Bhatti Vikramarka Letter: సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ, ఏం ప్రస్తావించారంటే!
Bhatti Vikramarka: తన పాదయాత్రలో పోలీస్ వ్యవస్థ గురించి ప్రతి గ్రామంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలు బాధ కలిగించాయని, ఇకనైనా ఈ పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు భట్టి విక్రమార్క.
Bhatti Vikramarka written letter to Telangana CM KCR: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. తాను చేపట్టిన పాదయాత్రలో పోలీస్ వ్యవస్థ గురించి ప్రతి గ్రామంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలు బాధ కలిగించాయని, ఇకనైనా ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పిదాలు తెలుసుకొని క్షేత్రస్థాయిలో పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలు ప్రకారం కాకుండా.. చట్టబద్ధంగా పనిచేసే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోలీసులతో చట్టబద్ధంగా, న్యాయం ఎటువైపు ఉందో చూసి బాధితుల పక్షాన నిలిచి వారికి అండగా నిలిచేలా చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క. అలా జరగకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదని హెచ్చరించారు.
తెలంగాణలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా మార్చి 16న పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించారు. బోధ్ నియోజకవర్గం, పిప్పిరి గ్రామం నుంచి 83 రోజుల్లో అచ్చంపేట వరకు 957 కిలోమీటర్లు అనేక గ్రామాలు, పట్టణాలు, 30నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమై మాట్లాడాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం కోసం కోరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. కానీ వాటిని సాధించలేకపోయామన్న నిరాశ, నిస్పృహలతో ఉన్నామని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు.
ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న పోలీస్ వ్యవస్థ గురించి ప్రతి గ్రామంలో ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన అంశాలు బాధ కలిగించాయి. పోలీసుల నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ ప్రజలు అడిగిన సంఘటనలు కోకొల్లలు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు పూర్తిగా ఎస్పి, డిఐజి, డిజిపి ఉన్నతాధికారులతో డీలింక్ అయ్యి అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో పనిచేసే ఉద్యోగులుగా మారిపోయారు. ఎస్ఐ, సిఐ, డిఎస్పి పోస్టింగ్ ల బదిలీలు, పదోన్నతులు అధికార పార్టీ శాసనసభ్యుల సిఫారసుల ప్రకారం జరుగుతుండటమే అందుకు కారణం. పోలీసులు ప్రజా ప్రతినిధుల ఇష్టాలపై ఆధారపడి ఉండటం వల్ల బ్యూరోక్రాట్ విధానంలో ఉన్నత అధికారుల ఆదేశాలను పాటించకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలు అమలు చేయడమే ఉద్యోగ ధర్మంగా వారి పనితీరు మారింది.
ఎవరైనా ఫిర్యాదు చేస్తే, కేసు నమోదు చేయడం అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం ఆదేశానుసారం జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష, ప్రజా సంఘాలపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం నిత్య కృత్యంగా మారింది. పోలీసుల నుంచి కాపాడాలని వినతులు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండకుండా, పనిచేయకుండా పక్కదారులు పడుతుంటే అప్పుడు ప్రజలు రాజ్యాంగేతర శక్తులని వెతుక్కునే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అధికార యంత్రాంగం మాత్రం చట్టానికి లోబడి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. అలాంటి వ్యవస్థలను విచ్చిన్నం చేస్తే ప్రజాస్వామ్యం మనగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికైనా తప్పులు తెలుసుకుని ప్రభుత్వం పోలీసుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. వారిని చట్టబద్ధంగా పని చేసే స్వేచ్ఛ, అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో భట్టి విక్రమార్క ప్రస్తావించారు. అలా జరగకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిలకు ఈ లేఖ కాపీని కాంగ్రెస్ నేత పంపించారు.