Bandi Sanjay Arrest: వాట్సాప్‌లో మెస్సేజ్ చూస్తే కేసులు, అరెస్టులా?: బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ నేతలు ఫైర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సహా బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సహా బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూను బీజేపీ ప్రశ్నిస్తున్నందుకే బీజేపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని సీఎం కేసీఆర్ తీరును తప్పుపట్టారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. వాట్సాప్ లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే దాన్నుంచి రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయడానికి బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వాట్సాప్ లో తనకు వచ్చిన మెస్సేజ్ ను చూస్తే కేసు నమోదు చేసి బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు భయపడే బీఆర్ఎస్ నేతలను పోలీసుల సాయంతో తమ నేతల్ని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన, కవిత లిక్కర్ స్కామ్ కేసులపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా తమ పార్టీ నేతల్ని జైళ్లో వేస్తున్నారని చెప్పారు. ఈ అరెస్టులకు బీజేపీ నేతలు భయపడే రకం కాదన్నారు. బండి సంజయ్ అరెస్టే కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ అరెస్టులపై భయపడాల్సిన అవసరం లేదన్నారు.
డీజేపీకి తెలియకపోవడం సిగ్గుచేటు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏ కేసులో ఓ ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి బండి సంజయ్ అరెస్టుపై ఆరా తీయగా.. కేసు వివరాలను త్వరలో చెబుతానని సమాధానం ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఎంపీని అరెస్ట్ చేసిన వివరాలు డీజీపీకి తెలియకపోవడం సిగ్గు చేటని, కారణం తెలియకుండానే పోలీసులు అరెస్టులు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
పాలనపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారు.. ధర్మపురి అర్వింద్
బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నా వెనక్కి తగ్గేది లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అవినీతి మితిమీరిపోయిందని, అందుకే విపక్షాలకు మొత్తం ఖర్చు పెడతానని ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకులు, రైతుల ఆత్మహత్యలతో కేసీఆర్ పాలన గాడి తప్పిందన్నారు. పేపర్ లీకేజీలపై ప్రశ్నిస్తున్నామని బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని, అడ్మినిస్ట్రేషన్ పై కేసీఆర్ పట్టుకోల్పోతున్నారనడానికి ఇదే నిదర్శనం అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. హైదరాబాద్‌లో తన ఇంటికి కూడా పోలీసులు వచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని, ప్రధాని రాష్ట్రానికి రానున్న సమయంలోనే కేసీఆర్ డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు. త్వరలోనే లిక్కర్ కేసులో నిజాలు బయటకు వస్తాయన్నారు.
టెర్రరిస్ట్, నక్సలైట్ ను తీసుకెళ్లినట్లు అరెస్ట్ చేస్తారా!
బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీని నోటీసులు, వారెంట్ లేకుండా రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం సరికాదన్నారు. టెర్రరిస్ట్, నక్సలైట్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్ర పోలీసులకు సీఎం కేసీఆర్ కొత్త పీనల్ కోడ్ అమలు చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీలపై ప్రశ్నిస్తున్నామని టెన్త్ పేపర్ లీక్ కేసుతో లింక్ పెట్టి బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు.