Telangana Beer Sales: ఎర్రటి ఎండల్లో చల్లటి బీరు, తెగ తాగేస్తున్న మందుబాబులు
Telangana Beer Sales: తెలంగాణలో బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఎండలు తీవ్రం కావడంతో మందుబాబులు చల్లటి బీర్లను తెగ తాగేస్తున్నారు.
Telangana Beer Sales: మొన్నటి వరకు వానలు.. ఇది వేసవి కాలమా లేక వర్షాకాలమా అనిపించేలా.. రోజూ వానలు కురిశాయి. కానీ గత రెండు వారాల నుంచి ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి. విపరీతమైన ఉష్ణోగ్రతలకు జనం బెంబేలెత్తిపోయినా.. రాష్ట్ర ఖజానాకు మాత్రం కాసులు కురిపించాయి. ఎర్రటి ఎండలకు చల్లటి బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోతల నుండి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు లీటర్లకు లీటర్లు బీర్లు తాగేస్తున్నారు. మే నెల ప్రారంభం నుండి ఎండలు పెరగ్గా.. అదే స్థాయిలో బీర్ల అమ్మకాలు పెరిగినట్లు రాష్ట్ర అబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మే నెలలో గత 20 రోజుల్లో రూ. 1,739.29 కోట్ల విలువైన.. 3.56 కోట్ల లీటర్ల బీర్లు.. 1.37 కోట్ల లీటర్ల లిక్కర్ అమ్ముడుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. లిక్కర్ అమ్మకాలతో పోలిస్తే బీర్ల అమ్మకాలు రెట్టింపుకు మించి ఉన్నాయి.
బయటకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక చల్లచల్లని బీర్లు
లీటర్లకు లీటర్ల బీర్లను మంచి నీళ్లలా తాగేస్తున్నారు మందుబాబులు. గత నెలలో రూ. 2,683.65 కోట్ల విలువైన.. 2.23 కోట్ల లీటర్ల లిక్కర్ అమ్మకాలు జరగ్గా.. 3.99 కోట్ల లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే రోజుకు 7.43 లక్షల లీటర్ల లిక్కర్.. 13.29 లక్షల లీటర్ల బీర్లు తాగేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాల్లో 42 డిగ్రీల నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వడగాల్పులు, తీవ్ర ఉక్కపోతతో బయటకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక జనం ఆగమవుతున్నారు.
అటు బీర్లు, ఇటు లిక్కర్ తెగ తాగేస్తున్నారు
మే నెల ప్రారంభం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత ఎక్కువైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మందు అమ్మకాలు అలాగే పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 20 వ తేదీ వరకు రూ. 1,732.29 కోట్ల విలువైన.. 3.56 కోట్ల లీటర్ల బీర్లు.. 1.37 కోట్ల లీటర్ల లిక్కర్ అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే రోజుకు 17.79 లక్షల లీటర్ల బీర్లు.. 6.84 లక్షల లీటర్ల లిక్కర్ ను మందుబాబులు తాగేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో అత్యధిక అమ్మకాలు
ఏప్రిల్ నెలలో ఎక్కువగా వర్షాలు పడ్డాయి. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. అందుకే ఆ నెలలో లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా.. బీర్ల అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. మే నెల ప్రారంభం నుండి ఎండలు మండిపోతుండటంతో బీర్ల అమ్మకాలు పెరిగి లిక్కర్ అమ్మకాలు తగ్గాయి. ఉమ్మడి జిల్లాల వారీగా మే నెలలో జరిగిన మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి ప్లేసులో నిలిచింది. రూ.404 కోట్ల విలువైన.. 78.13 లక్షల లీటర్ల బీర్లు.. 31.73 లక్షల లీటర్ల లిక్కర్ అమ్ముడుపోయాయి. నల్గొండ జిల్లాలో రూ.186.49 కోట్ల విలువైన.. 40.26 లక్షల లీటర్ల బీర్లు, 14.58 లక్షల లీటర్ల లిక్కర్ విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. వరంగల్ మూడో స్థానంలో, హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచినట్లు గణాంకాలు చెబుతున్నాయి.