తెలంగాణలో అభివృద్ధిపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో కీలక ఉపన్యాసం చేయనున్నారు.
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌క్లూసివ్ డెవలప్‌మెంట్, ది తెలంగాణ మోడల్ అనే అంశంపై ఈ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కవితను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ కవిత యూకేకు వెళ్లారు. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే అవకాశాన్ని పొందినందుకు కవితను కార్యకర్తలు అభినందించారు. తెలంగాణ ఘనతను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పడం రాష్ట్రానికి గర్వకారణమని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కొనియాడారు.
తెలంగాణ మోడల్‌పై కీలకోపన్యాసం
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీని ఆకర్షించాయి. తెలంగాణ మోడల్‌పై కీలకోపన్యాసం ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించింది. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళ ప్రయోజనకర పథకాల రూపకల్పనపై ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. తెలంగాణలో వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమించిన తీరు, రైతుబంధు, పేరిట సీఎం కేసీఆర్ అన్నదాతలకు పెట్టుబడి సాయం, రైతు భీమా, దళితబంధు, కేసీఆర్ బీమా, 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా, కులవృత్తులను ప్రోత్సహాకాలు, చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటి సరఫరా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మరమ్మత్తు చేయడం, విద్య, వైద్యం, మౌలిక వసతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, సహా పలు ఇతర రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి గురించి కవిత ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అన్నయ్య బాధ్యతాయుతమైన వ్యక్తి
మంత్రి కేటీఆర్‌తో చిన్నప్పుడు దిగిన ఫొటోను బీఆర్‌ఎస్ నాయకుడు అర్వింద్ అలిశెట్టి పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్సీ కవిత.. ఎక్స్‌లో ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ, అతను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. కేటీఆర్‌తో అనేక మధురానుభూతులు ఉన్నాయి. వాటిని వర్ణించలేము. ఇది కరెక్టే కదా అన్నయ్య అంటూ ట్వీట్ చేశారు. దీన్ని కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ నుంచి పోటీ
ఎమ్మెల్సీ కవిత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కవిత శాసనమండలికి పంపారు. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే విరామం లేకుండా నిజామాబాద్ లో పర్యటిస్తున్నారు. కవితను వచ్చే ఎన్నికల్లో గెలపించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు.