Charminar Bomb News: చార్మినార్ బాంబు బెదిరింపులో అదిరిపోయే ట్విస్ట్, అసలు సంగతి తెలిసి అవాక్కైన పోలీసులు?
ప్రియురాలిపై కోపంతో ప్రియుడు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ తప్పుడు సమాచారంతో సోమవారం (నవంబరు 21) సాయంత్రం ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు హడావుడి పడ్డ సంగతి తెలిసిందే. అయితే, అదంతా సాధారణ తనిఖీలని పోలీసులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా అందుకే తనిఖీలు చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కానీ, అసలు విషయం బయటికి వచ్చింది. నిజంగానే ఓ అగంతుకుడు తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా తేలింది. అందుకు కారణం తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు.
ప్రియురాలిపై కోపంతో ప్రియుడు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. చివరకు అది తప్పుడు సమాచారంగా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తొలుత అప్రమత్తమైన చార్మినార్ పోలీసులు బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని చార్మినార్ చుట్టుపక్కల అణువణువు గాలించారు. అప్పటికే చార్మినార్‌పై అంతస్తులో ఉన్న సుమారు 200 మంది సందర్శకులను సురక్షితంగా కిందకు దింపేసి బయటకు పంపేశారు.
దాదాపు రెండు గంటలపాటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల పరిధిలో జల్లెడపట్టారు. ఏమీ లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు వచ్చిన ఈ మెయిల్ ఆధారంగా ట్రేస్ చేసి పరిశీలించగా అసలు విషయం బయటికి వచ్చింది. తన ప్రియురాలిపై కోపం తీర్చుకునేందుకు ప్రియుడు సోషల్ మీడియాలోని ఆమె అకౌంట్ ద్వారా ఆమె ఫొటో తీసుకున్నాడు. ఆ ఫొటోతోపాటు ఆమె బాంబు ధరించి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఆమె ఏ క్షణంలోనైనా బాంబును పేల్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో రాశాడు.
అంతేకాకుండా, నగర పోలీసులకు ఈ - మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు. మెయిల్‌కు వచ్చిన ఫొటో ఆధారంగా పోలీసులు సోషల్ మీడియాను జల్లెడ పట్టగా.. ఆ ఇద్దరు ప్రేమికులని తేల్చారు. నకిలీ సమాచారంతో సొంత ప్రయోజనాల కోసం పోలీసులను పక్కదారి పట్టించినందుకు అతడిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, పోలీసులు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పడం లేదు. పర్యాటక, జనసమూహం ఉండే ప్రాంతాల్లో తరచూ సోదాలు నిర్వహిస్తామని అందులో ఇది భాగమేనని నిన్న పోలీసులు చెప్పారు.
కొద్ది రోజుల క్రితం నిజంగానే బెదిరింపు కాల్
నవంబరు 15న పాతబస్తీ ఐ.ఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు నవంబరు 16న అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పీఎస్ (Saidabad Police Station) పరిధిలోని ఐఎస్ సదన్ లో బాంబు ఉందంటూ డయల్ 100 కి అక్బర్ ఖాన్ అనే వ్యక్తి కాల్ చేశాడు. అనంతరం ఐఎస్ సదన్ కు చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేశారు. ఫోన్ లో చెప్పినట్టు అక్కడ ఎలాంటి బాంబు లేదని పోలీసులు చెప్పారు. ఆ ఆగంతుకుణ్ని పట్టుకొనేందుకు పోలీసులు యత్నించి నిందితుడిని పట్టుకున్నారు. అతను ఫోన్ చేసిన నెంబరు ఆధారంగా ఆచూకీని ట్రేస్ చేశారు. నిందితుడిపై సైదాబాద్ పీఎస్ లో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 182, 186, సిటీ యాక్ట్ 70 బీ ప్రకారం పోలీసులు కేసు పెట్టారు.