Shakeel News: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్! హిట్ అండ్ రన్ కేసు మళ్లీ తెరపైకి
Hyderabad News: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో షకీల్ కుమారుడు రహీల్ నడుపుతున్న వాహనం ఢీకొనడంతో ఓ చిన్నారి మరణించడంతో పాటు నలుగురికి గాయాలు అయ్యాయి.
BRS Ex MLA Shakeel News: బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహ్మద్ షకీల్ తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కారణంగా సమస్యల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 2022లో షకీల్ కుమారుడి హిట్ అండ్ రన్ కేసును తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు మళ్లీ విచారణ చేయడం మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో షకీల్ కుమారుడు రహీల్ నడుపుతున్న వాహనం ఢీకొనడంతో ఓ చిన్నారి మరణించడంతో పాటు నలుగురికి గాయాలు అయ్యాయి. 2022లో మార్చి 17న జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో ఆ ప్రమాదం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి పై నుంచి ఓ కారు దూసుకెళ్లడంతో అప్పట్లో ఈ వ్యవహారం బాగా చర్చనీయాంశం అయింది. షకీల్ కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే బాలుడు చనిపోయినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్ ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు అప్పట్లో గుర్తించారు.
అయితే, అప్పట్లో జూబ్లీహిల్స్ పోలీసులు షకీల్ కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడమే కాకుండా.. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహీంద్రా థార్ కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అది తన కారు కాదని.. తన ఎమ్మెల్యే స్టిక్కర్ ను తన స్నేహితుడికి ఇచ్చినట్లు అప్పట్లో షకీల్ వాదించారు. ఆ కారు ప్రమాదంలో డ్రైవ్ చేసిన వ్యక్తిని కాకుండా మరొకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. దీంతో ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది.
ప్రజాభవన్ కేసు కూడా
అంతేకాక, గత డిసెంబరులో షకీల్ కుమారుడు ప్రజా భవన్ వద్ద కారుతో భీభత్సం రేపాడు. డిసెంబర్ 24న అర్థరాత్రి కారుతో బారీకేడ్లను ఢీకొన్నాడు. దీంతో పంజాగుట్ట పోలీసులు మాజీ ఎమ్మెల్యే కుమారుణ్ని తప్పించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఫలితంగా ఇద్దరు పోలీసులపై వేటు కూడా పడింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సోహైల్ కు బదులు షకీల్ ఇంట్లోని పని మనిషిని పోలీసులు ఈ కేసులో ఇరికించడం వివాదాస్పదం అయింది.
ఆ తర్వాత ఎమ్మెల్యే కొడుకు దుబాయ్ కు పారిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. కుమారుడితో పాటుగా షకీల్ కూడా దుబాయ్ వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. బోధన్ లోని మాజీ ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయం ఎల్లప్పుడూ జనాలతో కళకళలాడుతూ ఉండగా.. కొద్ది నెలలుగా బోసిపోయింది.