అన్వేషించండి

BRS Leader Karne Prabhakar : కేసీఆర్‌కు నచ్చని పనులు చాలా చేశాం; బీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్ చెప్పిన ఉద్యమ రహస్యాలు వింటే షాక్ అవుతారు!

BRS Leader Karne Prabhakar : తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్‌కు తెలియకుండా చేసిన సంచనాలు గురించి బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత కర్నె ప్రభాకర్ బయటపెట్టారు.

BRS Leader Karne Prabhakar : బీఆర్ఎస్ పార్టీ  ప్రతీ ఏటా  డిసెంబర్ 9వ తేదీని విజయ దివస్ గా నిర్వహిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్ 29వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. ఆ తర్వాత ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఆనాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ డిసెంబర్ 9వ తేదీని విజయ దివస్‌గా ఆచరిస్తోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఉద్యమ జ్ఞాపకాలపై ఏబీపీ దేశం ప్రత్యేక ఇంటర్వూ చేసింది. ఏబీపీ దేశం ఇన్ పుట్ ఎడిటర్ వై. సుధాకర్ రావుతో, కర్నె ప్రభాకర్ తన ఉద్యమ కార్యకలపాలను వివరంగా పంచుకున్నారు.  

ప్రశ్న: సుదీర్ఘ కాలం టీఆర్‌ఎస్‌ (నేటి బీఆర్‌ఎస్‌) లో కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది?

కర్నె ప్రభాకర్ : 1990 నుంచి ఉద్యమాల్లో ఉన్నాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ వస్తుందా అన్న అనుమానాల మధ్య పని చేశాం. తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా, ఇంకా తేరుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు చాలా పెద్ద లక్ష్యం సాధించాం అనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఇది కలా, నిజమా అనిపిస్తుంది. మీరు 20 ఏళ్లు జర్నలిస్టుగా ఉన్నారు. మీరు మలిదశ తెలంగాణ ఉద్యమం కవర్ చేశారు. మీకు ఉద్యమ అనుభవాలు ఎలా ఉన్నాయో... 1990 నుంచి ఉన్న మాకు చాలా అనుభవాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజా సమితి 1969లో చేసిన పోరాటం తర్వాత అనుభవాలు ప్రజల ముందు ఉన్నాయి. ఆ అనుభవాల దృష్ట్యా ప్రజల్లో చాలా అనుమానాలు ఉండేవి. కానీ, కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సారథ్యం చేపట్టి, లక్ష్యం సాధించారు. ఇవి చాలా అద్భుతమైన ఘట్టాలు. ఒకనాడు ఢిల్లీ వెళితే మదరాసీ వాళ్లు, ఆ తర్వాత తెలుగు వాళ్లు అనేవారు. ఇప్పుడు ఢిల్లీ వాళ్లే కాదు... అమెరికా వెళ్లినా తెలంగాణ అంటే తెలిసిపోయే పరిస్థితి ఉంది.

ప్రశ్న: 2000లో టీఆర్‌ఎస్‌ పుట్టింది. ఆ పార్టీ నాయకుడు కేసీఆర్‌తో అనుబంధం ఎలా ఏర్పడింది?

కర్నె ప్రభాకర్ : 1990లోనే విద్యార్థి దశలోనే తెలంగాణ ఉద్యమంలో పని చేశాం. మేము పని చేసిన చాలా సంస్థలను నిషేధించారు. మేము టీవీఎస్ (తెలంగాణ విద్యార్థి సమితి) ను 1992లో మిత్రులతో కలిసి విద్యార్థి సంఘంగా ప్రారంభించాం. చర్చలకు నాడు పరిమితం అయ్యాం. భువనగిరిలో గద్దర్‌, ఇతర నేతల ఆధ్వర్యంలో సభలు జరిగాయి. సూర్యాపేటలో ఆనాడు వీరన్న, వి. ప్రకాశ్, పాశం యాదగిరి, ఇన్నయ్య వంటివారు సభలు పెట్టారు. మేము కార్యకర్తలుగా పని చేశాం. అదే సమయంలో కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారు. మాకు చాలా అనుమానాలు ఉండేవి. అయితే, తాను జలదృశ్యంలో మూడు నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ అంశం కోసం స్పీకర్‌ పదవికి, ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇది నన్ను ఆకర్షించింది. ఆయనపై నమ్మకం కలిగింది. ఆయనలో ఫైర్‌ కనబడింది. కరీంనగర్‌లో మొదటి తెలంగాణ సభ జరిగింది. లక్ష మంది సభకు హాజరయ్యారు. దాంతో మరింత విశ్వాసం పెరిగింది. కేసీఆర్‌ స్ట్రాటజీతో తెలంగాణ ముందుకు సాగుతుందని అనిపించింది. అలా కేసీఆర్‌తో అనుబంధం కలిగింది.

ప్రశ్న: కేసీఆర్‌తో వ్యక్తిగత పరిచయం ఎలా ఏర్పడింది?

కర్నె ప్రభాకర్ : పార్టీ మొదలు పెట్టిన తర్వాత తొలి వారంలో కేసీఆర్‌ ని కలిసి విద్యార్థి నేతలం అని పరిచయం చేసుకున్నాం. నా పేరు అడిగారు. అలా ఆయనతో కొనసాగుతున్నాం. ఆ తర్వాత అక్టోబర్‌లో ఆయన సభ పెట్టి వస్తుంటే, ఉప్పల్ వద్ద ఆయన కాన్వాయ్‌ ఆగింది. అయితే, ఆయన నన్ను అక్కడ చూసి నా పేరు పెట్టి పిలిచారు. మూడు నెలల తర్వాత కూడా పేరు పెట్టి పిలిచారు. ఆ తర్వాత పార్టీ యూత్‌ వింగ్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇచ్చారు. నేను జర్నలిజం చేశాను. నాకు పబ్లిసిటీ సెక్రటరీగా అవకాశం అడిగాను. కానీ, ఆయన నాకు యూత్‌ ప్రెసిడెంట్‌గా చేశారు.

ప్రశ్న: కేసీఆర్‌ ఉద్యమ కార్యాచరణ విషయంలో మిమ్మల్ని, తర్వాత బొంతు రామ్మోహన్‌కు ఎక్కువ గుర్తించారని ప్రతీతి. ఏంటి కారణాలు?

కర్నె ప్రభాకర్ : నేను యూత్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. బొంతు రామ్మోహన్ స్టూడెంట్‌ వింగ్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. దీంతో ఇద్దరం కలిసి పని చేయాల్సి వచ్చింది. అయితే, కేసీఆర్‌కు విద్యార్థులను ఉద్యమంలో ఇన్వాల్వ్‌ చేయకూడదని అనుకునేవారు. కానీ, ఆయనపై మాకున్న నమ్మకం ఏంటో తెలియదు కానీ, ఆయన చాలా ఉద్యమ కార్యాచరణను అప్పగించేవారు. అవి ఆనాడు బయటకు చెబితే జైలు నుంచి బయటకు వచ్చే వాళ్లం కాదు. మర్డర్‌ కేసులు, విధ్వంసం కేసులు పెట్టి జైలులోనే ఉంచేవారు.

ప్రశ్న: 2000 నుంచి 2009 వరకు మీరు ఇన్వాల్వ్‌ అయిన ఉద్యమ కార్యక్రమాలు ఏంటి?

కర్నె ప్రభాకర్ : బయట ప్రపంచానికి తెలియని కార్యక్రమాలను మా యూత్‌ వింగ్‌, స్టూడెంట్‌ వింగ్‌ చేశాయి. తెలంగాణ అంటే ఎన్‌కౌంటర్లు చేస్తున్న సమయం. అయితే, ఆనాడు కేసీఆర్‌ పై విశ్వాసం; మమ్ముల్ని కాపాడుకుంటారన్న నమ్మకం ఉండేది. చాలా తీవ్రమైన కార్యక్రమాలు చేశాం. తెలంగాణ కోసం చేసినవి ఆనాడు ఏవీ తప్పుగా అనిపించలేదు. 2002లో నల్గొండలో సుదర్శన్‌ రెడ్డి ఆమరణ దీక్షలో కూర్చున్నారు. ఏడు రోజులైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆరో తేదీన 60 మందితో ధర్నా చేస్తే పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాకు చాలా కోపం వచ్చింది. దాంతో ఏడో రోజు నేను, జగదీశ్‌ రెడ్డి, గొంగడి సునీత, శోభారాణి, కళ్లెం యాదగిరి రెడ్డి, విజయసింహా రెడ్డి వంటి నేతలం కలిసి మహిళా ధర్నాకు పిలుపునిచ్చాం. మహిళలు తక్కువ వస్తారని మహిళా పోలీసులు కేవలం ఐదుగురు మాత్రమే వచ్చారు. 3 వేల మందితో నార్కట్‌పల్లి వద్ద ధర్నాకు దిగాం. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించి సాయంత్రం మూడింటి వరకు ఉన్నాం. మీడియా పరంగా కూడా ఒక్క ఛానల్ వచ్చింది. దీంతో పోలీసులు బ్యాకప్‌ కోసం ప్రయత్నిస్తుండగా సాయంత్రం అయింది. కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ రోడ్డు మీద ఆగిపోయింది. పోలీసులు తీవ్రమైన లాఠీ ఛార్జి చేశారు. దీంతో అక్కడ కంకర కుప్పలు ఉన్నాయి. పోలీసుల లాఠీ ఛార్జి ఒకవైపు – మేము పోలీసులపై రాళ్ల దాడి చేశాం. ఆంధ్ర ప్రాంతం వాహనాలపై పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది. 75 మంది మహిళలకు గాయాలయ్యాయి. పోలీసు అధికారి సుధాకర్‌ అనే ఎస్సై. అతని తల పగిలిపోయింది. ఆయనతో పాటు మరో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఒక పెద్దావిడను తుపాకీతో పోలీసులు కొడితే ఆమె ఉదరం (రొమ్ము) పగిలిపోయింది. పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో కేసీఆర్‌, జగదీశ్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. నాకు ఫోన్‌ ఇవ్వమని... ఆయన నా చెవి దగ్గర ఫోన్‌ పెట్టారు. “ప్రభాకర్, తప్పు చేస్తున్నావు. ఉద్యమం రూపు మారుతుంది,” అని గద్దిస్తున్నారు. కానీ, నేను ఆ ఫోన్ మాట్లాడలేదు. మాట్లాడితే వెనక్కి తగ్గాల్సి ఉంటుందని అంత దూకుడుగా ఆనాడు ఉండే పరిస్థితి నాది.

ప్రశ్న: ఈ సంఘటన తర్వాత కూడా మీరు అమ్మనబోలులో తీవ్ర కార్యాచరణకు దిగినట్లు తెలిసింది. అది నిజమేనా?

కర్నె ప్రభాకర్ :అవును, పోలీసులు లాఠీ ఛార్జి తర్వాత మేం చాలా మరిగిపోయాం. ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. నేను, నాతోపాటు కుసుమ జగదీష్ (ఆయన చనిపోయారు. ఉద్యమంలో బాగా పని చేశారు.) ఇద్దరమే ప్లాన్ చేసుకుని అమ్మనబోలులో బస్సు తగులబెట్టాలనుకున్నాం. రాత్రి 9 గంటలకు వెళ్లి, నా కారు కాకుండా వేరే కారులో వెళ్లాం. బస్సు నైట్ హాల్ట్‌కు ఆగింది. నేను డ్రైవర్, కండక్టర్‌ను పట్టుకున్నాను. వారు పీపుల్స్ వార్ నక్సలైట్లు అని అనుకుంటున్నారు. మాదగ్గర అప్పటికే మూడు దళాలు ఉండేవి. దాంతో వారే అని భావించారు. డ్రైవర్ తనను ఏమీ చేయవద్దని, తన కూతురు పెళ్లని బతిమాలుతున్నాడు. ఆ సమయంలో జగదీష్ బస్సులో పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఎక్కువ పోయడం వల్ల అది బస్సులో మంటలు పేలుడుతో వ్యాపించాయి. అవి కుసుమ జగదీష్‌ కు అంటుకున్నాయి. అలా మంటలతోనే జగదీష్ కిందకు దూకాడు. ఆయన శరీరం అంతా కాలిపోయింది. కొంచెం ఆలస్యం అయితే అతను అక్కడే చనిపోయేవాడు. అయితే, తెల్లారి పేపర్లలో "పీపుల్స్ వార్ ఘాతుకం: ఆర్టీసీ బస్సును తగులబెట్టిన నక్సలైట్లు" అన్న వార్త వచ్చింది. ఇప్పటికీ అది పోలీసుల రికార్డుల్లో నక్సల్స్ చర్యగా రికార్డయింది. ఇది ఇప్పటి వరకు నా భార్యకు కూడా చెప్పలేదు.

ప్రశ్న: కొత్తకోటలో మీరు చేసిన కార్యాచరణ ఏంటి?

కర్నె ప్రభాకర్ :ఆలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రావుల రవీంధ్రనాథ్ రెడ్డి నిరహార దీక్షకు కూర్చున్నారు. అది కూడా ఏడో, ఎనిమిదో రోజు వరకు సాగింది. ఆయన దీక్ష ఏర్పాట్లు నేను, కే.ఎస్. రత్నం (మాజీ ఎమ్మెల్యే) కలిసి చకచకా తిరిగాం. నేను ఇంటికి వచ్చే వరకు కేసీఆర్‌ ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ ఎత్తగానే హరీశ్‌ రావు  చేశారు. “రావుల రవీంధ్రనాథ్ రెడ్డి భార్య పారిజాతం వచ్చారు. ఆమె ఏడుస్తున్నారు,” అని చెప్పారు. కేసీఆర్‌ చెబితే 'వద్దంటారు'. కాబట్టి సాయంత్రం ఏడున్నర న్యూస్‌లో ఓ సంచలన వార్త రావాలి. కానీ, కేసీఆర్‌కు తెలియవద్దు. ఆయన 'హింసకు వ్యతిరేకం, వద్దంటారు' అని హరీశ్‌ రావు చెప్పారు. దీంతో నేను, కుసుమ జగదీష్, మరో ఆరుగురు... మొత్తం ఎనిమిది మంది బయలుదేరాం. మధ్యాహ్నం అంతా బస్సుల్లో జనంతో తిరుగుతున్నాయి. ఇక సాయంత్రం ఆరు అయింది. చీకటి పడుతోంది. ఇక కొత్తకోట బస్టాండ్‌కు వెళ్లాలనుకున్నాం. బస్టాండ్‌లోకి పోయి బస్సులో ఉన్న ప్రజల్ని అందరినీ కిందకు దింపి డీజిల్ పోసి తగులబెట్టాం. అదే సమయంలో ఇద్దరు కానిస్టేబుల్స్ సైకిల్‌పై వచ్చారు. మేము చేసేది చూసి, 'వీళ్లంతా నక్సలైట్లు' అనుకొని సైకిల్‌ కింద పడేసి పారిపోయారు. ఇది ఆనాడు సంచలనంగా మారింది. అలా మహబూబ్‌నగర్‌కు వచ్చాం. దీంతో పోలీసులు వచ్చి రవీంద్రనాథ్‌ రెడ్డి నిరహార దీక్షను భగ్నం చేసి తీసుకెళ్లిపోయారు. దీంతో మా నాయకుడిని దీక్ష నుంచి కాపాడుకున్నాం. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రవీంధ్రనాథ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడితో పాటు 8 మంది పేర్లు పెట్టారు.

ప్రశ్న: మీ మీద కేసులు పడిన సంఘటనలు ఏమైనా లేవా?

కర్నె ప్రభాకర్ :చాలా ఉన్నాయి. మేము ఉద్యమకారుడిగా పని చేశాను, మీరు ఉద్యమ కార్యాచరణ జర్నలిస్టుగా పని చేశారు. రోజు తెలంగాణ భవన్‌లో కలుసుకునేవాళ్లం. కానీ, మీకే కాదు, నా భార్యకు కూడా చాలా విషయాలు చెప్పలేదు. ఇవి ఎక్కడ బయటకు వచ్చినా జైలుకు వెళ్లేవాళ్లం. ఇది కేసీఆర్‌ కి కూడా తెలియదు. హరీశ్‌ రావుకు చెబితేనే కొత్తకోట కార్యక్రమం చేశాం. అమ్మనబోలు నాకు, కుసుమ జగదీష్‌ కు మాత్రమే తెలుసు. 2001లో ఉద్యమ కార్యాచరణలో మొదటి సంఘటన నల్గొండ బస్టాండ్‌లో బస్సులను ధ్వంసం చేస్తే, 2007 వరకు కోర్టు చుట్టూ తిరిగాను. 2001 డిసెంబర్‌లో మరో పెద్ద సంఘటన జరిగింది. హైదరాబాద్‌ బంద్‌కు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాను. కానీ, ఇది కేసీఆర్‌కు ఇష్టం లేదు. వారి జీవితాలు పాడవుతాయని వద్దనేవారు. బంద్‌ సక్సెస్ కోసం కొందరు విద్యార్థి నేతలతో సమావేశమయ్యాం. వారితో పాటు కొందరు నాయకులు ఉన్నారు. నేను కొంత చెబితే వారు పెద్ద ఎత్తున ప్లాన్ వేశారు. రాత్రి పదిగంటలకు వెళితే, మంజీరా హాస్టల్ ముందు వారు పెట్రోల్ బాంబులు తయారు చేసి పెట్టుకున్నారు. నాకు తెలిసి నేను వారిని వారించాను. కానీ, వాళ్లు 'మా పద్ధతిలో మేం చేస్తాం,' అన్నారు. చెబితే వినని పరిస్థితి. వాళ్లు తెల్లారేసరికి రెండు విద్యాసంస్థలను పెట్రోల్ బాంబులతో కాల్చివేశారు. మూడు, నాలుగు బస్సులను తగులబెట్టారు. నాకు ఇదంతా తెలియదు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మా నేత లాడ్జిలో పడుకున్నాను. ఉదయం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. “ఎక్కడ ఉన్నావ్‌?” అన్నారు. “బంద్‌ ఏర్పాట్లు చూసుకుని వచ్చా,” అన్నాను. “చాలు నీ చక్కదనం చేసింది చాలు,” అన్నారు. “ఏం జరిగింది?” అని కేసీఆర్‌ ని అడిగాను. “పోలీసులకు అన్నీ తెలిసిపోయింది. నీ కోసం తిరుగుతున్నారు. నీవు డ్రెస్ మార్చుకుని ఇంటికి రా,” అన్నారు. ఇంటికి వెళ్లాక గద్దించి ఇంట్లోనే ఉండమన్నారు. మిగతా వారిని అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైల్లో ఉంచారు. పది రోజుల తర్వాత వచ్చేటప్పుడు చాలా పెద్ద ర్యాలీ చేయించాం. ఇది వారిలో నైతిక ధైర్యాన్ని నింపింది. నా జీపు మీద ఊరేగించి తీసుకువచ్చాను.

ప్రశ్న: 2006లో కేంద్రమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసి నిరహార దీక్ష చేసినప్పుడు జరిగిన ఘటనలకు మీకు బాధ్యత ఉందా?

కర్నె ప్రభాకర్ : అవును. ఢిల్లీలో కేసీఆర్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం ఆరోజు నరేంద్ర కేంద్రమంత్రిగా ఉండేవారు. వారు రాజీనామా చేశారు. ఆ వేదిక వెనుకకు నరేంద్ర తీసుకెళ్లారు. “ప్రభాకర్, ఏం చేస్తావో తెలియదు. ఒక నేషనల్ న్యూస్ హైదరాబాద్‌లో కావాలి,” అన్నారు. నేను, రామ్మోహన్ రాత్రంతా ఆలోచన చేసి, మాతో పాటు శ్రీనివాస్‌ రాజు అనే నేతను వెంటబెట్టుకొని ఫ్లైట్‌లో హైదరాబాద్‌ వచ్చాం. కూకట్‌పల్లిలో కార్యక్రమం చేద్దామనుకున్నాం. అయితే, కూకట్‌పల్లిలో సుదర్శన్‌ రావు అనే నేత నాకు ఫోన్‌ చేసి, “నా దగ్గర ఏం చేయవద్దు. పోలీసులు నా మీద పడతారు,” అన్నారు. అయితే, నాతో పాటు మరి కొద్ది మంది నేతలను ప్రత్యేకంగా ఎన్నుకొని మా టార్గెట్‌ను మార్చుకున్నాం. పట్టపగలు బంజారాహిల్స్ రోడ్ నెం 46 లో సినీ నటుడు శ్రీహరి ఇంటి ముందు రెండు బస్సులను అందరూ చూస్తుండగా తగులబెట్టాం. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. 24 గంటల్లో పట్టుకోవాలని ఆదేశించారు. మేం అప్పుడు మోటార్ సైకిల్ వెనుక స్టిక్కరింగ్ చేసి నంబర్లు మార్చాం. అయితే, మావాడు ఒకడు స్టిక్కరింగ్ కాకుండా, నెంబర్ ప్లేట్‌పై బురద పూశాడు. అది ఎండిపోయి ఊడిపోవడంతో సీసీ కెమెరాలో చూసి ట్రేస్ చేశారు. తప్పదని వంద మందితో పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాం. ఆ కేసులో బెయిల్ వచ్చింది. కానీ, కూకట్‌పల్లిలో మేం అనుకున్నది చేస్తే చాలా సంచలనం అయ్యేది. అక్కడ 60 ప్రైవేట్ బస్సులు నిలిపి ఉంచేవారు. సృజన మాల్ ఎదురుగా. వాటి అన్నింటిని తగులబెట్టేవాళ్లం. మేము చేసిన పని నీడకు తెలియనిచ్చేవాళ్లం కాదు. మేం చేసింది నరేంద్రకి తప్ప ఎవరికీ తెలియదు. కేసీఆర్‌కి కూడా తెలియదు.

ప్రశ్న: ల్యాంకో ఆఫీసుపై దాడి, హంపిలో షెల్టర్, మీ చేతిలో రివాల్వర్ వంటి ఘటనల గురించి చెప్తారా?

కర్నె ప్రభాకర్ :మీకు ఇది తెలుసు. 2008లో మీరు సీనియర్ జర్నలిస్టుగా ఉండేవారు అనుకుంటా. ఇది కవర్ చేసే ఉంటారు. నిజామాబాద్‌లో ప్రణబ్ ముఖర్జీ పర్యటించారు. ఆయనతోపాటు లగడపాటి రాజ్ గోపాల్ ఓ ఉద్యమకారుడి కాలు మీద నుంచి కారు పోనిచ్చారు. ఆ సమయంలో మేం తెలంగాణ భవన్‌లో ఉన్నాం. లగడపాటి దిష్టిబొమ్మ దహనం చేద్దామనుకున్నాం. అయితే, దగ్గర్లోనే లగడపాటి ఆఫీస్ ఉండేది. అక్కడికి మేం వెళ్లాం. మాతో పాటు కార్యకర్తలు వచ్చారు. ఆ ఆఫీస్‌పై రాళ్ల దాడి జరిగింది. పక్కనే ఎన్టీవీ ఆఫీస్ ఉంది. దానిపైనా దాడి జరిగింది. అద్దాలు పగిలాయి. అక్కడ కార్లు ధ్వంసం అయ్యాయి. అది లైవ్‌లో చూసి కేసీఆర్‌ తిట్టి “ఎక్కడికన్నా వెళ్లండి,” అని గద్దించారు. ఆ కేసు 2014 వరకు సాగింది. కొద్ది రోజులు నేను, బాలమల్లు, జగదీష్ రెడ్డి, మరి కొందరు నేతలు తుంగభద్ర చూద్దామని హంపి వెళ్లాం. ఓ లాడ్జ్‌లో ఉన్నాం. మా ఫోన్‌లు ట్రాక్ చేసి అక్కడికి వచ్చారు. లాడ్జి తలుపులు కొట్టారు. అప్పుడు అక్కడ మతపరమైన గొడవలు జరుగుతున్నాయి. అయితే, స్థానిక పోలీసులు చెకింగ్ చేస్తున్నారని భావించాం. ఆ సమయంలో నా దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. అయితే, అది రాష్ట్రం దాటి తీసుకెళ్లకూడదు. అది ఎలా దాచాలన్న టెన్షన్‌లో ఉన్నాం. వారు తలుపు కొట్టి, “ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగితే “హైదరాబాద్,” అన్నాం. తెలంగాణ పోలీసులు అని తెలిసింది. అక్కడ మమ్ముల్ని అరెస్ట్ చేసి 22 రోజులు జైలుకు పంపారు. ఇది మొదటిసారి జైలుకు వెళ్లడం. జైల్లో పుస్తకాలు చదవడం రామ్మోహన్, జగదీష్ రెడ్డి చేస్తే, నేను ఖైదీలను కలిసి వారి గురించి తెలుసుకునేవాడిని. జైల్లో ఆంధ్ర ప్రాంత అధికారులు చిన్న చూపు చూస్తే, తెలంగాణ పోలీసులు హీరోలుగా చూసేవారు. జైల్లో బట్టలు తీసి మొలతాడు కట్ చేస్తుంటే, జగదీష్ రెడ్డికి, ఆంధ్ర జైలు అధికారికి మధ్య ఘర్షణ జరిగింది.

ప్రశ్న: కేసీఆర్‌ సొంత నిర్ణయాలు తీసుకునే వారా? పార్టీలో చర్చ జరిగి తీసుకునేవారా? ముఖ్యంగా కేంద్రమంత్రిగా రాజీనామా, రాష్ట్రంలో ఆరుగురు మంత్రుల రాజీనామా, ఎమ్మెల్యేల రాజీనామా వంటివి?

కర్నె ప్రభాకర్ :చాలా సందర్భాల్లో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు 'ఇది సరి కాదని' నాయకత్వం అనుకునేవారు. కానీ, 99 శాతం కేసీఆర్‌ నిర్ణయాలే సరైనవని తేలాయి. కొన్ని సందర్భాల్లో తప్పిదమైనా ఉద్యమానికి ఉపయోగపడ్డాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలు అందులో ఒకటి. మా స్థానాలు కోల్పోయాం. అయితే, ఉద్యమానికి ఉపయోగపడ్డాయి.

ప్రశ్న: కరీంనగర్ ఎంపీ పదవికి సవాల్ చేసి కేసీఆర్‌ రాజీనామా చేశారు. దీనిపై అసలు ఆనాడు పార్టీలో చర్చ జరిగిందా? ఆయన సొంత నిర్ణయమా?

కర్నె ప్రభాకర్ :కరీంనగర్ ఎంపీ పదవి రాజీనామా ఎం.ఎస్. సత్యనారాయణ గారు ఛాలెంజ్ చేశారు. అది సభలో అప్పటికప్పుడు కేసీఆర్‌ సవాల్ స్వీకరించి రాజీనామా ప్రకటించారు. ఇది ఆయన సొంత నిర్ణయం. కానీ, ఇది పార్టీకి చేసిన మేలు అంతా ఇంతా కాదు.

ప్రశ్న: 2009 ఎన్నికలు ఆనాడు చాలా కీలకమైనవి. మహా కూటమిలో చేరిక ఎవరి నిర్ణయం? టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ అంతా అంటే, పీఆర్‌పీతో వెళ్లాలన్నది కేసీఆర్‌ ఆలోచన. పార్టీ ఆలోచనకు కేసీఆర్‌ ఎలా అంగీకరించారు?

కర్నె ప్రభాకర్ : కేసీఆర్‌ ని ఎవరూ ప్రభావితం చేయరు. నిజానికి ఈ ప్రశ్న వేరే వారు అడిగే అవకాశం లేదు. మీరు చాలా దగ్గరగా పార్టీ బీట్ చూశారు కాబట్టి అడగ‌్గలుగుతున్నారు. కేసీఆర్‌ ఆలోచనకు విజయరామారావు, భూం రావు ఇద్దరే మద్దతు పలికారు. మిగతా పార్టీ అంతా నాతో సహా టీడీపీతో వెళ్లాలనుకున్నాం. "టీడీపీ సమైక్యవాద పార్టీ కదా, పీఆర్‌పీతో పోతే మంచిది. అందులో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. సినిమా యాక్టర్. తెలంగాణ ఉద్యమం తెలంగాణలో ఉంది. చిరంజీవికి యూత్‌ సపోర్ట్ ఉంది. రెండు కలిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నది" ఆయన ఆలోచన. పీఆర్‌పీతో చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్‌ కి ముహూర్తాల మీద కొంచెం నమ్మకం. మధ్యాహ్నం 2:45 కన్నా ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెప్పారు. మేం టీడీపీకి వెళ్లాలని కేసీఆర్‌ కి తెలిసిన నేతలందరితోనూ చెప్పిస్తున్నాం. సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ వస్తే, ఆయనతో కూడా చెప్పించాం. అదే సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు పీఆర్‌పీ నుంచి కన్నబాబు ఫోన్‌ చేశారు. హరీశ్‌ రావు ఫోన్‌ ఎత్తారు. అయితే, సీట్లు తేలడం లేదు. వారు అనుకున్న సంఖ్య మాత్రమే చెబుతున్నారు. ఈ విషయం విన్న కేసీఆర్‌ “ఫోన్ పెట్టేయ్, పీఆర్‌పీ వాళ్లకు అర్థం కావడం లేదని,” చికాకు పడ్డారు. ఇంతలో ఫోన్‌ పెట్టగానే, కేసీఆర్‌ కి సన్నిహితుడైన ఓ డాక్టర్‌ మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్‌ ఇంటికి వచ్చారు. కేసీఆర్‌ ఇంట్లో పైన ఉన్నారు. కింద ఆ డాక్టర్‌ ఉన్నారు. అయితే, ఆ డాక్టర్‌ వాష్‌రూంలోకి వెళ్లగానే, ఆయన బయటకు రాకుండా గొళ్లెం పెట్టాం. దాంతో డాక్టర్‌ కేసీఆర్‌ ని కలవలేకపోయారు. వెంటనే కేసీఆర్‌ని తీసుకొని, ఆయనకు ఇష్టం లేకపోయినా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. ఒకవేళ ఆ డాక్టర్‌ను బాత్‌రూంలో లాక్ చేయకపోతే, కేసీఆర్‌ను కలిసేవారు. ఆయన మనసు మార్చుకునేవారేమో.

ప్రశ్న: 2009 నవంబర్‌లో కేసీఆర్‌ ఆమరణ నిరహార దీక్ష కేసీఆర్‌ నిర్ణయమా, పార్టీ నిర్ణయమా?

కర్నె ప్రభాకర్ : 14ఎఫ్ అనేది ఆనాడు పోలీసుల ఉద్యోగాల్లో తెలంగాణకు నష్టం జరిగే అంశం. దీన్ని ఆయన వ్యతిరేకిస్తూ సిద్దిపేటలో ఉద్యోగుల సభ పెడితే, అందులో ఆయన ఒకేసారి తాను ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఇది ఆయన సొంత నిర్ణయం. ఇది ప్రకటించాక ఐదారు రోజులు వద్దని వారించే ప్రయత్నం చేశాం. కానీ, కేసీఆర్‌ కోపం తెచ్చుకొని “నేను ప్రకటించాను. దీక్ష ఆగదు. దీక్ష సందర్భంగా ఏం కార్యక్రమాలు చేయాలో,” అని సూచించారు. మేం 20 రోజుల పాటు పార్టీ నేతలు చర్చించాం. ఉద్యోగ సంఘ నేతలను కొన్నిసార్లు ఆహ్వానించాం. మేము నవంబర్ 29న కేసీఆర్‌ను దీక్షకు కూర్చోనిస్తారని ప్రిపేర్ అయ్యాం. నవంబర్ 27 సాయంత్రం కరీంనగర్ బయలుదేరే సమయంలో ఆయన నన్ను, జగదీష్ రెడ్డిని పిలిచి “మీకు అప్పగించిన పనులు పర్‌ఫెక్ట్‌గా చేయండి. మళ్లీ కలుస్తామో లేదో,” అన్నారు. అది మర్చిపోలేని మాట. అది అని కారెక్కి వెళ్లిపోయారు. అప్పటి నుంచి మేం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాం. మా ఫోన్‌లు తెలంగాణ భవన్‌లో పెట్టేసి, ఎనిమిది చిన్న ఫోన్‌లు కొనుక్కున్నాం. మా ఫోన్‌లు పోలీసులు ట్రాక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. దీక్ష రోజు కేసీఆర్‌ను అరెస్ట్‌ చేశారు. దీక్ష కూర్చున్నప్పుడు జిల్లాల వారీగా అలర్ట్ చేయాలి, ట్రైన్‌లు, బస్సులు ఎలా ఆపాలి, ధర్నాలు ఎలా చేయాలన్నది మా అసలు ప్లానింగ్. నవంబర్ 29న ఉదయం కేసీఆర్‌ను అరెస్ట్ చేసినట్లు, టీవీలో శ్రీకాంతాచారి తగలబెట్టుకున్నట్లు సమాచారం వచ్చింది. ఆ రోజు రాత్రి ఐదారు ఆంధ్రా బస్సులు తగులబడ్డాయి. కూకట్‌పల్లిలో ఐదారు బస్సులు తగులబడ్డాయి. దీంతో ప్రజల అటెన్షన్ ఉంటుందని చేశాం. దీక్షకు ముందే జిల్లాలన్నీ తిరిగి వచ్చాం. ఫోన్‌లో ఏ కార్యాచరణ చెప్పేవాళ్లం కాదు. పోలీసులకు తెలియకూడదని వన్ టు వన్ కలిసి రహస్యంగా కార్యాచరణ చెప్పేవాళ్లం. ఆర్మూర్‌లో జీవన్‌ రెడ్డికి చాలా పెద్ద టాస్క్ చెప్పాం. చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేయాలని చెప్పాం. ఇలా ప్రతీ ఒక్కరికీ కార్యక్రమాలు ఇచ్చాం. ట్రైన్‌లు ఫేక్ కాల్స్‌తో ఆనాడు ఆగిపోయిన ఘటనలు జరిగాయి. అది తప్పే అయినా, తెలంగాణ లక్ష్యంతో ఇవన్నీ చేశాం. మా నేతను కాపాడుకోవడం, తెలంగాణ సమాజం లేచి కూర్చోవాలన్నది ఆనాటి ప్లాన్. శ్రీకాంతాచారి మరణంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. పార్టీగా రెండు మూడు రోజులు మేం ఉద్యమిస్తే, ఆ తర్వాత అది ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయింది. 2009 డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో మాత్రం ప్యూర్లీ తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్‌ఎస్‌సే నడిపింది.

ప్రశ్న: అరెస్ట్‌ చేసి ఖమ్మం ఆసుపత్రిలో కేసీఆర్‌ నిరహార దీక్ష విరమించారన్న వార్త వచ్చింది. శవయాత్రలు జరిగాయి. అప్పటి పరిస్థితి ఏంటి?

కర్నె ప్రభాకర్ : ఒక గంట సేపు గందరగోళం జరిగింది. మేము ఆ సమయంలో తెలంగాణ భవన్‌లో ఉన్నాం. కళ్లెం యాదగిరి రెడ్డి, జగదీష్ రెడ్డి, నేను తెలంగాణ భవన్‌లో ఉన్నాం. ఈ వార్త విని ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. మాకు ఏం అర్థం కాలేదు. కేటీఆర్‌కి ఫోన్‌ చేస్తే “నన్ను అరెస్ట్‌ చేశారు, నేను అక్కడ లేను,” అన్నారు. హరీశ్‌ రావుకి చేస్తే “కొంచెం ఇబ్బంది ఉంది. మళ్లీ చేస్తాను,” అన్నారు. తర్వాత మళ్లీ కొద్ది సేపటికి హరీశ్‌ రావు ఫోన్‌ చేసి “విద్యార్థులు చనిపోతున్నారన్న వార్తలతో కేసీఆర్‌ ఎమోషనల్ అయ్యారు. ఆయన దీక్ష కొనసాగిస్తున్నారని,” చెప్పారు. ఆ లోగా కొద్ది మంది విద్యార్థులు ఎమోషనల్ అయి కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారు. ఇది తప్పని చెప్పను. దాన్ని సమర్థించను.

ప్రశ్న: కేసీఆర్‌ను నిమ్స్‌కు తరలించినప్పుడు, నిమ్స్ వద్ద అల్లర్లు మీరు చేయించారా?

కర్నె ప్రభాకర్ : లేదు. ఇందులో మా ప్రమేయం లేదు. విద్యార్థులే కొందరు రగిలిపోయి రెండు డీసీఎంలలో వచ్చారు. వారు డీసీఎంలో టార్పాలిన్ కింద కంకర రాళ్లు పెట్టుకుని వచ్చారు. వారు నిమ్స్ నుంచి అమీర్‌పేట వరకు షాపులపై రాళ్ల దాడి చేశారు. చాలా ప్లాన్డ్‌గా విద్యార్థులే స్వయంగా వచ్చారు. దీని వెనుక మా ప్రమేయం కానీ, ఇతరుల ప్రమేయం కానీ లేదు. పిల్లల ఆత్మహత్యలు, ఈ విధ్వంసం అంతా రావడంతో ఢిల్లీలో కదలిక వచ్చింది. డిసెంబర్ 7వ తేదీ రోశయ్య అఖిల పక్షం నిర్వహించారు. చాలా మంది బయటవాళ్లు వచ్చి కేసీఆర్‌ కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తున్నారు. కానీ, మేం రోజుకో ఇంట్లో ఉండే పరిస్థితి. తెలంగాణ ప్రకటన వచ్చిన విషయం ఎవరో చెబితే తెలిసింది.

ప్రశ్న: సమకాలీన రాజకీయాలకు వద్దాం. అధికారం ఇచ్చినప్పుడు కేసీఆర్‌ సీఎం స్థానంలో మాత్రం కూర్చున్నారు. కానీ, అదే ప్రజలు పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మాత్రం బయటకు రావడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్? ప్రజాభిప్రాయాన్ని గౌరవించరా? ఆయన ప్రజలపై అలిగారా?

కర్నె ప్రభాకర్ : ఆ విమర్శలకు అర్థం లేదు. ఎందుకంటే ఆయన విజనరీ, విజ్ఞత కలిగిన నేత. పదేళ్లు అధికారంలో ఉన్నాం. చేయాల్సింది చేశాం. ప్రజలకు అందాల్సినవి అందాయి. మమ్ముల్ని కాదని వేరే పార్టీని గెలిపించారు. ఆ పార్టీ కూడా పని చేయాలి కదా. విజ్ఞత కలిగిన నాయకుడిగా రోజు ఆయన ప్రభుత్వాన్ని వెనక్కి లాగలేరు కదా. మేము పార్టీగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం.

ప్రశ్న: ప్రజల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ హామీల విషయంలో శాసన సభలో కేసీఆర్‌ గళం విప్పాలని ప్రజలు కోరుకోరా? ఆయన ప్రజల కోసం బయటకు రారా?

కర్నె ప్రభాకర్ : మేము గళం విప్పాలన్న కోరిక ఎలా ఉందో, ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆటంకం కాకూడదని అనుకుంటున్నారు. ఆయన పరిపక్వత కలిగిన నేత. తప్పనిసరిగా ప్రజల కోసం పని చేస్తారు. ఆయన శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరనప్పుడు చాలా రెబల్‌గా ఆయన ప్రజల్లోకి వస్తారు.

ప్రశ్న: కవిత విషయంలో తండ్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు వారించలేదు? సస్పెండ్‌ చేసే వరకు ఎందుకు రానిచ్చారు? కవిత బయట రావడానికి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణల్లో నిజం ఉందా?

కర్నె ప్రభాకర్ : కేసీఆర్‌కి, ప్రజలు, పార్టీ, కుటుంబం ఒక్కటే. పార్టీకి నష్టం చేస్తే ఎవరిపైన అయినా ఇలాగే వ్యవహరిస్తారు. పార్టీలోకి కుటుంబ సభ్యులు వస్తున్నప్పుడు కూడా ఆయన ఇదే చెప్పారు. అందుకే పార్టీకి నష్టం చేస్తున్నందున, కన్న కూతురు అయినా చర్యలు తీసుకున్నారు. తండ్రి 70 ఏళ్ల పైబడి ఉన్నారు. ఉద్యమ నాయకుడు ఈ వయసులో ఇంత ఇబ్బంది పెట్టడం సరికాదు. కేసీఆర్‌తోపాటు వారి శ్రీమతి ఎంత బాధపడుతుంది. జైల్లో ఉన్నప్పుడు ఎంత క్షోభ అనుభవించి ఉండాలి. అలాంటి బాధను అనుభవించాక, జైల్లో నుంచి బయటకు రాగానే ఇబ్బంది పెట్టడం సరికాదు. కేసీఆర్‌ చాలా పెద్ద నేత అయినా తండ్రే కదా. ఎంత బాధతో సస్పెండ్‌ చేయాల్సి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణలు నాకు తెలియదు. వాస్తవాలు ఉంటే అవి బయటపడక తప్పదు.

ప్రశ్న: 2014లో ఫోన్ ఎత్తకపోవడం వల్ల టికెట్ కోల్పోయారన్న వార్తలు నిజమేనా?

కర్నె ప్రభాకర్ : 2014 లో అన్ని సర్వేల్లో నా పేరు ముందంజలో ఉంది. హరీశ్‌ రావు, కేటీఆర్‌, ఈటల రాజేందర్ వంటి నేతలు నా టికెట్ కన్ఫర్మ్ అని చెప్పారు. నేను నామినేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. టికెట్ ఫైనల్ అయిందన్నారు. డబ్బులు రెడీ చేసుకున్నాను. ఎమ్మెల్సీ ఇప్పుడు శంభీపూర్ రాజు నుంచి రథాలు తయారు చేసుకున్నాను. తెల్లవారితే బాలమల్లు అనే నేత – ఆయన కూడా బీ-ఫాం సర్‌ ఇవ్వమన్నారు. కేసీఆర్‌ ఇంటికి రమ్మన్నారు. బయలుదేరాక బాలమల్లు మళ్లీ ఫోన్‌ చేసి “తేడా కనిపిస్తుంది. కేటీఆర్‌తో సార్ డిస్కషన్ పెట్టారు. సర్వేల్లో తేడాలున్నాయని కేటీఆర్‌తో చర్చ చేస్తున్నారు. సార్ అర్జెంట్‌గా రమ్మన్నారు,” అన్నాడు. ఈ లోపు నా టికెట్ కోరుకున్న ప్రత్యర్థి నేత ఉన్నారు. నామినేషన్ వేసే ముందు రోజు రాత్రి నేను, డాక్టర్ శ్రవణ్, కన్నెబోయిన రాజయ్య యాదవ్, బొంతు రామ్మోహన్ ఒకే దగ్గర ఉన్నాం. రాత్రి రాజయ్య యాదవ్ చాలా సేపు నా కోసం ఏడ్చాడు. “మీకు టికెట్ రావాలి. న్యాయం జరగాలని,” చాలా సేపు బాధపడ్డాడు. నాకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు ఫోన్ రాలేదు. కేటీఆర్‌, హరీశ్‌ రావు, సంతోష్ ఎవరూ నా ఫోన్ ఎత్తడం లేదు. “నేను ఇంటికి వెళ్తాను,” అని చెప్పి ఫోన్ సైలెంట్‌లో పెట్టి కారులో బయలుదేరాను. అంతకు ముందు రాత్రి నిద్రలేకపోవడం వల్ల నిద్ర పట్టింది. సంతోష్ 7 సార్లు కాల్ చేశారు. ఫోన్ సైలెంట్‌లో ఉండటం, నేను నిద్రపోవడం వల్ల ఫోన్ ఎత్తలేదు. చివరకు “పెదనాన్న (కేసీఆర్‌) ఫోన్ మాట్లాడతామన్నారు. కాల్ చేయండి,” అని సంతోష్ మెసేజ్ పెట్టారు. రాత్రి 12 గంటలకు నేను ఫోన్ చూసుకొని సంతోష్‌కు కాల్ చేశాను. ఫోన్ ఎత్తలేదు. చాలా సార్లు ట్రై చేశాను. అయితే తర్వాత సంతోష్ ఫోన్ చేసి “నీవు దరిద్రుడవు. ఫోన్ ఎత్తక టికెట్ పోగొట్టుకున్నావు నీవు,” అని అన్నాడు. అయితే 7 సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి కేసీఆర్‌  “ఇప్పుడే ఫోన్ ఎత్తకపోతే ప్రభాకర్ ఎమ్మెల్యే అయ్యాక ఫోన్ ఎత్తుతాడా?” అని నాకు టికెట్ ఇవ్వకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. టికెట్ రాకపోయినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం చాలా సంతోషించే విషయం. ఇది నా అదృష్టం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
అమరావతి రైతులు ముందుకొచ్చి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
Advertisement

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
అమరావతి రైతులు ముందుకొచ్చి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
ఫోర్త్ సిటీ కాదు..ఫ్యూచర్ సిటీ! 4 అంటే మరణం, అపశకునమా? రేవంత్ రెడ్డి అందుకే ఈ పేరు ఖరారు చేశారా?
ఫోర్త్ సిటీ కాదు..ఫ్యూచర్ సిటీ! 4 అంటే మరణం, అపశకునమా? రేవంత్ రెడ్డి అందుకే ఈ పేరు ఖరారు చేశారా?
Telangana Global Rising Summit: గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడుల వెల్లువ - మధ్యాహ్నానికే లక్ష కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు!
గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడుల వెల్లువ - మధ్యాహ్నానికే లక్ష కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు!
New Tata Sierra SUV - కొనడానికి 3 కారణాలు, దూరంగా ఉండడానికి 2 కారణాలు
2025 Tata Sierra కొనాలా? కొనకూడదా? - బలాలు, బలహీనతల పూర్తి వివరాలు
Tea Biscuits Side Effects : టీతో పాటు బిస్కెట్లు తింటున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదకరమో తెలుసా?
టీతో పాటు బిస్కెట్లు తింటున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదకరమో తెలుసా?
Embed widget