Apollo Cancer Centre: అపోలో హాస్పిటల్స్ అద్భుతం, తెలుగు రాష్ట్రాల్లో మొదటి క్యాన్సర్ సెల్ థెరపీ సక్సెస్
CAR T Cell Therapy: క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంట్‌కు అపోలో క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్, చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టి-సెల్ థెరపీని విజయవంతంగా నిర్వహించింది.
Apollo Hospitals Sangita Reddy: హైదరాబాద్: బ్లడ్ క్యాన్సర్ కండిషన్ (Multiple myeloma)తో బాధపడుతున్న పేషెంట్‌కు అపోలో క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్, చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టి-సెల్ (CAR-T) థెరపీని విజయవంతంగా నిర్వహించింది. దాంతో క్యాన్సర్ చికిత్సలో మరో మైలు రాయిని చేరుకుంది. భారతదేశంలోని పేషెంట్లకు అందుబాటులో ఉన్న ఇమ్యునోథెరపీ (Immunotherapy)లలో ఇది ముఖ్యమైనది. కరీంనగర్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ మల్టీపుల్ మైలోమాతో బాధపడుతూ అపోలో కాన్సర్ సెంటర్ వైద్యులను సంప్రదించారు. ఈ సమస్యకు చికిత్స కేవలం CAR-T థెరపీ ద్వారానే అందిచగలుగుతామని భావించిన డాక్టర్లు ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని ఈ ప్రొసీజర్ ను ప్రారంభిచారు.
CAR-T సెల్ థెరపీని 'లివింగ్ డ్రగ్స్' అని కూడా అంటారు. అఫెరిసిస్ ప్రక్రియ ద్వారా రోగి T- కణాలను (క్యాన్సర్ కణాలతో పోరాడే ఒక రకమైన తెల్ల రక్త కణాలు) వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన T- కణాలను వైరల్ వెక్టార్ పద్దతి ద్వారా జన్యుపరమైన మార్పులు చేస్తారు. తద్వారా చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్స్ (CARs) గా తయారవుతాయి. ఈ కార్స్(CARs) అసాధారణంగా ఉన్న క్యాన్సర్ కణాలపై ప్రయోగిస్తారు. ఆ తర్వాత వాటిని కావలసిన మోతాదుకు పెంచి, నేరుగా రోగికి శరీరంలోకి ఎక్కిస్తారని అపోలో కాన్సర్ సెంటర్ హెమటాలజిస్ట్ అండ్ BMT స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి తెలిపారు.
క్యాన్సర్ బాధితులకు కార్ టీ సెల్ థెరఫీ ఓ వరం అని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మంది రోగుల జీవితాలలో వెలుగులు నింపిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 25,000 మంది రోగులకు వైద్యులు ఈ ప్రక్రియ ద్వారా విజయవంతంగా చికిత్సను అందించారని తెలిపారు. CAR-T సెల్ థెరపీ ద్వారా, B-సెల్ లింఫోమాస్, లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా, మైలోమాస్ లకు కూడా చికిత్సను అందించవచ్చని చెప్పారు.
CAR-T సెల్ థెరపీని విజయవంతంగా నిర్వహించిన అపోలో క్యాన్సర్ సెంటర్ వైద్యులను అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి అభినందించారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో అపోలో హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు.