Malla Reddy: నా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది నేనే- అసెంబ్లీ లాబీల్లో మంత్రి మల్లారెడ్డి కామెంట్స్
Malla Reddy: కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించేంది తానేనని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ లో కేఎల్ఆర్కు టికెట్ ఇప్పించానన్నారు.
Malla Reddy: తన వ్యాఖ్యలతో, తన మ్యానరిజంతో ఎప్పుడూ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఆయన మైక్ పట్టుకున్నారంటే.. డైలాగుల వరద పారుతుంది. ఒక్కో డైలాగు ఒక్కో ఆణిముత్యంలా మారిపోయి.. మల్లారెడ్డిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంది. తనదైన శైలి వ్యాఖ్యలతో అలరిస్తుంటారు. ఒక్కోసారి ఆయన చేసే కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా కూడా మారుతుంటాయి. అలాంటి వ్యాఖ్యలే మరోసారి చేశారు మంత్రి మల్లారెడ్డి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అన్ని పార్టీల్లో తనకు మంచి మిత్రులు ఉన్నారని, కాంగ్రెస్ అధిష్ఠానంలో తనకు దోస్తులు ఉన్నారని చెప్పారు మల్లారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తానే నిర్ణయిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో కేఎల్ఆర్ (లక్ష్మారెడ్డి)కి తానే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తానే డిసైడ్ చేస్తానని అన్నారు. ఈ సారి కూడా తన గెలుపును ఎవరూ ఆపలేరని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ తొడ గొట్టిన తర్వాత తన గ్రాఫ్ మరింతగా పెరిగిందని మల్లా రెడ్డి చెప్పుకొచ్చారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. త్వరలోనే మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఏడాదికి నాలుగు తెలంగాణ యాస సినిమాలు తీస్తానని అన్నారు. మంత్రివర్గ విస్తరణ అంటే మల్లా రెడ్డి పోస్టు ఊడుతుంది అనే తప్పుడు ప్రచారం చేశారని మల్లారెడ్డి పైర్ అయ్యారు. అలాగే తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోయి.. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు వింటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ దగ్గర డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప వేరే సబ్జెక్టు లేదని ఎద్దేవా చేశారు.
Also Read: Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద, ఎగువ నుంచి 81వేల క్యూసెక్కుల ప్రవాహం
ఆర్టీసీ విలీనంపై మల్లారెడ్డి వ్యాఖ్యలు
‘‘ఆర్టీసీ ఉద్యోగులు కూడా మన బిడ్డలే, మన కార్మికులే అని చెప్పి మొన్న కేబినెట్ మీటింగ్ లో పెద్ద ఎత్తున డబుల్ కా మీటా, డబుల్ ధమాకా ఇచ్చినం. తాము ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అవుతామని వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. ఎప్పటికీ ఆర్టీసీలోనే ఉంటమని అనుకున్నరు. ఇయ్యల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా ప్రభుత్వంలో కలుపుకున్నం. సీఎం కేసీఆర్ మహాత్ముడు, ఆయన భగవంతుడి స్వరూపం. ఏది చేసినా గొప్ప పని చేస్తడు. ఆయన లెక్క ఎవ్వరు పని చేయలేరు.’’
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటా? అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి.. మాది రాజకీయ పార్టీ.. అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘మాది రాజకీయ పార్టీ వయా.. ఎన్నికలనుకో ఏదన్నా అనుకో.. కార్మికులైతే న్యాయం జరిగిందా లేదా? వాళ్ల భవిష్యత్తు మంచిగా అయిందా లేదా? ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినయా లేదా? ఎన్నికలకు ఎట్లనన్నా పోతం, ఎన్నికల స్టంట్ ఉంటది. ఇది రాజకీయ పార్టీ. కానీ, చేసే దిల్, ధైర్యం కావాల. ఎంత ఫండ్స్ కావాలె. ఎంత ధైర్యం కావాల. అది మా కేసీఆర్ కే ఉంది’’ అని మాట్లాడారు.