KCR: పద్మశ్రీకి ఎంపికైన కళాకారుడు రామచంద్రయ్యకు కేసీఆర్ భారీ నజరానా
దర్శనం మొగిలయ్యకు కూడా సీఎం కేసీఆర్ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లో నివాస స్థలంతో పాటు కోటి రూపాయలు ప్రకటించారు.
ఈ ఏడాది భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ సత్కరించారు. అంతేకాక, ఆయనకు వరాల జల్లు కురిపించారు. రామచంద్రయ్య సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసానికి అనువైన ఇంటి స్థలం, అందులో ఇల్లు నిర్మించుకోవడం కోసం రూ.కోటి రివార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనందున మంగళవారం రామచంద్రయ్య ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళ అయిన డోలు వాయిద్యాన్ని రామచంద్రయ్య బతికిస్తున్నందుకు సీఎం కేసీఆర్ అభినందించారు.
రామచంద్రయ్య ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మోగక్షేమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలం, నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించారు. అంతేకాక ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు.
తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు
జనవరి 26 సందర్భంగా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ఐదుగురు వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 128 మందికి పద్మ అవార్డులు దక్కాయి. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు ఉండటం విశేషం. భారత్ బయోటెక్ సీఎండీ శ్రీకృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. అలాగే 12 మెట్ల కిన్నెర దర్శనం మొగిలయ్యతో పాటు రాంచంద్రయ్య, పద్మజా రెడ్డి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక అయ్యారు. ఏపీ నుంచి ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు, గోసవీడు షేక్ హాసన్ (మరణం తర్వాత), డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
మొగిలయ్యకు కూడా కేసీఆర్ నజరానా
దర్శనం మొగిలయ్యకు కూడా సీఎం కేసీఆర్ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లో నివాస స్థలంతో పాటు కోటి రూపాయలు ప్రకటించారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్పకళాకారుడు మొగిలయ్య అని అభినందించారు. ఇప్పటికే మొగిలయ్య కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని తెలంగాణ కళలను పునరుజ్జీవం చేసుకుంటూ.. కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామన్నారు.
కనకరాజుకు రివార్డు ప్రకటించిన సీఎం
గతేడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చుల కోసం రూ.1 కోటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం ఆదేశించారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు శ్రీ సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. pic.twitter.com/hPRsWZDRgO
— Telangana CMO (@TelanganaCMO) February 1, 2022