Bandla Ganesh : అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?
Bandla Ganesh Reaction : మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ధరకే తన ఆస్తిని బ్యాంక్ అధికారులు విక్రయించారని ఆరోపించారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు.

Bandla Ganesh Reaction Over His Assets Issue : ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ ఆస్తుల వేలానికి సంబంధించి... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఆమోదిస్తూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. బ్యాంక్ సర్ఫేసి చట్టం - 2002 కింద చేపట్టిన ఆస్తి వేలాన్ని సమర్థించింది. దీనిపై ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు.
'సుప్రీంకోర్టుకు వెళ్తా'
బ్యాంక్ వాళ్లు తన ఆస్తిని అన్యాయంగా విక్రయించారని ఆరోపించారు బండ్ల గణేష్. 'అన్యాయంగా, లోపాయికారీ ఒప్పందంతో మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ధరకే బ్యాంక్ అధికారులు నా ఆస్తిని సేల్ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ 2022లో నేను కోర్టును ఆశ్రయించా. ఈ కేసులో కింది డీఆర్‌టీ (DRT)లో నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, తాజాగా హైకోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
అయినప్పటికీ నాకు భారత న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించి, నిజాయతీగా నా హక్కుల ఆధారంగా న్యాయం సాధిస్తాననే అచంచలమైన విశ్వాసం నాకు ఉంది.' అంటూ రాసుకొచ్చారు.
అసలేంటీ వివాదం?
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ రికవరీలో భాగంగా బండ్ల గణేశ్, ఆయన ఫ్యామిలీకి చెందిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తిని విక్రయించింది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును ఆస్తి యజమానులకు చెల్లించాలంటూ రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (DRT) ఆర్డర్స్ ఇష్యూ చేసింది. వీటిని సవాల్ చేస్తూ... యూనియన్ బ్యాంక్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. 2019లో ఆస్తిని స్వాధీనం చేసుకుని... 2022లో వేలం నిర్వహించగా రూ.8.51 కోట్లు వచ్చిందిన కోర్టుకు తెలిపింది బ్యాంక్.
డీఆర్‌టీ ఉత్తర్వుల్లో లోపాలున్నాయని... రుణ గ్రహీత కంపెనీకి సంబంధించి దివాళా ప్రక్రియ ప్రారంభమైనంత మాత్రాన వ్యక్తిగత గ్యారెంటర్ల ఆస్తులపై మారటోరియం వర్తించదని బ్యాంక్ తరఫు లాయర్ వాదించారు. వేలాన్ని సవాల్ చేయడంతో పాటు బ్యాంక్‌పై వేసిన ఇతర పిటిషన్లను ఉప సంహరించుకోవడానికి బండ్ల గణేశ్ అంగీకరించారన్నారు. అదేదీ చేయకుండానే ఆయన డీఆర్‌టీని ఆశ్రయించారని... ట్రిబ్యునల్ బ్యాంక్ రికార్డులను పరిశీలించకుండా వేలాన్ని రద్దు చేసిందన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం... ఆస్తి వేలం సబబేనని తీర్పు ఇచ్చింది.
ట్రెండింగ్ వార్తలు























