Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.
Ugadi Panchanga Sravanam in Telangana: ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు ఇబ్బంది పడతాయని అన్నారు. వైరల్ జ్వరాలు, కోవిడ్ వంటి మహమ్మారులు ఈ ఏడాది మానవాళిని ఇబ్బంది పెట్టబోవని చెప్పారు. మాస్కులు లేకుండానే ఈ ఏడాది బయటతిరగవచ్చని చెప్పారు. వాయు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో శోభకృత్ ఉగాది వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని పంచాంగ శ్రవణాన్ని విన్నారు.
Subhakritu Nama Samvatsara Panchanga Sravanam: కమ్యూనికేషన్ రంగం మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. తెలుగు సినిమా రంగంపై శుక్రుడి ఆధిపత్యం అధికంగా ఉండడం వల్ల వచ్చే సంవత్సరం వరకూ మీడియా, టీవీ రంగం, చలన చిత్ర రంగాలు బాగా రాణిస్తాయని చెప్పారు. మీడియా రంగంలో వార్తల కోసం వెంపర్లాడకుండానే, ఏ వార్త ముందు వేయాలనే అర్థం కాని స్థితిలో పరిస్థితులు ఉంటాయని చెప్పారు. మీడియా రంగం మరింత అత్యుత్సాహంతో పని చేస్తుందని చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ ఏడాది మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ఘనత చాటే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు.
శుక్రుడు, శుభగ్రహాల ఆధిపత్యం వల్ల ఈ ఏడాది అత్యధిక శుభాలే జరుగుతాయని ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా వివరించారు. తెలంగాణ ప్రభుత్వంలో కొత్త విశ్వవిద్యాలయాలు, ఇప్పటికే ఉన్న విశ్వవిద్యాలయాలు, కొత్త ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టే నియామకాల విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలని సూచించారు. వ్యయాధిపతి వీక్షణం ఇక్కడ ప్రభావం చూపిస్తోంది కాబట్టి జాగ్రత్త వహించాలని చెప్పారు. నిరుద్యోగుల సమస్య తీరే అవకాశం ఉందని చెప్పారు. రైతే రాజు కాబోతున్నాడని పంచాంగ శ్రవణంలో వివరించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్డక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ భాను ప్రసాద్, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు రమణా చారి, టీఎస్ఐడీసీ ఛైర్మన్ వేణుగోపాల చారి, డీజీపీ అంజనీ కుమార్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, గండ్ర వెంకటరమణా రెడ్డితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.