Telangana BJP: దిల్లీకి చేరిన బీజేపీ, టీఆర్‌ఎస్ పంచాయితీ, కేంద్రమంత్రికి బండి సంజయ్ బృందం ఫిర్యాదు
బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య వార్ దిల్లీకి చేరింది. ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేస్తోందని ఓ మీడియాపై ఫిర్యాదు చేశారు బండి సంజయ్ బృందం.
బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, మరికొందరు బీజేపీ నేతలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. తెలంగాణలోని ఓ ఛానల్, పేపర్ ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేస్తున్నాయని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమకారులతోపాటు గిట్టని పార్టీలు, పత్రికలు, టీవీలపై ఆ మీడియా విషం చిమ్ముతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్ట సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలనే వక్రీకరిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని తెలియజేశారు. యాడ్స్ పేరుతో రూ.వందల కోట్లు ఆ పత్రిక, ఛానల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి సర్కారు గండి కొడుతుందని ఆరోపించారు.
భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో ఆ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరిందీ బృందం. ముఖ్యమంత్రి కేసీఆర్ ను, టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న తెలంగాణ ఉద్యమకారులపైనా, రాజకీయ పార్టీలపైనా అదే పనిగా దుష్ప్రచారం చేయడమే పనిగా ఆ మీడియా పెట్టుకుందన్నారు.
తెలంగాణ సెంటిమెంట్ పేరుతో రెచ్చగొడుతూ భౌతిక దాడులకు పురిగొల్పేలా పచ్చి అబద్దాలతో కథనాలు రాస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆ పత్రిక, ఛానల్ వక్రీకరించిందన్నారు. ప్రధానమంత్రి గౌరవానికి, పార్లమెంట్ పవిత్రకు భంగం కలిగించేలా వ్యవహరించాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పాటుపడుతుంటే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అభ్యంతరం వ్యక్తం చేశారు సంజయ్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొనసాగిస్తున్న దోపిడీకి, అవినీతికి రక్షణ కవచంగా నిలిచిన పత్రిక, ఛానల్ కు కేసీఆర్ ప్రభుత్వం భారీగా దోచి పెడుతుందని ఆరోపించారు. గత ఏడేళ్లలో అడ్వయిర్జైజ్ మెంట్ల పేరుతో వందల కోట్లు కేటాయించిందన్నారు. ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ప్రభుత్వ ఖజనాకు గండి కొడుతున్నారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే ఆ పత్రిక, ఛానల్ నడుస్తోందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే టీవీ ఛానల్ పని చేస్తోందని గుర్తు చేశారు బండి.భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో ఆ పత్రిక, ఛానల్ చేస్తున్న దుష్ప్రచారంపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.