Car Fire Accident: హైదరాబాద్‌లో పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో మంటలు, డ్రైవర్ ఏం చేశాడంటే !
Hyderabad News: హైదరాబాద్ లోని లక్డీకపూర్ చౌరస్తా వద్ద బంకులో పెట్రోల్ కొట్టిస్తుండగా మంటలు చెలరేగి ఓ కారు దగ్ధమైంది. డ్రైవర్ వాహనం దిగడంతో ప్రాణాపాయం తప్పింది.
Car catches fire at Petrol Pump at Lakdikapul in Hyderabad: హైదరాబాద్: అసలే వేసవి కాలం మొదలైంది. వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అకస్మాత్తుగా వాహనాలలో మంటలు రావడం వేసవికాలంలో అధికంగా జరుగుతుంటాయని తెలిసిందే. హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం ఇలాంటి ఘటనే జరిగింది. లక్డికపూల్ చౌరస్తా వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొన్ని నిమిషాల్లోనే కారు మంటల్లో కాలి బూడిదైంది. పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో చుట్టు పక్కల ఉన్న వారు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
నగరంలోని సైఫాబాద్ రోడ్డులో ఓ కారు బుధవారం (మార్చి 6న) మధ్యాహ్నం మాసబ్ ట్యాంక్ నుంచి లక్డీకపూల్ వైపు వెళ్తోంది. చౌరస్తా వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఇంధనం కొట్టిస్తుండగా అకస్మాత్తుగా ఆ కారు నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును రోడ్డు అవతలివైపు తీసుకెళ్లి నిలిపివేసి, వాహనం నుంచి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. కొన్ని నిమిషాల్లోనే కారు మంటల్లో కాలిపోయింది. ఈ షాకింగ్ ఘటన సైఫాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే సమయస్ఫూర్తితో కారును పెట్రోల్ బంకు నుంచి దూరంగా తీసుకెళ్లడంతో ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తి నష్టం తప్పింది. బంక్ సిబ్బంది, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని కారు మంటల్ని ఆర్పివేశారు. కానీ అప్పటికే మంటల్లో కారు మొత్తం కాలిబూడిదైంది.
A car caught fire at Lakdikapul junction in Hyderabad. No injuries reported. pic.twitter.com/qw6TjWtj9W
— The Siasat Daily (@TheSiasatDaily) March 6, 2024