hyderabad News : హైదరాబాద్‌లో మరో పాకిస్థానీ - ఇది కూడా లవ్ స్టోరీనే !
హైదరాబాద్‌లో ఎలాంటి పత్రాలు లేని ఓ పాకిస్థానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ కోసం సరిహద్దులు దాటి వచ్చినట్లుగా ఆ యువకుడు చెబుతున్నాడు.
hyderabad News : హైదరాబాద్ లో ఆధార్ కార్డు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థానీ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇతను కూడా ఓ ప్రేమ కథలో భాగంగా ఇండియాలో చొరబడ్డాడన్న కథలు చెబుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో కానీ పాకిస్తానీ వ్యవహారం భద్రతా వర్గాల్లోనూ సంచలనంగా మారింది.
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తూంఖ్వా కు చెందిన ఫయాజ్అహ్మద్ ఉపాధి కోసం 2018 దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో అతను పనికి కుదిరాడు. హైదరాబాద్ బహదూర్ పుర ఠాణ్ పరిధిలోని కిషన్ బాగ్ చెందిన నేహా ఫాతిమా కూడా ఉపాధి కోసం దుబాయి వెళ్లింది. ఆమె అక్కడ ఉద్యోగం వెతుక్కోవడంలో ఫయాజ్ అహ్మద్ సాయం చేశాడు. తను పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో 2019లో వారు పెళ్లి చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు.
ఆ తర్వాత ఫాతిమా కుమారిడితో ఇండియాకు వచ్చింది. ఫయాజ్ అహ్మద్ కూడా పాకిస్థాన్ కు వెళ్లిపోయాడు. ఫాతిమా తల్లిదండ్రులు పాకిస్థాన్ లోని ఫయాజ్ ను సంప్రదించారు. ఇండియాకు రావాల్సిందిగా కోరారు. తాము ఇక్కడ అన్ని చూసుకుంటామని ఫయాజ్ కు హామీ ఇవ్వడంతో ఫయాజ్ 2022లో ఎలాంటి గుర్తింపు పత్రలు లేకున్నా నేపాల్ వెళ్లాడు. అక్కడికి ఫాతిమా తల్లితండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగం వెళ్లారు. ఫయాజ్ తో మాట్లాడి అక్రమంగా అతన్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఫయాజ్ ఏడాది కాలంగా హైదరాబాద్ లోని కిషన్ బాగ్ లో ఉంటున్నాడు. హైదరాబాద్ లోనే పని చేసుకుంటున్నాడు.
పాకిస్థానీ అయిన ఫయాజ్ కు భారతీయుడిగా గగుర్తింపు పత్రాలు ఇప్పించాలని అత్తామామలు ప్రయత్నించారు. ఆధార్ కార్డు కోసం ఫయాజ్ ను మాదాపూర్ లోని ఓ ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లారు. తమ కుమారుడు గౌస్ పేరిట రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించారు. ఫేక్ బర్త్ సర్టిఫికేట్ సడ్మిట్ చేశారు. అనుమానం వచ్చిన ఆధార్ నిర్వహకులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఫయాజ్ నుంచి పోలీసులు పలు విషయాలపై ఆరా తీశారు.
ఇదే సమయంలో సదరు యువతి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చింది. మహ్మద్ ఫయాజ్ ను చూపించాలని పోలీసులను వేడుకుంది. అయితే, ఫయాజ్ నుంచి పూర్తి విషయాలు తీసుకున్న తర్వాతే.. పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ అనే మహిళ తన నలుగురు పిల్లలతో పబ్జీలో పరిచయమై యువకుడి కోసం అక్రమంగా ఉత్తరప్రదేశ్ వచ్చిన ఇష్యూ ఇంకా దేశం మరిచిపోలేదు. అయితే, అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ.. తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లా ఖాన్ ను కలిసేందుకు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఫ్రావిన్స్ లోని దీర్ నగరానికి వెళ్లింది. ఇప్పుడీ ఫయాజ్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.