Revanth Reddy: లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి, పాడె మోసిన హరీశ్ రావు
BRS MLA Death: మారేడ్ పల్లి స్మశాన వాటికకు లాస్యనందిత భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు. వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Cantonment MLA Lasya Nandita: అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. కార్ఖానాలో లాస్య నందిత నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తదితరులు కూడా రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు.
అనంతరం ఇంటి నుంచి మారేడ్ పల్లి స్మశాన వాటికకు లాస్యనందిత భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు. వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌశిక్ రెడ్డి పల్లా, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, అశేష జన వాహిని నడుమ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి.
పాడె మోసిన హరీశ్ రావు
ఈ అంత్యక్రియల్లో లాస్య నందిత భౌతికదేహాన్ని పాడెపై తీసుకెళ్తుండగా.. మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఆమె పాడె మోశారు. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు కూడా పాడె మోసిన వారిలో ఉన్నారు.
ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు @BRSHarish, @VPR_BRS, @PRR_BRS, @KaushikReddyBRS మరియు పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు pic.twitter.com/WJBzgFgltA
— BRS Party (@BRSparty) February 23, 2024
పటాన్ చెరు సమీపంలోని ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై సదాశివపేట నుంచి పటాన్ చెరు వస్తుండగా.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. పటాన్ చెరు అమేథా ఆస్పత్రికి లాస్య నందిత మృతదేహాన్ని తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే మృతి చెందినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదకలో తేలింది. ఆమె మృతికి సంబంధించిన వివరాలను గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలు కాగా.. 'తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కుడి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆరు దంతాలు ఊడిపోయాయి.' అని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని.. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ ను ఢీకొనగా.. ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలు కాగా.. స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే, పూర్తిగా దర్యాప్తు చేసిన అనంతరమే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.