న అన్ని జిల్లాల కలెక్టర్లతో కేసీఆర్ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సీఎంతో పాటు మంత్రులు, జిల్లా పోలీసు అధికారులు హాజరు అవనున్నారు. జూన్14న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. 2 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
జులై నుంచి గృహలక్ష్మి పథకం
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కూడా పంపిణీ చేయాలని, సొంత ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఆర్థిక సాయం చేయడం లాంటివి అమలు చేయాలని సూచించారు. గ్రామాల్లో నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన పేదలను గుర్తించి నివేశనా స్థలాల పట్టాలు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. జులై నుంచి గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. దళిత బంధు పథకం కొనసాగింపునకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి తొలుత మూడు వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సొంతగా ఖాళీ స్థలం ఉండి, ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారికి, అలాగే ఇల్లు కూలిపోయిన వారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. అలాగే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా వెంటనే చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులకు రూ.3 లక్షలను మూడు విడతలుగా రూ.లక్ష చొప్పున ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. దాని కోసం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.