BRS MLA Bandla Krishna Mohan Reddy: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఆగని వలసలు- ఇవాళ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక- మరికొందరు రెడీ!
Telangana: కాంగ్రెస్‌లో చేరుతున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల లెక్క పెరుగుతోంది. ఇప్పటి వరకు 14 మంది ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరారు. ఇందులో ఒకరు రాజీనామా చేశారు.
BRS MLA Joins In Congress: తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి నేతల వలసలు ఆగడం లేదు. దానం నాగేందర్‌తో మొదలైన చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో కారును వీడి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది.
ప్రత్యర్థులను ఒప్పించి..
కారు గుర్తుపై గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముందు చాలా హైడ్రామా నడిచింది. ముందుగా పార్టీ మారే ఆలోచన ఉన్నట్టు ఫీలర్ వదిలారు. దీన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేశారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు తెగ వేధించిన వ్యక్తిని ఎలా తీసుకుంటారని చేర్చుకోవద్దని అధినాయకత్వానికి వినతులు పంపించారు. వారందరీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడరు. ముఖ్యంగా సరితా తిరుపతయ్యకు నచ్చజెప్పిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చారు.
మూడు రోజుల నుంచి ఏడుగురు
గురువారం అర్థరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు సైలెంట్‌గా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండానే ఎమ్మెల్సీ భాను ప్రసాద్, బస్వరాజు సారయ్య. దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ పార్టీ మారిపోయారు. రాత్రి ఒంటిగంట సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కండువాలు కప్పేసుకున్నారు.
14మంది చేరిక- ఒకరు రాజీనామా
బీఆర్‌ఎస్ బీఫామ్ తీసుకొని కారు గుర్తుపై పోటీ చేసి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్‌కు జై కొట్టిన వాళ్ల సంఖ్య 14కి చేరింది. ఇందులో ఎమ్మెల్యేలు ఏడుగురు ఉంటే ఎమ్మెల్సీలు ఆరుగురు ఉన్నారు. ఒక రాజ్యసభ ఎంపీ కూడా పార్టీ ఫిరాయించారు. రాజ్యసభ ఎంపీ కే కేశవరావు పార్టీ మారినప్పటికీ ఆయన తన రాజ్య సభ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.
39 మందిలో కారులోంచి దూకేసిన ఏడుగురు నేతలు
2023లో జరిగిన ఎన్నిక్లలో 119 స్థానాల్లో పోటీ చేసిన బీఆర్‌ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది. వారిలో ఇప్పుడు ఏడుగురు కాంగ్రెస్‌కు జై కొట్టి పార్టీ మారారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్వాడ ఎమ్మల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కోరట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హస్తం గూటికి చేరిపోయారు. ఇవాళ గద్వాల ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి వచ్చేశారు.
మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జోరుగా ప్రచారం
వీళ్లే కాకుండా రేపు ఎల్లుండి కూడా మరికొందరు కాంగ్రెస్‌పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే శుక్రవారం జరిగిన జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధుల సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారని టాక్ నడుస్తోంది. వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరేందుకే మొగ్గుతున్నారని అందుకే సమావేశానికి రాలేదని ఫోన్‌లు చేసినా స్పందించడం లేదని ప్రచారం నడుస్తోంది.
Also Read: అపోహల రాజకీయాల మధ్య తెలుగు రాష్ట్రాల చర్చలు - చంద్రబాబు, రేవంత్ గీత చెరిపేయగలరా ?