Digvijay Singh: హైదరాబాద్‌కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్ - ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తొలి భేటీ!
Congress General Secretary Digvijay Singh: ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన దిగ్విజయ్ సింగ్ బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయనికి చేరుకున్నారు.
Congress General Secretary Digvijay Singh: తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ బుధవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన దిగ్విజయ్ సింగ్ బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయనికి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌కి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రోటోకాల్ ఇంఛాచార్జ్ వేణుగోపాల్ రావ్, సంగిశెట్టి జగదీష్ ఘన స్వాగతం పలికారు. దిగ్విజయ్ సింగ్‌కు శాలువా కప్పిన నేతలు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు.
ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌కు దిగ్విజయ్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నియమించిన టీపీసీసీ కొత్త కమిటీలు కాంగ్రెలో కలకలం రేపుతున్నాయి. కొందరు నేతలు తమను పార్టీ పట్టించుకోలేదని బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని చక్కబెట్టేందుకు దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్‌కు పంపించింది. తాజ్ కృష్ణ హాటల్ లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో దిగ్విజయ్ భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.
మునుగోడు ఎన్నికల ప్రచార సమయంలో వెంకటరెడ్డి ఆడియో వైరల్ కావడం, విదేశాల్లోనూ మాట్లాడుతూ పార్టీ గెలిచేది లేదని వ్యాఖ్యానించడం హైకమాండ్ కు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. వివరణ కోరుతూ ఎంపీ వెంకటరెడ్డికి క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారాలతో పాటు టీపీసీసీ తాజా కమిటీల నియామకం, కొందరు సీనియర్లలో అసంతృప్తి అంశంపై చర్చించే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం 4.30 గంటల తరువాత మీడియాకు అన్ని విషయాలు చెబుతానన్నారు దిగ్విజయ్. గాంధీ భవన్ లో నాయకులతో మాట్లాడేందుకు గురువారం ఉదయం 11 గంటల నుంచి దిగ్విజయ్ సింగ్ అందుబాటులో ఉంటారు. కమిటీలలో చోటు దక్కని నేతలు, పార్టీలో అసంతృప్త నేతలతో వరుస భేటీల తరువాత మీడియాతో మాట్లాడతానని దిగ్విజయ్ అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ విచ్చేశారు. ఆయన కాంగ్రెస్ అసంతృప్త నేతలతో సమావేశం అవుతారు. ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీలలో ఎక్కువ మంది వలస నేతలకు పదవులను కట్టబెట్టారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని కమిటీల నియామకంపై తమ నిరసనను సీనియర్ నేతలు వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ దిగి వచ్చింది. సలహాదారుడిగా దిగ్విజయ్ సింగ్ ను హైకమాండ్ నియమించింది. దీంతో దిగ్విజయ్ పలువురు సీనియర్ నేతలకు ఫోన్లు చేసి తొందరపడవద్దని చెప్పారు. దీంతో మంగళవారం సాయంత్రం జరగాల్సిన సమావేశాన్ని రద్దుచేశారు. హైదరాబాద్ కు వచ్చి నతర్వాత దిగ్విజయ్ కీలక నేతలతో, అసహనం వ్యక్తం చేసిన సీనియర్లతో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. సీనియర్ నేతల అభ్యంతరాలను విని హైకమాండ్ కు నివేదిక ఇస్తారని చెబుతున్నారు.