Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్
ఈడీ రైడ్స్ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్లు తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని చికోటి ప్రవీణ్ అన్నారు.
తెలంగాణలో కొద్ది రోజుల క్రితం ఈడీ తనిఖీలతో దుమారం రేపిన క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ కుమార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన కొన్ని మీడియా ఛానెళ్లతో మాట్లాడుతూ.. తనను అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఈడీ రైడ్స్ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్లు తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని చికోటి ప్రవీణ్ అన్నారు. తమ ప్రత్యర్థుల పేర్లు చెప్పి క్యాసినోలతో సంబంధం ఉన్నట్లుగా ప్రకటించాలని తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఆ పేర్లు చెప్పకపోతే హిట్ మ్యాన్ అనే సైట్ ద్వారా తనను చంపేందుకు సుపారీ ఇచ్చినట్లుగా బెదిరిస్తున్నారని అన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి మూడు నాలుగు కాల్స్ వచ్చాయని అన్నారు.
ఈ నంబర్ల నుంచి కాల్స్
‘‘+44 7881695247 నంబర్ నుంచి అర్ధరాత్రి 2 గంటలకు కాల్ వచ్చింది. మరో రెండు లోకల్ నంబర్స్ నుంచి కూడా కాల్స్ వచ్చి ఫలానా వారి పేర్లు చెప్పి అవి బయటికి చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. వారు ఏపీకి చెందిన నాయకులు’’ అని తెలిపారు.
కాల్స్ ను రికార్డ్ చేసి, వాటిని ఫిర్యాదు సమయంలో ఆధారాలుగా చూపిస్తారా? అని ప్రశ్నించగా, వాట్సప్ ద్వారా కాల్స్ చేశారని, అవి రికార్డ్ అవ్వవని చెప్పారు. తనకు భద్రత ముప్పు ఉన్నందున ఇప్పటికే హైకోర్టులో రిట్ వేశానని, దానిపై ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. ఈ కేసు ఎంక్వైరీ దశలో ఉన్నందున తాను ఎక్కువగా దాని గురించి ఏమీ మాట్లాడబోనని చెప్పారు. ఇప్పటిదాకా తాను నేపాల్, గోవాలో నిర్వహించిన క్యాసినోలను లీగల్ గానే నిర్వహించినట్లుగా చెప్పుకొచ్చారు.
ఈ క్యాసినోలకు ప్రమోషన్స్ షోస్ కోసం సెలబ్రిటీలు హాజరవుతారని తెలిపారు. రాజకీయ నాయకుడైనా, సెలబ్రిటీ అయినా ఎవరికైనా ఒక ప్రైవేటు లైఫ్ ఉంటుందని అన్నారు. అంతేకానీ, తాను ఎవరికీ బినామీగా లేనని, తనకు ఆ అవసరం లేదని అన్నారు.
ఈడీ విచారణకు సహకరించా
‘‘ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. రాజకీయ స్వార్థం కోసమే నా భుజంపై తుపాకీ పెట్టారు. విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారు. మా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. నేను ఎలాంటి హవాలా వ్యాపారాలకు పాల్పడలేదు. సినీ ప్రముఖుల ప్రమోషన్లకు చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయి. వీఐపీలు, వీవీఐపీలు క్యాసినోలకి వచ్చింది వాస్తవం. వారి పేర్లను నేను చెప్పలేను. నాకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఈడీ ఎప్పుడూ పిలిచినా వెళ్లేందుకు నేను రెడీ’’ అని వెల్లడించారు.