BRS MLA Joins Congress: బీఆర్ఎస్‌కు వరుస షాకులు- కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు
Telangana News | బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
BRS MLA Mahipal Reddy joins congress party | హైదరాబాద్: తెలంగాణలో నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఓవైపు అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలతో ఉత్సాహంగా కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఒక్కో ప్రజా ప్రతినిధిని కోల్పోతూ డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి వీడుతున్న ప్రజా ప్రతినిధులతో ఏ ప్రయోజనం లేదని, పదవుల కోసమే పార్టీ మారే వ్యక్తులు.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచే దమ్ము వారికి లేదంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి తన అనుచరులతో వెళ్లిన మహిపాల్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి మహిపాల్ రెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్లు, మహిపాల్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కూడా హస్తం పార్టీలో చేరిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు పాల్గొన్నారు.
అధికార పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు
ఇదివరకే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోగా, తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి, హస్తం గూటికి చేరారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఒక్కొక్కరిగా హస్తం గూటికి చేరారు. ఇప్పటివరకూ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లయింది.
కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఫిరాయింపులు
పార్టీలో చేరికలపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంటే, ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్థించుకున్నారు. ఏఐసీసీ సూచనల మేరకే ఎమ్మెల్యేల్ని చేర్చుకుంటున్నామని తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ తెలిపారు. ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా తాము డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ లో చేర్చుకోవట్లేదని స్పష్టం చేశారు. ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహించడం లేదని, కానీ ప్రజలకు అభివృద్ధి పనుల కోసమే తమ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల కోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఈ మేరకు రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అందుకే మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేయకపోతే కేసీఆర్ విద్యుత్ అంశంపై తాము వేసిన కమిషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని మధుయాష్కీ ప్రశ్నించారు.