TSRTC Cashless Services: నగదు లేకున్నా సరే, డెబిట్, క్రెడిట్ కార్డులుంటే చాలంటున్న ఆర్టీసీ!
TSRTC Cashless Services: చిల్లర డబ్బులు లేకుండా ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ చిల్లరే కాదు నగదు లేకున్నా పర్లేదంటూ క్యాష్ లెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది టీఎస్ఆర్టీసీ.
TSRTC Cashless Services: చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే తెగ ఆలోచించేవాళ్లం. కానీ ఇప్పుడా సమస్య లేకుండా పోయింది. చేతిలో చిల్లర లేకున్నా, అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు. చేతిలో నగదు లేకపోయినా పేమెంట్ నడిచేలా ఏర్పాట్లు చేశారు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. అదెలా అనుకుంటున్నారా.. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా. బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన చరవాణి, క్రెడిక్, డెబిట్ కార్టుల క్యూఆర్ కోడ్ తో యూపీఐ పేమెంట్లు తీసుకోబోతున్నారు. ఆర్టీసీలో ఎక్కడికి వెళ్లినా చేతిలో కార్డులు, మొబైల్ ఫోన్ ఉంటే చాలు. కరీంనగర్ రీజియన్ లో దూరప్రాత బస్సు సర్వీసుల్లో అమలు చేస్తున్నారు.
ఇప్పటికే గ్రేటర్ లో ఉండగా.. తాజాగా కరీంనగర్ లో!
ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు టీఎస్ఆర్టీసీ.. తాజాగా ఐ -టిమ్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్) ల ద్వారా బస్సుల్లో నగదు రహిత టికెట్ కొనుగోలు అందుబాటులోకి తెచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో స్వైపింగ్, క్యూఆర్ కోడ్ తో టికెట్ల కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో ఈ పద్ధతిని అమలు చేస్తుండగా.. తాజాగా కరీంనగర్ రీజియన్ లో ప్రవేశ పెట్టారు. తెలగాణ వ్యాప్తంగా 928 ఐ - టిమ్ములు కొనుగోలు చేయగా.. కరీంనగర్ రీజియన్ లో 10 డిపోలకు కలిపి 73 ఔ - టిమ్ములు, 36 సిమ్ములు వచ్చాయి. గరుడ, గరుడ ప్లస్, రాజధాని, హైటెక్, సూపర్ లగ్జరీ (కొన్నింటిలో) బస్సు సర్వీసుల్లో నగదు రహిత సేవలు అందించాలని నిర్ణయించారు.
డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ..!
ప్రస్తుతం మంథని నుంచి ధర్మవరం, కరీంనగర్-1 డిపో నుంచి బెంగళూర్ (గరుడ), జగిత్యాల, కోరుట్ల నుంచి శంషాబాద్ విమానాశ్రయం (ఇంద్ర), కరీంనగర్ - 2 నుంచి హైదరాబాద్ (హైటెక్) బస్సు సర్వీసులతో పాటు మరికొన్ని దూర ప్రాంత సర్వీసుల్లో నగదు రహిత టికెట్లు ఇస్తున్నారు. దశల వారీగా అన్ని సర్వీసుల్లో అందుబాటులోకి తేనున్నారు. ఐ - టిమ్ములను ఉపయోగించే విధానంపై ప్రతి డిపో నుంచి సిస్టం సూపర్ వైజర్లకు హైదరాబాద్ లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అక్కడ తర్ఫీదు పొందిన అధికారులు డ్రైవర్లు, కండక్టర్లకు నేర్పించారు. ప్రస్తుతం ఆయా డిపోలకు వచ్చిన ఐ-టిమ్ముల్లో సాఫ్ట్ వేర్ ను వేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. నాలుగు నెలల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని బస్సుల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక్కో ఐ - టిమ్ములో రెండేసి సిమ్ములు..!
ఐ - టిమ్ములకు తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం కావాల్సిందే. అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవు. టిమ్ములు కూడా పని చేయవు. దీన్ని అధిగమనించడానికి ఐ - టిమ్ముల్లో రెండు సిమ్ములను వేస్తున్నారు. ఏదో ఒక నెట్ వర్క్ పనిచేసే అవకాశం ఉంటుంది. ఆర్టీసీలో నూతనంగా ప్రవేశ పెట్టిన ఐ - టిమ్ముల ద్వారా సంస్థకు ఇటు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, సీట్ల నంబర్ సహా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. కరీంనగర్ నుంచి బెంగళూర్ వెళ్తున్న బస్సుల్లో ఓ ప్రయాణికుడు టికెట్ రిజర్వ్ చేస్కుంటే వెంటనే అది టిమ్ము తెరపై పడుతుంది. ప్రయాణికులు ఆ బస్సుల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుస్తుంది. కొన్ని డిపోల్లో ప్రయాగాత్మకంగా క్యాష్ లెస్ సేవలు అందుబాటులోకి తెచ్చాయి.