Etala Rajendra On TRS: సికింద్రాబాద్ ఘటన టీఆర్‌ఎస్ కుట్రే- మాజీ మంత్రి ఈటల సంచలన కామెంట్స్
సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌లో కుట్రకు టీఆర్‌ఎస్ తెరలేపిందని ఆరోపించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన టీఆర్ఎస్ కుట్రని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమని... యువకుడు చనిపోతే ఆడెడ్‌బాడీతో కూడా రాజకీయం చేశారని విమర్శించారు. ఎంతో మంది నిరుద్యోగ బిడ్డలు చనిపోతుంటే ఏనాడూ పట్టించుకోని కేసీఆర్... ఇతర్రాష్ట్రాల్లోని వారికి మాత్రం డబ్బులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు రాక తెలంగాణలో చాలా మంది యువకులు చనిపోయారని.... ఆయా కుటుంబాలను ఆదుకోని కేసీఆర్ పంజాబ్‌లో ఎవరో చనిపోతే వెళ్ళి డబ్బులు ఇచ్చారని వారికి వీళ్లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలపడం ఒక చరిత్ర అని అభివర్ణించారు ఈటల. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి రాష్ట్రపతిగా ఒక దళిత బిడ్డని చేశారని.... ఇప్పుడు గిరిజన బిడ్డ ద్రౌపదికి ఆ అవకాశం ఇచ్చారన్నారు. అణగారిన వర్గాలకు దక్కిన గుర్తింపు, గౌరవం ఇది భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ వస్తే దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని అన్న సిఎం కెసిఆర్, రాష్ట్రంలో 17% మంది దళితులు ఉంటే ఒకే ఒక్కరికి దళిత మంత్రి పదవి మాత్రమే ఇచ్చి సరిపెట్టారన్నారు. వారి కళ్ళల్లో మట్టి కొట్టారని విమర్శించారు. అదే మోదీ కేంద్రంలో 77 మంది మంత్రులు ఉంటే అందులో 22 మంది బిసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ట్రైబల్స్, 5 మంది మైనారిటీలు ఉన్నారని గుర్తు చేశారు. 50శాతం కంటే ఎక్కువ పదవులు ఈ వర్గాలకే ఇచ్చారనీ పేర్కొన్నారు. దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగునింపేందుకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు ఈటల. దేశ వ్యాప్తంగా 740 ట్రైబల్ జాతులకు భాష ఉన్నా లిపి లేదని.. ఆ జాతులు అంతరించి పోకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
షుగర్ ఫ్యాక్టరీని తెలంగాణ రాగానే తెరుస్తాం అని మాట ఇచ్చి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. ఇదేంటని అడిగిన రైతులను అరెస్ట్ చేయించిన కెసిఆర్ ను ప్రజలు అంత తేలికగా మర్చిపోరన్నారు, దీనికి తప్పకుండా సమాధానం చెప్తారని తెలిపారు. బాసర విద్యార్ధులు ఆందోళన చేస్తే వారిని సంఘ విద్రోహ శక్తులుగా చూపించే ప్రయత్నం చేసి వారి ఉద్యమాన్ని అణగదొక్కుతున్నారన్నారు.
ప్రజల సమస్యలు గాలికి వదిలి నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తూ ఫామ్ హౌస్‌లో సేదతీరుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు ఈటల. కెసిఆర్‌కి హుజూరాబాద్ ప్రజలు ఎలా చెంప చెల్లుమనిపించారో అలానే చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన విజయం సాధించేది బిజేపి మాత్రమే అన్నారు ఈటల రాజేందర్.