Vijayashanti About KCR: కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నంలో కేసీఆర్ బిజీగా ఉన్నారు: విజయశాంతి
BJP Leader Vijayashanti: కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజీగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాకపోయి ఉంటే బాగుండేదని సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.
BJP Leader Vijayashanti: మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గుతున్నాయని సంకేతాలు వస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజీగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాకపోయి ఉంటే బాగుండేదని సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నెగ్గిన నేతలను తమలో విలీనం చేసుకునే దిశగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను హటావో బీజేపీ కీ లావో అనే నినాదానికి విజయశాంతి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అంతా దొంగలేనని.. మా పార్టీ నుంచి ఎవరైనా వెళ్లినా వాళ్లు కేసీఆర్ తొత్తులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇందులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్ లో ఇంటింటికి బీజేపీ భరోసా యాత్ర కార్యక్రమానికి విజయశాంతి ముఖ్యఅతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ హయాంలో డెవలప్ మెంట్ జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో సైతం ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించిందని, ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని.. అందుకు బీజేపీ పాలనే కారణం అన్నారు. అన్ని పార్టీల పాలనను ప్రజలు చూశారు. ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇస్తారని ఆకాంక్షించారు. వేరే నేతలతో తాను సైతం బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నానని పిచ్చి వార్తలు రాస్తున్నారని కొన్ని మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రగడ్డ నుంచి వచ్చి ఎవరో ఏదో చెబితో అది నిజమనుకుని ప్రచారం చేయడం తప్పు అన్నారు. నిజం తెలిస్తే వార్త రాయాలని, అసత్య కథనాలు ప్రచారం చేయవద్దని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని జాకీ పెట్టి లేపుతున్నారు సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన పార్టీ సీట్లు తగ్గుతాయని, కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ బీఆర్ఎస్ కు సీట్లు తగ్గినా, కాంగ్రెస్ కు సీట్లు వచ్చేలా చేసి ఆ తరువాత ఆ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్యాకేజ్ పార్టీ అని, 2018లో అసెంబ్లీ ఎన్నికలల్లో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా అమ్ముకుందో ప్రజలు చూశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేతల్ని గెలిపిస్తే వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో కలిసి పదవులు తీసుకుంటారని విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారంటూ మండిపడ్డారు.
ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఇంటింటికీ వెళ్లి.. 9 ఏళ్ల మోదీ పాలనతో దేశానికి కలిగిన ప్రయోజనాలను వివరిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలకు పథకాలు, ప్రయోజనాలు ద్వారా చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని, సీఎం కేసీఆర్ కు రాష్ట్రం వచ్చిన తొమ్మిదేళ్లకు అమరవీరులు గుర్తుకొచ్చారని సెటైర్లు వేశారు.