Balapur Laddu Auction: బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర - రూ. 35 లక్షలకు వేలం దక్కించుకున్న దశరథ్ !
Balapur Ganesh laddu: బాలాపూర్ గణేశుని లడ్డూ వేలం 35 లక్షలు పలికింది. లింగాల దశరథ్ గౌడ్ ఈ సారి లడ్డూను దక్కించుకున్నారు.

Balapur Ganesh laddu auction fetches Rs 35 lakhs: బాలాపూర్ గణేష్ లడ్డూను రూ. 35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దక్కించుకున్నారు. 2024లో రూ. 30.01 లక్షలకు కొలన్ రామిరెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఐదు లక్షలు ఎక్కువగా వేలం నమోదు అయింది. కర్మాన్ ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ సారి వేలంతో ఆయనతోపాటు మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్), అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి (ఎల్బీ నగర్) , కంచర్ల శివారెడ్డి (కర్మాన్‌ఘాట్) , సామ రాంరెడ్డి (దయా, కొత్తగూడెం, కందుకూరు) , పీఎస్‌కే గ్రూప్ (హైదరాబాద్) , జిట్టా పద్మా సురేందర్ రెడ్డి (చంపాపేట్) కూడా వేలంలో పాల్గొన్నారు. అయితే వీరందరూ..35 లక్షలకు రాగానే ఆగిపోయారు. లింగాల దశరథ్ గౌడ్ విజేతగా నిలిచారు. ఇతర చోట్ల లడ్డూలు దక్కించుకున్న వారు తర్వాత ఏడాది.. వినాయక చవితి నాటికి చెల్లిస్తారు. కానీ బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నవారు అప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలి. దశరథ్ గౌడ్ బాలాపూర్ ఉత్సవ కమిటీ అప్పటికప్పుడు డబ్బులు చెల్లించారు.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం 1994లో మొదలైంది. అప్పటి నుంచి ఇది హైదరాబాద్‌లోని గణేష్ ఉత్సవాల్లో అత్యంత ఆసక్తికరమైన సంప్రదాయంగా మారింది. తొలి వేలంలో లడ్డూ కేవలం రూ. 450కి వేలం వేయగా అది అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది రూ.35 లక్షలకు చేరింది. ఈ లడ్డూ సంపద, శ్రేయస్సు, వ్యాపార విజయాన్ని తెచ్చిపెడుతుందని భక్తులు, వ్యాపారవేత్తలు నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగా వేలంలో పోటీ ఏటా పెరుగుతోంది.వేలం ముగిసిన వెంటనే .. బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు శోభాయాత్ర ప్రారంభించారు.
బాలాపూర్ లడ్డూ వేలం కేవలం ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదు, ఇది సామాజిక, రాజకీయ ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. వేలంలో పాల్గొనే బిడ్డర్లు తమ సామాజిక హోదాను, వ్యాపార శక్తిని చాటుకునే అవకాశంగా దీనిని భావిస్తారు. ఈ సంప్రదాయం హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. గతంలో బాలాపూర్ లడ్డూనే అధిక ధరకు పాడుకునేవారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో లడ్డూ వేలం అనేది ఓ సంప్రదాయంగా మారింది. దాదాపుగా అన్ని గణేష్ మండపాల్లో ఇప్పుడు లడ్డూ వేలం వేస్తున్నారు.
కొన్ని ధనవంతులు ఉండే కమ్యూనిటీల్లో లడ్డూ వేలం సరికొత్త రికార్డులుసృష్టిస్తోంది. రిచ్ మండ్ విల్లాస్ లో లడ్డూను ఓ వ్యాపారి రెండు కోట్లకుపైగా మొత్తానికి దక్కించుకున్నారు. అలాగే మైహోం భూజా అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో రూ. 51 లక్షలకు దక్కించుకున్నారు. ఈ ట్రెండ్ అన్ని చోట్లా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణేష్ లడ్డూలు తమకు సిరి సంపదలు తెస్తాయని భక్తులు గట్టి నమ్మకంతో ఉన్నారు.





















