KTR Letter: తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
Rahul Gandhi: తెలంగాణలో ఏడాది పాలనలోనే పదేళ్ల విధ్వంసం సృష్టించి అన్ని వర్గాలను మోసం చేసిన రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR Wrote A Letter To Rahul Gandhi: పచ్చగా ఉన్న తెలంగాణ ఒక్క ఏడాదిలోనే వందేళ్ల విధ్వంసానికి గురైందని ఆరోపించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా ఆయన లేఖ రాస్తూ రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. పులకేసి హింసించినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి హింసిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కష్టమొచ్చినా సరే ఇలా పిలిస్తే అలా వస్తానని చెప్పి తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా అన్ని వర్గాలను నయనంచనకు గురిచేశారన్నారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా మోసం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులకేసి మాదిరిగా ప్రజలను హింసిస్తుంటే ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఢిల్లీలో గప్ చుప్ అయిపోయారని ధ్వజమెత్తారు.
ఇంకా ఏమన్నారంటే..."అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచే మీ నయవంచన ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అంటూ ఊదరగొట్టిన మీరు 3 వందల రోజులు దాటినా వాటిని అమలు చేయటం చేతకాక చేతులేత్తేశారు. కాంగ్రెస్ కబంధ హస్తల్లో చిక్కుకొని తెలంగాణ విలవిల లాడుతోంది. అభయ హస్తం అని నమ్మబలికి భస్మాసుర హస్తంతో ప్రజలను నిండా ముంచారు. ఒక్కటా, రెండా ఈ ఏడాదిలో మీ పాలన వైఫల్యాలు చిత్ర గుప్తుడి చిట్టా అంతా ఉన్నాయి." అని ఆరోపించారు.
"నమ్మించి మోసం చేయటమనే నైజం కాంగ్రెస్ నరనరాల్లోనే ఉంది. ఆరు గ్యారంటీలు, అభయ హస్తం అంటూ ప్రజలను మోసం చేసేందుకు ముందుగా ఢిల్లీ నుంచి వచ్చి నాంది పలకింది మీరే. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ఆ తర్వాత మీ బాటలోనే ఇక్కడి నాయకులు నడుస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత నాది అని చెప్పిన మీరు… అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు చూడలేదు. ఒక ఉచిత బస్సు మినహా ఒక్క గ్యారంటీనీ అమలు చేయలేని అసమర్థత మీది. రైతులకు రుణమాఫీ అని చెప్పి సగం మందికి మాఫీ చేయలేదు. కానీ మీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో మాత్రం పూర్తి రుణమాఫీ చేసేశామంటూ అబద్దాలు ప్రచారం చేసుకున్నారు. ఒక్క రుణమాఫీయే కాదు రైతు భరోసాను ఎత్తగొట్టారు. బోనస్‌ను బోగస్ చేశారు. కనీసం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దద్దమ్మల మాదిరిగా తయారయ్యారు. నమ్మి ఓటు వేసినందుకు ఒక్క వర్గం కాదు తెలంగాణలోని సబ్బండ వర్గాలను మోసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న మీ తీరును సమాజం గమనిస్తోంది." అని లేఖలో పేర్కొన్నారు.
"అన్ని వర్గాల సంక్షేమ మా బాధ్యత అంటూ ఎన్నికల ముందు మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల సంక్షేమాన్ని నాశనం చేసే పనిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ సాధించింది ఏంటంటే సబ్బండ వర్గాలను రోడ్డెకించటమే. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, అంగన్వాడీలు, పోలీసులు ఇలా అంతా ధర్నాలు, నిరసనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా పోలీసులను పోలీసులతోనే కొట్టించిన ఘనత మీకే దక్కుతుంది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయటమే క్షమించారని తప్పంటే...అది చాలదన్నట్లుగా గెలిపించిన ప్రజలను హింసిస్తున్నారు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"సాధారణంగా ప్రజల బాధలను తీర్చటం పాలకుల బాధ్యత. ప్రజలను బాధించటం ఎంత మాత్రం కాదు. కానీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హింసించే పులకేసి మాదిరిగా తయారయ్యారు. మూసీ, హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల పొట్ట కొడుతున్నాడు. హైడ్రా, మూసీ పేరు చెబితేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలకు గూడు కట్టిస్తామంటూ నమ్మబలికి వాళ్ల గూడును చెదరగొట్టిన గొప్ప పాలన మీ ప్రభుత్వానిది. పేద, మధ్య తరగతి ప్రజలను ఇళ్లను కూలగొడుతుంటే వాళ్ల చేసిన ఆర్తనాదాలు మీకెందుకు వినబడలేదు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా వస్తా అని బీరాలు పలికినా మీరు ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారు. స్వయంగా అశోక్ నగర్ వచ్చి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు నాది భరోసా అని చెప్పి ఆ నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు సిగ్గు అనిపించటం లేదా? " అని ప్రశ్నించారు.
దమ్ముందా రాహుల్ గాంధీ మీకు...అశోక్ నగర్‌లో నిరుద్యోగుల దగ్గరకు వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్ గాంధీ రైతుల దగ్గరకు వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్ గాంధీ విద్యార్థుల దగ్గరకు వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్ గాంధీ మీకు రక్షణ కల్పిస్తున్న పోలీసులా దగ్గరకు వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్ గాంధీ మూసీ, హైడ్రా బాధితులను పరామర్శించేందుకు? దమ్ముందా రాహుల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల దగ్గరకు వెళ్లేందుకు? దమ్ముందా రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్ల దగ్గరకు వెళ్లేందుకు? అసలు తెలంగాణ ప్రజల ముందు వచ్చే దమ్ముందా రాహుల్ గాంధీ మీకు." అని ప్రశ్నించారు.
"మీ చేతగాని పాలన కారణంగా రాష్ట్రం ఆగమవుతోంది. మీ ఏడాది పాలనలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారు. ఇంకా నాలుగేళ్ల మీ చేతగాని పాలన కారణంగా తెలంగాణ ఏమైపోతుందనని ఆవేదన కలుగుతోంది. రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు మీ పాలన మొదలు కాగానే ఆత్మహత్యలు చేసుకోవటం మొదలు పెట్టారు. ప్రతి వర్గాన్ని రోడ్డెక్కించారు. కంపెనీలు తరలిపోతున్నాయి. రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోంది. పాలన అనుభవం లేని బ్లాక్ మెయిలింగ్ ముఖ్యమంత్రి కారణంగా తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో నిరసనలు కూడా చేసేందుకు వీలు లేకుండా నెల రోజుల పాటు ఆంక్షలు పెట్టే దుస్థితి మీ ప్రభుత్వానిది." అని దుమ్మెత్తిపోశారు.
"రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేయకుండా నేల విడిచి మీరు చేసిన సాము కారణంగా తెలంగాణ భవిష్యత్ తలకిందులుగా మారింది. తీరా చేయాల్సిన అన్యాయమంతా చేసి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జు ఖర్గే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మించి హామీలు ఇస్తే ఆ రాష్ట్రం దివాళా తీస్తుందని స్వయంగా మీ పార్టీ అధ్యక్షుల వారే నొక్కి వక్కాలిస్తున్నారు. అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చిన పాపంలో మీరే ప్రధాన భాగస్వాములు. ఇప్పుడు అందుకు క్షమాపణలు చెబుతారా రాహుల్ గాంధీ." అని కేటీఆర్ ప్రశ్నించారు
"దొరికిందే అవకాశమని మీ ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణను అడ్డగోలుగా దోచుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరి ట్యాక్స్ వాళ్లకు కట్టే పరిస్థితి తెచ్చారు. మీ ముఖ్యమంత్రి బహిరంగంగానే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కుంభకోణాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. ఇది చాలదన్నట్లుగా కొడితే ఏనుగు కుంభస్థలం అన్నట్లు మూసీ ప్రాజెక్ట్ తెరపైకి తెచ్చారు. రూ. లక్షా 50 వేల కోట్లతో చేపడుతామంటున్న ఈ ప్రాజెక్ట్ ఎవరి ప్రయోజనాల కోసమో? ఈ మొత్తం సొమ్ములో ఢిల్లీ వాటా ఎంత? పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు జేబులో వేసుకొని ఈ ప్రాజెక్ట్‌కు మీ ఆమోదం లేకుండానే జరుగుతోందా?" అని కేటీఆర్ నిలదీశారు.
"మీ మోసం, నయవంచన ఒక్క ప్రజలతోనే ఆగిపోలేదు. మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకుంటున్న తీరు చూస్తుంటే సానుభూతి కలుగుతోంది. పార్టీ ఫిరాయింపులు చేస్తే తక్షణమే వేటు పడేలా చట్టం అంటూ తెలంగాణలో ఫోజులు కొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంటే తేలుకుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయారు. రాజ్యాంగాన్ని కాపాడుతానంటూ రాజ్యాంగ ప్రతి పట్టుకొని తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతుంటే మౌన ముని అయిపోయారు. అదానీ విషయంలో మీ హిప్పోక్రసీ చూసిన తర్వాత నవ్వాలో, ఏడవాలో తెలియని దుస్థితి. ఓ వైపు మోడీ, అదానీని కలిపి మోదానీ అంటారు.
మరోవైపు తెలంగాణలో దోస్తానా చేస్తారు. సిగ్గు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి. మొత్తంగా ఏడాది కూడా తిరగకముందే కాంగ్రెస్ నాయకులు రోడ్లపై తిరగలేని దుస్థితి తీసుకొచ్చారు. తెలంగాణ ఆగమయ్యేందుకు ప్రధాన కారణం మీరే. కనుక సూటిగా మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పండి. ఇచ్చిన హమీలు నెరవెర్చకుండా సబ్బండ వర్గాలను మోసం చేసిన మీరు, అభివృద్ది పథంలో ఉన్న తెలంగాణను అవీనీతి తెలంగాణాగా మార్చినందుకు యావత్తు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. అని కేటీఆర్ డిమాండ్ చేశారు.