TTD News: TTD News: తిరుమలలో హైలెవెల్ సెక్యూరిటీ ఆడిట్, ప్రత్యేక కమిటీ - కీలక నిర్ణయాలు
తిరుమలలో భద్రతను ఆధునికీకరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో తిరుమల అన్నమయ్య భవన్‌లో ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్ జరిగింది. కోవిడ్ అనంతరం తిరుమలకు యాత్రికులు పెరగడం, వాహనాల రద్దీ పెరగడంతో భద్రతను ఎలా పెంచాలనే విషయమై చర్చించడానికి టీటీడీ భద్రతాధికారులు, పోలీసు శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలకు పటిష్టమైన భద్రత కోసం అన్ని దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని హరీష్ కుమార్ గుప్తా అభిప్రాయపడ్డారు. అంతకుముందు, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తిరుమలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన భద్రత, ఇంకా భద్రతను మరింత పటిష్టం చేయవలసిన ప్రదేశాల గురించి తెలియజేశారు.
అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి, ఓఎస్డీ ఐఎస్ డబ్ల్యూ శశిధర్ రెడ్డి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీసు, అటవీ, అగ్నిమాపక, ఇతర బలగాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. టీటీడీ తరఫున జేఈవో వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, వీజీవోలు బాలిరెడ్డి, మనోహర్, గిరిధర్‌రావుతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు..
తిరుమలలో భద్రతను ఆధునికీకరించేందుకు ఏరియా డామినేషన్, ఇంటెలిజెన్స్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆయన మాట్లాడుతూ తిరుమల భద్రతపై ఎస్పీ స్థాయి అధికారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ సభ్యులు పదిరోజుల్లోగా క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇస్తారు. ఆ సిఫార్సులపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి అవసరమైన అధునాతన యాంత్రిక పరిజ్ఞానాన్ని ఏర్పాటుచేసుకుని ప్రభుత్వ అనుమతితో ముందుకు వెళ్లి తిరుమలకు ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. తితిదేపై సైబర్ దాడులు జరగకుండా అత్యున్నత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు సూచనలు చేస్తామని, తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నాన్నట్లు తెలిపారు. తిరుమలలో పనిచేసే పోలీసులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని, ఆలయ పరిసర ప్రాంతాల్లో పూర్తి ఆయుధాలతో కూడిన క్విక్ రియాక్షన్ టీమ్‌లు నిరంతరం గస్తీ తిరిగేలా ఏర్పాటు చెయ్యాలని పేర్కొన్నారు.
ఇక్కడ ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ ఏర్పాటుపై కమిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని తెలిపారు. నిన్న…ఇవాళ భధ్రతా ఏర్పాట్లు పై సమిక్షా సమావేశం నిర్వహించామని హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరిష్ కుమార్ గుప్తా తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి భధ్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తామన్నారు. తనిఖీలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు బాడీ స్కానర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించామని అన్నారు. తిరుమలలో పలు కీలక ప్రాంతాలను, శ్రీవారి ఆలయాన్ని పరిశీలించారు కమిటీ సభ్యులు. హోంశాఖ ప్రిన్సిఫల్ సెక్రటరి హరిష్ కుమార్ గుప్తా అధ్వర్యంలో తిరుమల భధ్రతా ఏర్పాట్లు పై సమిక్షా సమావేశం నిర్వహించామని డిఐజి అమ్మిరెడ్డి పేర్కొన్నారు.
భధ్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్ర స్థాయిలో పరిశిలన జరపడానికి ఎస్పి లేదా ఏఏస్పి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏడు కమిటిలు ఏర్పాటు చేసామని అన్నారు. 15 రోజులు పాటు కమిటిలు పరిశిలన జరిపి నివేదిక సమర్పిస్తూందని, కమిటి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు. తిరుమల తిరుపతి లో అన్ని ముఖ్య కూడలి లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిశీలించి భద్రత మెరుగుపరచడానికి నివేదిక తయారు చేస్తామన్నారు.