Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడి వద్ద మొదలైన సందడి, ఈ ఏడాది ప్రత్యేకతలు ఏంటంటే?
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి వద్ద సందడి మొదలైంది. చవితికి ఒక రోజు ముందే ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు తొలిపూజ ప్రారంభం కానుంది.
Khairatabad Ganesh: వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. గల్లీ గల్లీలో గణనాథుడు కొలువై పూజలు అందుకుంటారు. ఇక హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం సంగతే వేరు. ఖైరతాబాద్ గణేషుడి గురించి ప్రపంచం మొత్తం చర్చ జరుగుతంది. ఎన్ని అడుగుల విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు? ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడనే అనే చర్చ సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడి వద్ద సందడి మొదలైంది. చవితికి ఒక రోజు ముందే ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు.
సోమవారం ఉదయం 9.30 గంటలకు తొలిపూజ ప్రారంభం కానుంది. 11 గంటలకు ఖైరతాబాద్ గణేశుడిని గవర్నర్ తమిళిసై దర్శించుకోనున్నారు. మరోవైపు, గణేశుడి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. భక్తులు ఒక్కసారైనా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు.. ఇలా క్రమంగా ప్రతీ ఏడాది భారీ గణపయ్యకు భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది.. భారతదేశంలోని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతంలో గణేష్ చతుర్థి వార్షిక పండుగ సందర్భంగా స్థాపించారు.
శ్రీ దశమహా విద్యాగణపతి ప్రత్యేకతలు
విఘ్నాధిపతిగా తొలిపూజ అందుకునే గణపయ్య పండుగ మొదలైంది. గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో రూపుదిద్దుకుంది. విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఉంటుంది. నిల్చున్న తీరులో 'శ్రీ దశమహా విద్యాగణపతి' విగ్రహం ఉండగా.. తలపై ఏడు సర్పాలు ఉంటాయి. వెనక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. పది చేతులు ఉంటాయి. కుడి వైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపు కింద నుంచి పైకి చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి.
కాళ్ల వద్ద అటూ ఇటూ పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ప్రధాన మండపం రెండు వైపులా శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, శ్రీ వీరభద్ర స్వామి వార్ల విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటాయి. పర్యావరణ హితం కోసం మట్టి గణపతినే ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఖైరతాబాద్లో గణేశుని ఉత్సవాలు ప్రారంభమై ఈ ఏడాదితో 69 ఏళ్లు అవుతోంది. ఏటా సిద్ధాంతి విఠలశర్మ సూచనతో నమూనా సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారమే ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా ఆయన సూచనల ప్రకారం నామకరణం చేశారు.
150 మంది కళాకారులు, 100 రోజులు శ్రమించి
దాదాపు 150 మంది కళాకారులు 100 రోజులు శ్రమించి ఈ సుందరమైన విగ్రహాన్ని తయారు చేశారు. లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం వల్ల అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీరభద్రుడిని పూజించడం వల్ల ధైర్యం వస్తుంది. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వరిగడ్డి, వరిపొట్టు, ఇసుక, వైట్ క్లాత్ ఇవన్నీ విగ్రహ తయారీలో ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా విగ్రహాన్ని తయారు చేశామని, విగ్రహ తయారీకి రూ.90 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం.
ఉత్సవాలు ఎలా ప్రారంభం అయ్యాయంటే?
బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో, సింగరి శంకరయ్య 1954లో ఖైరతాబాద్‌లోని ఒక ఆలయంలో 1 అడుగు (0.30 మీ) గణేష్ విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు. నిర్మించబడిన విగ్రహం యొక్క ఎత్తు 2014 వరకు ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుతూ ఏర్పాటు చేస్తున్నారు. 2019 నాటికి విగ్రహం శిఖరం ఎత్తు 61 అడుగులకు చేరింది.. తద్వారా ఆ సంవత్సరంలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా అవతరించింది. ఇక.. అక్కడి నుంచి మళ్లీ క్రమంగా తగ్గించడం మొదలు పెట్టారు. హుస్సేన్ సాగర్ సరస్సుకు మార్గం పరిమితులు, పర్యావరణ సమస్యల కారణంగా పరిమాణం తగ్గిస్తూ వచ్చారు. అయితే ఈ సారి ఏకంగా 63 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.