Bandi Sanjay: వాడే నిజమైన హిందువు: బండి సంజయ్, తరుణ్ చుగ్‌తో ఖైరతాబాద్ గణపతి దర్శనం
బండి సంజయ్, తరుణ్ చుగ్ ఈ రోజు (సెప్టెంబరు 5) ఉదయం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని 20 కేజీల లడ్డూను వినాయకుడికి సమర్పించారు.
హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిణామాలను బేరీజు వేసుకుంటే హిందువులంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఈరోజు (సెప్టెంబరు 5) ఉదయం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని 20 కేజీల లడ్డూను వినాయకుడికి సమర్పించారు. అనంతరం తరుణ్ చుగ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులు గౌతమ్ రావు తదితరులు గణపతిని దర్శించుకున్నారు.
అనంతరం హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు బండి సంజయ్, తరుణ్ చుగ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
‘‘భాగ్యనగరంలో అతి శక్తిమంతమైన ప్రాముఖ్యం కలిగిన మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. దశాబ్దాలుగా మహా గణపతిని ప్రతిష్ఠిస్తూ ధార్మిక వాతావరణం నెలకొల్పేలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిర్వహకులకు అభినందనలు.
ఆ రోజు బ్రిటీష్ వారిని తరిమికొట్టడానికి హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఈరోజు కూడా కులాలు, మతాలకు అనుగుణంగా సంఘటితం కావాలి. హిందూ సమాజాన్ని కులాలు, వర్గాలు, వర్ణాలు, సంఘాల పేరుతో చీల్చే ప్రమాదం నుండి తప్పించి హిందూ సమాజాన్ని సంఘటితంగా మార్చడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయి.
మనతోపాటు సమాజం కూడా బాగుండాలని కోరుకునే వాడే నిజమైన హిందువు. నిస్వార్థంగా భగవంతుడిని కొలవాలి. హిందువుగా పుట్టడం మన పూర్వ జన్మసుక్రుతం. వారానికో పండుగ.. రోజుకో దేవుడిని కొలిచే గొప్ప పద్ధతి, ఆచారం మన హిందువులకే సొంతం.
నిరంతరం హిందూ సమాజం ఏకం కావాలి. కులాల, వర్గాల, వర్ణాల, సంఘాల పేరుతో హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు అత్యంత ప్రమాదకరం. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి బేరీజు వేసుకోవాలి.
హిందూ సమాజం అంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైంది. హిందూ ధర్మానికి ఆపద వస్తే ప్రతి ఒక్క హిందువు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. హిందువులను సంఘటితం చేయడమే నవరాత్రి, వినాయకత చవితి పర్వదినాల లక్ష్యం’’ అని బండి సంజయ్ మాట్లాడారు.
తెలంగాణలో తరుణ్ చుగ్ నాలుగురోజుల పర్యటన
నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్న తరుణ్ చుగ్, నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. జనగామ జిల్లాలోని చిలుపూరు మండలం చిన్నపెండ్యాలలో దళిత కార్యకర్త, బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బాణాలు శ్రీనివాస్ ఇంట్లో తేనీటి విందుకు హాజరయ్యారు. వారితో కాసేపు మాట్లాడారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలు నిర్వహించారు. ఆదివారం ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం సహా హైదరాబాద్ నేతలతో సమీక్ష చేసే అవకాశం ఉంది. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో భేటీ అయి, అదే రోజు సాయంత్రం తరుణ్ చుగ్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.